జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!

“ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ”తో నటుడిగా, కథానాయకుడిగా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న నవీన్ పోలెశెట్టి కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “జాతి రత్నాలు”. “పిట్టగోడ” ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఓ రేంజ్ లో హిట్టయ్యాయి. మరి హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో లేదో చూద్దాం..!!

కథ: జోగిపేట శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి), రవి (రాహుల్ రామకృష్ణ), శేఖర్ (ప్రియదర్శి) చిన్నప్పటి నుంచి జిగిరి దోస్తులు. ఇంజనీరింగ్ పాసైన శ్రీకాంత్, టెన్త్ పాసైన రవి-శేఖర్ లు సెటిల్ అవ్వడం కోసం హైద్రాబాద్ వస్తారు. హైద్రాబాద్ లొ శ్రీకాంత్ కి చిట్టి అలియాస్ షామిలి (ఫరియా అబ్ధుల్లా) పరిచయమవుతుంది. శ్రీకాంత్ అమాయకత్వం చూసి ఇష్టపడుతుంది చిట్టి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం మొదలై.. శ్రీకాంత్ కి జాబ్ వచ్చింది అంతా ఖుష్ అనుకునే సమయానికి ఎమ్మెల్యే (మురళీ శర్మ) అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇరుక్కుంటారు శ్రీకాంత్ అండ్ గ్యాంగ్. ఆ కేస్ నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? అసలు జోగిపేట కుర్రాళ్లను ఎమ్మెల్యే హత్య కేసులో ఇరికించాల్సిన అవసరం ఏమొచ్చింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: నవీన్ పోలిశెట్టి టెర్రిఫిక్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో అతడి కామెడీ టైమింగ్ వీరలెవల్లో ఉంది. తెలుగులో చిరంజీవి, వెంకటేష్ ల తర్వాత ఆస్థాయిలో సహజంగా కామెడీ పండించగల నటుడు నవీన్. అతడి ఒన్ లైనర్స్ మరియు పంచ్ డైలాగులకు థియేటర్లు గొల్లుమనడం ఖాయం. ఒక సాధారణ కథ-కాన్సెప్ట్ తో సినిమాను హిలేరియస్ నడిపించడం అనేది ఒక నటుడిగా నవీన్ పోలిశెట్టి సత్తాను చాటుతుంది.

నవీన్ తో సమానమైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు రాహుల్, ప్రియదర్శి జస్ట్ సపోర్టింగ్ లేదా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ లా మిగిలిపోకుండా హీరోల్లా కనిపించారు. కామెడీ టైమింగ్ లో ప్రియదర్శి కంటే రాహుల్ ఎక్కువ మార్కులు సంపాదించాడు. మురళీశర్మ, నరేష్, గిరిబాబు, తనికెళ్లభరణి, శుభలేఖ సుధాకర్ ల పాత్రలు చిన్నవైనా అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: ఈవీవీ తర్వాత కథ-కథనంతో సంబంధం లేకుండా ఆడియన్స్ ను భీభత్సంగా నవ్వించిన డైరెక్టర్ అనుదీప్. అతడి పరిచయ చిత్రం “పిట్టగోడ” కూడా బాగానే ఉంటుంది కానీ.. సెకండాఫ్ తేలిపోతుంది. ఆ సెకండాఫ్ ఫోబియా “జాతిరత్నాలు” విషయంలోనూ కొనసాగినప్పటికీ.. ఇక్కడ కథ అనే విషయాన్ని ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకొనే స్కోప్ లేకపోవడం, నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్, ఒన్ లైనర్స్ ఆడియన్స్ ను హిలేరియస్ గా ఎంటర్ టైన్ చేయడంతో సెకండాఫ్ లో దొర్లిన తప్పులు పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేకుండాపోయింది.

కామెడీతోపాటుగా కథనం విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్త వహించి ఉంటే సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. రధాన్ మ్యూజిక్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. అసలు సినిమాకి హైప్ తీసుకొచ్చిన “చిట్టి” సాంగ్ కు సినిమాలో మంచి ప్లేస్ మెంట్ దొరకలేదు, అలాగే సాంగ్ కొరియోగ్రఫీ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఆ రెండూ కుదిరి ఉంటే బాగుండేది. నేపధ్య సంగీతం కొత్తగా ఉంది. రెట్రో మ్యూజిక్ తో కామెడీని ఎలివేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందులో రధాన్ సక్సెస్ అయ్యాడు.

సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, ఎడిటింగ్, లైటింగ్, డి.ఐ, ప్రొడక్షన్ డిజైన్.. ఇలా అన్ని అంశాలు బాగున్నాయి చిత్రంలో. పక్కా ప్రీప్రొడక్షన్ వర్క్ చేసుకోవడం వల్ల తక్కువ రోజుల్లో మంచి అవుట్ పుట్ తీసుకురాగలిగారు దర్శకనిర్మాతలు. అన్నిటికీ మించి క్యాస్టింగ్ విషయంలోనే పెద్ద సక్సెస్ కొట్టారు. ప్రతి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా చేసుకున్న క్యాస్టింగ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అలాగే.. సినిమాకి కీలకమైన పాయింట్ ను కూడా ఫన్నీగా ముగించడం అనేది హైలైట్. ఆ ముగింపుకి మాత్రం జనాలు నవ్వుకుంటూ థియేటర్ల నుండి ఇంటికి వెళ్తారు.

విశ్లేషణ: కథ-కథనం-లాజిక్-సెన్సిబిలిటీస్ లాంటివేవీ పట్టించుకోకుండా కేవలం కామేడీ కోసం థియేటర్ కి వెళ్తే రెండున్నర గంటలపాటు కంటిన్యూస్ గా నవ్వించే సినిమా “జాతిరత్నాలు”. ప్రెజంట్ జనరేషన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఈమధ్యకాలంలో సరైన కామెడీ ఎంటర్ టైనర్ రాలేదు. అందువల్ల సీరియస్ సినిమాలతో విసిగిపోయిన ఆడియన్స్ కి మంచి మెడిసిన్ ఇది. నవీన్-దర్శి-రాహుల్ ల క్రేజీ కాంబినేషన్, అనుదీప్ హిలేరియస్ టేకింగ్, రధాన్ సంగీతం, స్వప్న సినిమా ప్రొడక్షన్ డిజైన్ హైలైట్స్ గా “జాతిరత్నాలు” బాక్సాఫీస్ దుమ్ము దులపడం ఖాయం. సో, ఈ వీకెండ్ విన్నర్ “జాతిరత్నాలు”.

రేటింగ్: 3/5

Click Here To Read In English

Share.