లంక

నిన్నటితరం కథానాయిక రాశి కీలకపాత్ర పోషించిన చిత్రం “లంక”. టెలిపతీ అనే థీమ్ ను బేస్ చేసుకొని తెరకెక్కిన ఈ థ్రిల్లర్ కు రాశి భర్త ఎస్.ఎస్.నివాస్ అలియాస్ శ్రీముణి దర్శకుడు. రీఎంట్రీ సినిమాతో రాశి జనాల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : ఒక షార్ట్ ఫిలిమ్ తీసి, దాన్ని బేస్ చేసుకొని డైరెక్టర్ అయిపోదామని కలలు కనే కుర్రాడు సాయి (సాయి రోనక్), తన స్నేహితులైన సత్య, సుదర్శన్ తో కలిసి ఆ షార్ట్ ఫిలిమ్ ను పూర్తి చేయాలనుకొంటాడు. హీరోయిన్ కోసం వెతుకుతుండగా కనిపిస్తుంది స్వాతి (ఈనా సాహా). మలయాళంలో టాప్ హీరోయిన్ మరియు నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన స్వాతి ఎవరో తెలియక షార్ట్ ఫిలిమ్ లో నటించమని కోరతారు సాయి అండ్ ఫ్రెండ్స్.

అప్పటికే ఒక ఆపదలో ఉన్న స్వాతి వారి అభీష్టాన్ని అర్ధం చేసుకొని వారి షార్ట్ ఫిలిమ్ లో యాక్ట్ చేయడానికి ఒప్పుకొంటుంది. షూటింగ్ కోసం ఊరికి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌస్ కి చేరుకొంటారు. అక్కడ వారికి పరిచయమవుతుంది రెబెకా విలియమ్స్ (రాశి). ఒక విధమైన ఫోబియాతో బాధపడుతున్న స్వాతికి ఆసరాగా నిలిస్తుంది రెబెకా. వారి పరిచయం కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఏమిటా సమస్యలు, అసలు స్వాతి ఎదుర్కొంటున్న ఆపద ఏమిటి అనేది “లంక” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు : కీలకపాత్రధారి రాశి తాన పోషించిన “రెబెకా విలియమ్స్” పాత్రకి పూర్తి న్యాయం చేసింది. వేషధారణ, హావభావాల ప్రదర్శనలోనే కాకుండా డీటెయిలింగ్ లోనూ తన సీనియారిటీని ప్రూవ్ చేసుకొంది. ఈనా సాహా కనిపించడానికి కాస్త అందంగా ఉందన్న మాటే కానీ.. లిప్ సింక్ లేక సన్నివేశంలోని ఎమోషన్ ను సరిగా ఎలివేట్ చేయలేక, గ్రాఫిక్స్ సీన్స్ లో పర్ఫెక్ట్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వలేక తాను నానా ఇబ్బందులూ పడుతూ ప్రేక్షకులను కూడా ఇబ్బందిపెట్టింది. సాయిరోనక్ కొత్త కుర్రాడు కాబట్టి ఇంకా పరిణితి చెందాల్సి ఉంది. ఏ ఎమోషన్ నూ సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు. సత్య, సుదర్శన్ లు తమదైన శైలిలో పండించాలని ప్రయత్నించిన కామెడీ వర్కవుట్ అవ్వలేదు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా సుప్రీత్, సాడిస్ట్ గా ఆనంద్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : శ్రీచరణ్ పాకాల వెస్ట్రన్ మ్యూజిక్ ని రెట్రో మిక్స్ చేసి కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ సీన్స్ వరకూ పర్లేదు కానీ.. మామూలు సన్నివేశాలకు కూడా అదే తరహా సంగీతం అంటే ప్రేక్షకుడికి మింగుడుపడడం కాస్త కష్టమే. వి.రవికుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. డ్రోన్ షాట్స్ లో గోవా అందాలను ఆకట్టుకొనే విధంగా తెరకెక్కించాడు. ఫిక్స్డ్ ఫ్రేమ్స్ తో కాకుండా చేత్తో కెమెరా హ్యాండిల్ చేసి హారర్ సీన్స్ కోసం రోలర్ షాట్స్ ను క్రియేట్ చేసిన విధానం సత్ఫలితాన్నివ్వలేదు కానీ.. కొత్త కెమెరామెన్లకు ఇది ఉపయోగపడుతుంది. జంప్ స్కేర్ షాట్స్ ఎక్కువయ్యాయి. సాధారణంగా హారర్ సినిమాల్లో ఎక్కువగా వాడే ఈ షాట్స్ ను థ్రిల్లర్ కు వాడడం కూడా మైనస్ అయ్యింది.

నిర్మాతలు పాటల చిత్రీకరణకు పెట్టిన ఖర్చులో సగం డి.ఐ, సౌండ్ మిక్సింగ్ లోనూ పెట్టి ఉంటే సౌండ్ పరంగా బెటర్ అవుట్ పుట్ వచ్చేది. ముఖ్యంగా డి.టి.ఎస్ మిక్సింగ్ సరిగా లేకపోవడం వల్ల 360 డిగ్రీస్ షాట్స్ ను ప్రేక్షకుడు ఎంజాయ్ చేయలేడు. దర్శకుడు అనుకొన్న కథ ఆసక్తికరంగానే ఉంది. అయితే.. కథను రసవత్తరం చేయడం కోసం యాడ్ చేసిన ఇన్నర్ స్టోరీస్ లో క్లారిటీ మిస్ అవ్వడంతో కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్న చందాన మెయిస్ స్టోరీ ప్రేక్షకుడికి రీచ్ అవ్వలేదు. అన్నిటికంటే.. స్క్రీన్ ప్లేతో వేసిన చిక్కుముడులను వేసేప్పుడు చూపిన నేర్పు ఆ మూడులను విప్పేప్పుడు చూపకపోవడంతో ప్రేక్షకుడి సహనం నశించి.. “ఇతనేం చెప్పదలుచుకొన్నాడు?” అని తమను తాము ప్రశ్నించుకొంటూ సినిమా ఎప్పుడవుతుందా అని ఎదురుచూడడం మొదలెడతాడు.

విశ్లేషణ : ట్రైలర్ చూసి ఇదేదో డిఫరెంట్ హారర్ సినిమా అనుకోని థియేటర్లకి వెళ్ళే ప్రేక్షకుల పాలిట రాశిస్వప్నంగా మారిన సినిమా “లంక”. ఏదో తీయబోయి ఇంకేదో తీసినట్లు.. దర్శకుడు చెప్పాలనుకొన్నదాంట్లో క్లారిటీ మిస్ అవ్వడంతో ప్రేక్షకుడి బుర్ర కూడా ప్రొజెక్టర్ లో రీల్ కంటే వేగంగా తిరుగుతూ చిర్రెత్తిస్తుంది. సో, రాశీకి వీరాభిమానులైతే తప్ప “లంక” దరిదారుపలు వెళ్లకపోవడం శ్రేయస్కరం.

రేటింగ్ : 1.5/5

Click Here For ENGLISH Review

Share.