గూఢచారి

“క్షణం” లాంటి డీసెంట్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటించడమే కాక కథ కూడా అందించిన చిత్రం “గూఢచారి”. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి “క్షణం” తరహాలో “గూఢచారి” కూడా ప్రేక్షకులకి ఒక థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించిందా లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి. goodachari-movie-review1

కథ : అర్జున్ అలియాస్ గోపి (అడివి శేష్) తండ్రి చిన్నప్పుడే ఓ కోవర్ట్ ఆపరేషన్ లో చనిపోతాడు. దేశానికి సేవ చేస్తూ చనిపోయిన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా దేశానికి సేవ చేయడం కోసం రా, ఇంటిలిజెన్స్ బ్యూరో, సి.బి.ఐకి అప్లికేషన్స్ పెడుతూనే ఉంటాడు. దాదాపు 174 అప్లికేషన్స్ కి రిప్లై రాకపోయినా సరే ఏమాత్రం నిరుత్సాహపడక 175వ సారి అప్లై చేయగా.. ఈసారి తాను అప్లై చేసిన రా, సి.బి.ఐ, ఐ.బిలకు కాకుండా “త్రినేత్ర” అనే ఇండియన్ సీక్రెట్ వాచ్ డాగ్ ఏజెన్సీకి సెలక్ట్ అవుతాడు.

అయితే.. ఇక్కడ అర్జున్ అలియాస్ గోపీకి తెలియని విషయం ఏంటంటే, అతను త్రినేత్రలో చేరడానికి ముందు నుంచీ అతడ్ని బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ ఏజెన్సీ వాచ్ చేస్తోంది. అతడ్ని ఫాలో అవుతూ వచ్చి ఏకంగా “త్రినేత్ర” చీఫ్ ఆచారి, ఎగ్జిక్యూటివ్ చీఫ్ మెంబర్ దామోదర్ (అనీష్ కురువిల్ల)ల హత్యలో అర్జున్ ని ఫ్రేమ్ చేస్తారు. అసలు బంగ్లాదేశ్ టెర్రరిస్ట్ గ్యాంగ్ కి అర్జున్ తో సంబంధం ఏమిటి? అర్జున్ ని ఫ్రేమ్ చేయడం కోసం అంత పెద్ద నెట్వర్క్ ను బిల్డ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ కాన్స్పిరసీ నుంచి అర్జున్ ఎలా తప్పించుకొన్నాడు? ఈ కాన్స్పిరసీ వెనుక ఉన్నది ఎవరు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు అడివి శేష్-శశికిరణ్ తిక్క చాకచక్యంగా చెప్పిన సమాధానాల సమాహారమే “గూఢచారి” చిత్రం. goodachari-movie-review2

నటీనటుల పనితీరు : అడివి శేష్ “అర్జున్ అలియాస్ గోపి” రోల్ కోసం తనను తాను సిద్ధం చేసుకొన్న తీరు ప్రశంసనీయం. ట్రాన్స్ ఫార్మేషన్ ఎపిసోడ్స్, యాక్షన్ సీక్వెన్స్ లలో అడివి శేష్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకొంటాయి. అలాగే.. హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉండే అడివి శేష్ క్యారెక్టరైజేషన్ సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది. తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ ఈ చిత్రంలో నటన పరంగా పర్వాలేదనిపించుకొంది కానీ.. లుక్స్ పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరీ టైట్ క్లోజ్ ఫ్రేమ్స్ పెట్టడం వల్లనో లేక అమ్మాయి ముఖమే అంతో తెలియదు కానీ.. కాస్త ఇబ్బందిగా కనిపించింది.

అనీష్ కురివిల్ల ఈ చిత్రంలో మంచి పాత్రతో ఆకట్టుకొన్నారు, ఆయన స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. అలాగే.. సుప్రియా యార్లగడ్డ పోషించిన కీలకపాత్ర కథనగమనానికి ఉపయోగపడింది.

