హిప్పీ

“ఆర్.ఎక్స్ 100” చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకొన్న కార్తికేయ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం “హిప్పీ”. “నువ్వు నేను ప్రేమ” అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన టి.ఎన్.కృష్ణ అయిదేళ్ళ విరామం అనంతరం తెరకెక్కించిన ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ దిగంగన కథానాయికగా పరిచయమైంది. జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొంది. మరి “హిప్పీ” సినిమాగా ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!

hippi-movie-review1

కథ: ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎలాంటి ధ్యేయం లేకుండా సరదాగా తిరిగే కుర్రాడు హిప్పీ దేవదాస్ అలియాస్ దేవ. అప్పటికే ఒకమ్మాయితో సరససల్లాపాలు సాగిస్తూ.. ఆమె స్నేహితురాలైన ఆముక్త మాల్యద (దిగంగన సూర్యవంశీ)ని మనస్పూరిగా ప్రేమించడం మొదలెడతాడు. తొలుత స్నేహితురాలి బోయ్ ఫ్రెండ్ కాబట్టి అవాయిడ్ చేసిన ఆముక్త మాల్యద.. అనంతరం ఆమె స్నేహితురాలు స్వయంగా అతడ్ని ప్రేమించమని కోరడంతో హిప్పీ ప్రేమను అంగీకరిస్తుంది.

ఆముక్త మాల్యదతో ప్రేమ రుచులు చూద్దామని సిద్ధపడిన హిప్పీకి.. ఆమె కొత్త రుచులు కాక చుక్కలు చూపించడం మొదలెడుతుంది.

ఆముక్త మాల్యద పెట్టే టార్చర్ ను హిప్పీ భరించి ఆమెను పెళ్లి చేసుకొన్నాడా? లేక ఆమెతో తనకు సెట్ కాదని పక్కకి తప్పుకొన్నాడా? అనేది “హిప్పీ” కథాంశం.

hippi-movie-review2

నటీనటుల పనితీరు: బాలీవుడ్ లో గోవిందతో ఆల్రెడీ మూడు సినిమాలు చేసిన అనుభవం వల్లనో ఏమో కానీ.. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ “హిప్పీ” సినిమా మొత్తానికి చెప్పుకోదగ్గ ఏకైక ప్లస్ పాయింట్ లా నిలిచింది. ఆమె అందం, అభినయ సామర్ధ్యంతోపాటు.. ఆమె పాత్రకు మానసి చెప్పిన డబ్బింగ్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా దిగంగనకు మంచి అవకాశాలు రావడం ఖాయం.

ఇక “ఆర్ ఎక్స్ 100” సినిమా మొత్తం సీరియస్ గా ఉంటూ యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకొన్న కార్తికేయ.. ఈ సినిమాలో కామెడీ యాంగిల్ ట్రై చేసి దిబ్బతిన్నాడు. కామెడీ టైమింగ్ మైంటైన్ చేయలేక, అందుకు తగ్గ హావభావాలు ప్రదర్శించలేక చాలా ఇబ్బందిపడ్డాడు కార్తికేయ. నిజానికి కార్తికేయ క్యారెక్టర్ చాలా ట్రెండీగా, ప్రెజంట్ జనరేషన్ యూత్ అందరూ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. కానీ.. కార్తికేయ నటన పాత్రను పండించలేకపోయింది.
జెడి.చక్రవర్తి చాన్నాళ్ల తర్వాత వెండితెరపై దర్శనమిచ్చాడు. తెలంగాణ యాసలో నవ్వించాలని ప్రయత్నించి కొంతమేరకు పర్వాలేదనిపించాడు. కానీ.. ఆయన క్యారెక్టరైజేషన్ కు సరైన డెప్త్ లేదు. దాంతో కీలకపాత్ర కాస్తా జస్ట్ అనధర్ క్యారెక్టర్ అయిపోతుంది.

బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సుదర్శన్, త్రిషూల్ తదితరులు నవ్వించడానికి ప్రయత్నించడంతోపాటు వారి పాత్రలకు న్యాయం చేశారు.

hippi-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: నివాస్ కె.ప్రసన్న సమకూర్చిన బాణీలు వినసోంపుగా మాత్రమే కాదు.. ఆస్వాదించే విధంగానూ ఉన్నాయి. కానీ.. ఆ పాటల ప్లేస్ మెంట్ సరిగా లేకపోవడంతో సినిమా చూస్తున్నప్పుడు పాటలోని మాధుర్యాన్ని అనుభూతి చెందలేము.

ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, ఆయన ఫ్రేమింగ్స్, డి.ఐ, సౌండింగ్ ఇలా అన్నీ బాగున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి.

సాంకేతికంగా అన్నీ బాగున్న ఈ చిత్రానికి కథ-కథనం పెద్ద మైనస్. హీరో క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేయడానికే దర్శకుడికి గంట పట్టింది. ఇక ఆ తర్వాత హీరో & హీరోయిన్ నడుమ కెమిస్ట్రీ ని ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా చేయడం కోసం దర్శకుడు పడిన శ్రమ.. సరైన సన్నివేశాలు పడకపోవడంతో వృధా అయ్యింది. ఇక క్లైమాక్స్ విషయంలో కొత్తగా ఆలోచించాననుకున్నాడో లేక డిఫరెంట్ గా ఉంటుందని ట్రై చేశాడో తెలియదు కానీ.. అప్పటికే సహనం కోల్పోయి నీరసించిన ప్రేక్షకుడి నెత్తి మీద మొట్టికాయ మొట్టినట్లే ఉంటుంది ఆ ఎండింగ్.

hippi-movie-review4

విశ్లేషణ: న్యూ ఏజ్ లవ్ స్టోరీ అంటే బోల్డ్ డైలాగ్స్ & రొమాన్స్ మాత్రమేననే భ్రమలో టి..ఎన్.కృష్ణ లాంటి దర్శకుడు కూడా మునిగిపోవడం బాధాకరం. ఆయన తీసిన “నువ్వు నేను ప్రేమ” ఫ్లాప్ అయినా ఈ “హిప్పీ” కంటే వంద రేట్లు బెటర్ అని చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ కి బీ గ్రేడ్ కంటెంట్ కి మధ్య తేడా రెడ్ క్లిఫ్ రేఖ అంత సన్నగా ఉంటుంది. ఆ తేడా గమనించిన దర్శకులు ప్రేమకు సరికొత్త నిర్వచనాలు ఇస్తే.. తేడా తెలుసుననే భ్రమలో కొందరు దర్శకులు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఇక “హిప్పీ” సినిమా ఏ కోవకు చెందిన సినిమా అనేది పాఠకుల నిర్ణయానికే వదిలేస్తున్నా.

hippi-movie-review5

రేటింగ్: 1.5/5

CLICK HERE TO READ IN ENGLISH

Share.