నాంది సినిమా రివ్యూ & రేటింగ్!

అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “నాంది”. భారతీయ చట్టాల్లో ఉన్న లొసుగుల కారణంగా ఎంతమంది నిర్ధోషులు జైళ్ళల్లో ముగ్గిపోతున్నారు? కోర్ట్ ట్రైల్స్ ఎలా సాగుతున్నాయి అనే నేపధ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అల్లరి నరేష్ చాన్నాళ్ల తర్వాత ఒక మంచి పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో అల్లరి నరేష్ కొన్ని ఇంటరాగేషన్ సీన్స్ కోసం నగ్నంగా నటించడం గమనార్హం. మరి నరేష్ పడిన కష్టానికి తగిన ఫలితం లభించించిందా లేదా అనేది చూద్దాం..!!

కథ: ఓ సగటు కుటుంబ యువకుడు సూర్య ప్రకాష్ (అల్లరి నరేశ్). తన చదువు కోసం చిన్న చిన్న ఆనందాలు వదులుకొన్న తల్లిదండ్రుల కోరికలు తీర్చడం, ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడడమే లైఫ్ గోల్స్ గా గడిపే సూర్య ప్రపంచం ఉన్నట్లుండి ఛిన్నాభిన్నం అవుతుంది. రాజగోపాల్ అనే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ హత్య కేసులో సూర్య ఇరికించబడతాడు. సి.ఐ కిషోర్ (హరీష్ ఉత్తమన్) పకద్భంధీగా సూర్యను కేసులో దోషిగా నిరూపించి జైలుకు పంపుతాడు.

దాదాపు అయిదేళ్లపాటు అండర్ ట్రైల్స్ ఖైధీగానే సూర్యప్రకాశ్ జైల్లో నలిగిపోతాడు. ఆధ్య (వరలక్ష్మి శరత్ కుమార్) చొరవ తీసుకొని, తన తెలివితేటలతో కేసులో ఉన్న లోపాలను బయటపెట్టి సూర్య వైపు న్యాయ పోరాటం మొదలెడుతుంది.

న్యాయం గెలిచిందా? చట్టం ఎవరి కొమ్ము కాసింది? సూర్యలా జైల్లో మగ్గిపోతున్న వేలమందికి ఒక సమాధానం దొరికిందా లేదా? అనేది “నాంది” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: అల్లరి నరేశ్ కెరీర్ లో కలికితురాయిగా నాంది సినిమాలో సూర్య పాత్ర నిలిచిపోతుంది. ఓ సగటు యువకుడిగా నరేష్ ఒదిగిపోగా.. తాను నమ్మిన న్యాయం-చట్టం వల్ల అణగదొక్కబడిన పౌరుడిగా నరేష్ నటన ప్రశంసనీయం. అల్లరి నరేష్ మంచి నటుడు అనే విషయం “నేను” సినిమాతోనే ప్రూవ్ అయ్యింది. అతడిలోని పరిణితి చెందిన నటుడ్ని ప్రేక్షకలోకానికి పరిచయం చేసిన చిత్రం “నాంది”.

వరలక్ష్మి శరత్ కుమార్ స్క్రీన్ ప్రెజన్స్, వాయిస్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. లాయర్ గా ఆమె పాత్ర సినిమాకి మంచి వెయిట్ ను యాడ్ చేసింది.

స్నేహితుడి పాత్రలో ప్రవీణ్ కు చక్కని నట ప్రతిభ కనబరిచాడు. చాన్నాళ్ల తర్వాత అతడికి మంచి స్క్రీన్ స్పేస్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. ప్రియదర్శి మరోసారి తన సత్తాను చాటుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో ప్రియదర్శి పెర్ఫార్మెన్స్ బాగుంది.

తండ్రి పాత్రలో దేవి ప్రసాద్, ప్రతినాయక పాత్రలో వినయ్ వర్మ, హరీష్ ఉత్తమన్ లు అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు విజయ్ కనకమేడల రాసుకున్న కథలో మంచి ఎమోషన్ ఉంది. ఇదివరకు తెలుగులో వచ్చిన “సముద్రం” ఛాయలు కనబడతాయి. అయితే.. కోర్ట్ ప్రొసీడింగ్స్ ను చాలా అర్ధవంతంగా చూపించి సినిమాకి ఒక కొత్త లుక్ ను తీసుకొచ్చాడు విజయ్. అలాగే.. అల్లరి నరేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు. అయితే.. ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లడంలో బాగా ల్యాగ్ చేశాడు. కథా గమనాన్ని ఇంకాస్త వేగవంతం చేసి ఉంటే ఒక పర్ఫెక్ట్ ఇంటెన్స్ ఫిలిమ్ చూసిన అనుభూతిని ప్రేక్షకులకు కలిగించి ఉండేవాడు విజయ్. అయినప్పటికీ.. ఒక కొత్త దర్శకుడిగా విజయ్ తెరకెక్కించిన విధానం, ఎంచుకొన్న జోనర్ ప్రశంసార్హం.

శ్రీచరణ్ పాకాల పాటలు, నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పొచ్చు. సెంటిమెంటల్ సాంగ్స్ & ఎమోషనల్-ఇంటెన్స్ బీజీయమ్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. పర్ఫెక్ట్ ప్రీప్రొడక్షన్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ వల్ల తక్కువ బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ వచ్చింది.

విశ్లేషణ: అల్లరి నరేష్ సరికొత్త ఇన్నింగ్స్ కు మంచి నాంది ఈ చిత్రం. నరేష్ ను కమెడియన్ గానో లేక సహాయ పాత్రల కోసం మాత్రమే కాక మంచి నటుడిగా గుర్తించాలని దర్శకులకు తెలియజెప్పిన చిత్రం “నాంది”. ఒక సాధారణ కథను కొత్తగా ప్రెజంట్ చేస్తే ఎలా ఉంటుందో “నాంది” అలా ఉంటుంది. కథనంలో అక్కడక్కడా లోపించిన వేగం తప్పితే సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్స్ అనేవి లేవు. అన్నిటికీ మించి నటుడిగా నరేష్ విశ్వరూపం చూడడం కోసం “నాంది” చిత్రాన్ని తప్పకుండా చూడాలి.

రేటింగ్: 2.5/5

Click Here To Read In ENGLISH

Share.