నెక్స్ట్ నువ్వే

ఇటీవల “శమంతకమణి”తో సూపర్ హిట్ అందుకొన్న ఆది కథానాయకుడిగా రూపొందిన హారర్ థ్రిల్లర్ “నెక్స్ట్ నువ్వే”. తమిళ హిట్ చిత్రం “యామిరుక్క భయమే”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థలైన గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2, యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా స్థాపించిన “v4 మూవీస్” ద్వారా నిర్మించడం విశేషం. అలాగే.. సీరియల్ ఆర్టిస్ట్ టర్నడ్ డైరెక్టర్ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం..!!

కథ : కిరణ్ (ఆది) ఓ సీరియల్ డైరెక్టర్, తాను తీస్తున్న “సంసారం సేమియా ఉప్మా” అనే సీరియల్ సూపర్ హిట్ అయిపోయి రాజమౌళి రేంజ్ కి వెళ్లిపోవాలనుకొంటాడు. కట్ చేస్తే.. ఆ సీరియల్ ప్రసారాన్ని ప్రేక్షకుల కోరిక మేరకు టీవి చానల్ వారు ఆపేస్తారు. దాంతో ఉన్నట్లుండి 50 లక్షల రూపాయల అప్పులో కూరుకుపోతాడు. ఈ అప్పు నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న తరుణంలో తన తండ్రి అరకులో తనకోసం ఓ ప్యాలెస్ కొన్నాడని తెలుసుకొని, తన ప్రేయసి స్మిత (వైభవి)తో సహా అక్కడకి చేరుకొంటాడు. అక్కడ కిరణ్ కి పరిచయమవుతారు శరత్ (బ్రహ్మాజీ) మరియు అతడి హాట్ సిస్టర్ రష్మీ (రష్మీ గౌతమ్).

ఈ నలుగురు కలిసి అరకులో “హిల్ టాప్ రిసార్ట్స్”ను ప్రారంభిస్తారు. ఓపెనింగ్ రోజునే ఒక జంట రిసార్ట్ కి వచ్చి అక్కడే చనిపోతారు. ఆ తర్వాత కొందరు రావడం చనిపోవడం తరచుగా జరుగుతుంటుంది. అసలు రిసార్ట్ కు వచ్చినవాళ్ళందరూ వరుసబెట్టి ఎందుకు మరణిస్తుంటారు? అందుకు గల కారణం ఏమిటి? అనేది “నెక్స్ట్ నువ్వే” చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు : లవర్ బోయ్ లేదా మాస్ ఇమేజ్ కోసం మొన్నటివరకూ వెంపర్లాడిన ఆది “శమంతకమణి” నుండి కాన్సెప్ట్ మూవీస్ ను సెలక్ట్ చేసుకొంటూ వస్తున్నాడు. “నెక్స్ట్ నువ్వే” కూడా ఆ తరహా సినిమానే. తన ఏజ్ తోపాటు ఈజ్ కి కూడా తగ్గ పాత్రలో ఆది మెప్పించాడు. వైభవి మరాఠీ అమ్మాయి అయినప్పటికీ.. మొదటి తెలుగు చిత్రానికే లిప్ సింక్, ఎక్స్ ప్రెషన్స్ విషయంలో అలరించింది. అండంతోపాటు అభినయ సామర్ధ్యం కూడా పుష్కలంగా ఉన్న కథానాయికగా వైభవి ఈ చిత్రంతో ప్రూవ్ చేసుకోవడం విశేషం.

బ్రహ్మాజీ ఈ చిత్రానికి మెయిన్ ఎస్సెట్. ఎక్కడా అతి చేయకుండా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో విశేషమైన కామెడీ పండించాడు. హీరో కంటే ఎక్కువ స్క్రీన్ ప్రెజన్స్ బ్రహ్మాజీదనే చెప్పాలి. రష్మీ తనకు బాగా అలవాటైన హాట్ బేబీ రోల్ లో రెచ్చిపోయింది. అయితే.. అసభ్యత లేకుండా కేవలం ఎక్స్ ప్రెషన్స్ అండ్ డైలాగ్స్ తో రష్మీ ఆకట్టుకోవడం విశేషం. వీళ్ళందరి తర్వాత సినిమాలో నటనతో మెప్పించిన నటి హిమజ. ఈమె క్యారెక్టర్ కు సరైన జస్టిఫికేషన్ లేకపోయినప్పటికీ.. తన పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను థ్రిల్ చేసింది.

సాంకేతికవర్గం పనితీరు : సాయికార్తీక్ సాంగ్స్ రెగ్యులర్ గా ఉన్నప్పటికీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ అండ్ డి.ఐతో హారర్ జోనర్ మూవీకి కావాల్సిన అన్నీ అంశాలను పుష్కలంగా సమకూర్చాడు. కార్తీక్ పళని తక్కువ బడ్జెట్ లో ఎక్కువ అవుట్ పూట్ ఇచ్చాడు. సీజీ వర్క్ కు తక్కువ స్కోప్ ఉండేలా కుదిరినంతలో తన కెమెరా టెక్నిక్స్ తోనే భయాన్ని క్రియేట్ చేశాడు. నిర్మాణ విలువలు కొన్ని చోట్ల తేలిపోయినప్పటికీ.. కాన్సెప్ట్ మూవీ కాబట్టి ఇంతకుమించి ఎక్కువ పెట్టడం కూడా వేస్టేలే అనిపిస్తుంది. అయితే.. గ్రాఫిక్స్ విషయంలో కాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది.

దర్శకుడు ప్రభాకర్ తన మొదటి చిత్రంతో తన ప్రతిభను ఘనంగా చాటుకోవాలనుకొన్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేసిన ప్రభాకర్.. సెకండాఫ్ లో కాస్త తడబడ్డాడు. అసలు దెయ్యం రిసార్ట్ లో ఎందుకుంది? ఆమె వెనుక ఉన్న స్టోరీ ఏమిటి? వంటి విషయాల్లో క్లారిటీ ఇవ్వలేదు. అలాగే.. చాలా లాజిక్స్ ను కూడా మిస్ అయ్యాడు. అయితే.. అవన్నీ బ్రహ్మాజీ కామెడీ పుణ్యమా అని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరనుకోండి. కానీ.. లాజిక్స్ ను కూడా సరిగ్గా మేనేజ్ చేసి ఉంటే సినిమా రిలజ్ట్ ఇంకాస్త బెటర్ గా ఉండేదేమో.

విశ్లేషణ : హారర్ కామెడీ చిత్రాలు ఎన్నొచినా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. “నెక్స్ట్ నువ్వే” కూడా ఆ తరహా చిత్రమే. బ్రహ్మాజీ కామెడీ కొన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తే, రష్మీ అందాలు ఇంకొందర్ని ఆనందింపజేస్తాయి. సో, ఓవరాల్ గా టైమ్ పాస్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ “నెక్స్ట్ నువ్వే”.

రేటింగ్ : 2/5

Click Here For ENGLISH Review

Share.