వీళ్ళందరికంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచింది మాత్రం జగపతిబాబు. నిజానికి ఈ సమీక్షలో కూడా ఆయన పేరు మెన్షన్ చేయకూడదు అనుకొన్నాను కానీ.. ఆయన సినిమాకి ఎంత పెద్ద ఎస్సెట్ అని చెప్పకపోవడం సమంజసం కాదని భావించి ఈ సినిమాలో ఆయన చాలా టిపికల్ రోల్ ప్లే చేశాడని తెలియజేస్తున్నందుకు శశికిరణ్-అడివి శేష్ నన్ను తిట్టుకోవద్దని మనవి. “క్షణం” తరహాలో ఈ సినిమాలోనూ వెన్నెల కిషోర్ వైవిధ్యమైన పాత్రలో ఆకట్టుకొన్నాడు. ప్రకాష్ రాజ్ సపోర్టింగ్ రోల్ కూడా సినిమాకి మెయిన్ ఎస్సెట్. మధుషాలిని పాత్ర చిన్నదే అయినా గుర్తుంచుకోదగ్గ అభినయంతో అలరించింది. goodachari-movie-review3

సాంకేతికవర్గం పనితీరు : షానీల్ డియో సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధానమైన బలం. ఒక స్పై థ్రిల్లర్ చూస్తున్నామన్న భావన ప్రేక్షకుల్లో కలగడానికి కారణం కూడా అదే. టింట్. లైటింగ్ వంటి విషయాల్లో షానీల్ తీసుకొన్న స్పెషల్ కేర్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. కాకపోతే.. ఫైట్ & రన్నింగ్ సీక్వెన్స్ లలో సహజత్వం కోసం వాడిన కెమెరా షేక్స్ కాస్త ఎక్కువయ్యాయి. అందువల్ల ప్రేక్షకుడి కంటికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్ ని ప్రత్యేకించి ప్రశంసించాలి. చాలా లేయర్స్ ఉన్న కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా ఆసక్తికరంగా ఎడిట్ చేశాడు. సీన్ టు సీన్ ట్రాన్స్ మిషన్ బాగుంది. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ కి అన్నీ వర్గాల ప్రేక్షకులు కనెక్ట్ అవ్వకపోవచ్చు కానీ.. క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ మినహా ఎక్కడా అతి కనిపించకపోవడం డిఫరెంట్ మూవీస్ ను మెచ్చే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అడివి శేష్ రాసుకొన్న కథలో చాలా హాలీవుడ్ మూవీస్ రిఫరెన్సులు కనిపిస్తాయి. కాకపోతే.. హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూడని ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది. రెగ్యులర్ గా అన్నీ హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళకి మాత్రం నెక్స్ట్ సీన్ ఏంటో గెస్ చేస్తూ.. కొన్ని లాజిక్స్ ని లాజికల్ గా ఆలోచించడం వల్ల పెద్దగా ఎక్కదు.

శశికిరణ్ తిక్క-అడివి శేష్ లు కలిసి ఈ సినిమాను తెరకెక్కించిన విధానం బాగుంది. ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ గా “గూఢచారి” చిత్రాన్ని మలిచిన తీరు, ఊహించలేని ట్విస్టులు, కన్విన్సింగ్ క్లైమాక్స్ తో సినిమాని బాగా తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్ అవుట్ పుట్ తీసుకురావడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా బాగున్నాయి. ఈ తరహా చిత్రాలు ఇంకా చాలా రావాలి, ప్రేక్షకులు కూడా ఈ రొటీన్ సినిమాలు చూసీ చూసీ బోర్ ఫీలవుతున్నారు. సో, “గూఢచారి” వైవిధ్యమైన చిత్రాల కోసం ఎదురుచూసే తెలుగు ప్రేక్షకులకు ఒక విందు భోజనం లాంటిది. goodachari-movie-review4

విశ్లేషణ : హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూడకుండా, ఆ సీన్ ఆ సినిమాలోది అని వెతికి పట్టుకోకుండా “ఇది ఒక తెలుగు సినిమా” అనే విషయాన్ని మైండ్ లో పెట్టుకొని చూస్తే “గూఢచారి” విశేషంగా ఆకట్టుకొంటుంది. ఇది తెలుగు “మిషన్ ఇంపాజబుల్ & బౌర్న్ సిరీస్”. goodachari-movie-review5

రేటింగ్ : 3/5

Share.