నేనోరకం

సాయిరాం శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం “నేనోరకం”. రష్మీ మీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ఓ ముఖ్యభూమిక పోషించడం విశేషం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు థ్రిల్ చేసిందో చూద్దాం..!!

కథ : గౌతమ్ (సాయిరాం శంకర్) ఓ ప్రయివేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుంటాడు. తొలిచూపులోనే స్వేచ్ఛ (రష్మీ మీనన్)ను ప్రేమిస్తాడు. ఆమె మెప్పును పొందడం కోసం అనుకోకుండా చేసిన కొన్ని తప్పులు గౌతమ్ జీవితంలో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తాయి. అప్పటివరకూ ఎవరికీ పరిచయం లేని కనీసం ఎవరో తెలియని వ్యక్తి (శరత్ కుమార్) గౌతమ్ జీవితంలోకి ప్రవేశిస్తాడు. అసలు గౌతమ్ చేసిన తప్పేమిటి? శరత్ కుమార్ కారణంగా గౌతమ్ ఎదుర్కొన్నా సమస్యలేమిటి? అనేది “నేనోరకం” చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు : హిట్టు కొట్టి చాలా ఏళ్లయ్యిందని జాగ్రత్తపడ్డాడో ఏమో కానీ.. ఎక్కడా అతి అనేది లేకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు సాయిరాం శంకర్. సన్నివేశంలోని ఇంటెన్సిటీని, ఎమోషన్ ను చాలా హుందాగా క్యారీ చేశాడు. అయితే ఎప్పట్లానే డైలాగ్ డెలివరీ విషయంలో మాత్రం తేలిపోయాడు. మలయాళ కథానాయకి రష్మీ మీనన్ అభినయం-అందం కలబోసిన పరిపూర్ణమైన యువతిగా ప్రేక్షకుల్ని మెప్పించింది. డైలాగ్ లిప్ సింక్ లేకపోయినా.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆ మైనస్ ను ప్లస్ గా మార్చేసుకొంది. హీరోహీరోయిన్ల తర్వాత చెప్పుకోవాల్సింది శరత్ కుమార్ గురించి. ఆంగ్ల చిత్రమైన “ఫోన్ బూత్”లోని కెయిఫర్ పాత్రను గుర్తుకు తెస్తుంది. అయితే.. శరత్ కుమార్ తన మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆ పాత్రను మరింతగా రంజింపజేశాడు. దివంగత కమెడియన్ ఎం.ఎస్.నారాయణ ఈ చిత్రంలో కడుపుబ్బ నవ్వించారు. వైవాహర్ష కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ చక్కని హాస్యాన్ని పంచాయి. మిగతా కామెడియన్లు ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నించినా అవన్నీ విఫలయత్నాలే అయ్యాయి.

సాంకేతికవర్గం పనితీరు : స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి తమ్ముడైన మహిత్ నారాయణ్ మంచి మెలోడీస్ తోపాటు ఆకట్టుకొనే నేపధ్య సంగీతంతో అలరించాడు. “పిడికెడు నడుము, చూడకుండా ఉండలేనే” పాటలు వినసోంపుగానే కాక సాహిత్యం పరంగానూ బాగున్నాయి. సిద్దార్థ రామస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఫిక్స్డ్ ఫ్రేమ్స్ తోనే చాలా ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. చాలా షాట్స్ లో బడ్జెట్ లిమిటేషన్స్ కనిపించాయి. కానీ.. ఒక టెక్నీషియన్ గా సినిమాకి మంచి ఔట్ పుట్ ఇచ్చాడు. నటీనటులను అందంగా చూపించడంతోపాటు రన్నింగ్ షాట్స్ ను క్రేన్ యూజ్ చేయకుండా మేనేజ్ చేసిన విధానం ప్రశంసనీయం. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ టెక్నిక్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఫ్రేమ్ టు ఫ్రేమ్ కనెక్టివిటీ బాగా సింక్ చేశాడు.

నిర్మాణ విలువలు పాటల చిత్రీకరణవరకూ బానే ఉన్నా.. చాలా సన్నివేశాల్లో పేలవంగా ఉన్నాయి. ఓవరాల్ గా పర్వాలేదనే చెప్పాలి. దర్శకుడు సుదర్శన్ సలేంద్ర రాసుకొన్న కథ చాలా చిన్నది మాత్రమే కాదు పాతది కూడా. అయితే.. కథనాన్ని నడిపించడం కోసం ఎంచుకొన్న అంశాలు, ఆ అంశాలను కరెంట్ ట్రెండ్ కు సెట్ చేసిన విధానం, ఎన్నో సామాజిక సమస్యలను వేలెత్తి చూపించిన విధానం అతడి ప్రతిభకు నిదర్శనం. ఇంకాస్త బెటర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే మంచి ఔట్ పుట్ ఇచ్చేవాడేమో అనిపిస్తుంది. అప్పటికీ తనకున్న పరిమితులతో అద్భుతం అనాదగ్గ రీతిలో కాకపోయినా పర్వాలేదనిపించే స్థాయిలో మెప్పించాడు. ఫస్టాఫ్ మొత్తం కామెడీతో కవ్వించి.. ఆ తర్వాత సస్పెన్స్ తో ప్రేక్షకుడ్ని సీట్లో కూర్చోబెట్టేశాడు. ఆ కారణంగా మధ్యలో కాస్త ల్యాగ్ వచ్చినా పర్లేదులే అనుకోని ప్రేక్షకుడు కూడా క్లైమాక్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూడడం జరుగుతుంది.

విశ్లేషణ : కొత్త కథేమీ కాదు కానీ.. వైవిధ్యమైన కథనంతో అలరించే చిత్రం “నేనోరకం”. శరత్ కుమార్ మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్, సాయిరాం శంకర్ ఇంటెన్స్ యాక్షన్ చాలా సాదాసీదా కథను వైవిధ్యమైన చిత్రంగా మలిచాయి. మరీ భీభత్సమైన ఎంటర్ టైన్మెంట్ కోరుకోకపోతే.. “నేనోరకం”పర్వాలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2/5

Click Here For ENGLISH Review

Share.