నగరం

సందీప్ కిషన్, రేజీనా జంటగా నటించిన తాజా చిత్రం “నగరం”. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో “నగరం” పేరుతో అనువదించబడింది. లోకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకంతో విడుదలకు రెండు రోజుల ముందే ప్రీమియర్ షో వేశారు దర్శకనిర్మాతలు. మరి వారి నమ్మకం ఏమేరకు నిలబడిందో చూద్దాం..!!

కథ : కాలేజ్ టైమ్ నుంచి ప్రేమిస్తున్న అమ్మాయి (రెజీనా) కోసం ఓ రౌడీ షీటర్ పై యాసిడ్ దాడి చేసి, ఆ విషయం పోలీసులకు తెలిసిపోవడంతో.. పోలీసులతోపాటు, సదరు గ్యాంగ్ నుంచి కూడా ఎటువంటి సమస్య రాకూడదనే ఉద్దేశ్యంతో ఊరు వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంటాడు (సందీప్ కిషన్).

ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే చెన్నైలో ఉద్యోగం సంపాదించుకోవడం ఒక్కటే మార్గమని తెలుసుకొని.. కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని నెక్స్ట్ జాయిన్ అవ్వాల్సి ఉండగా.. ఓ గొడవ కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ కోల్పోయి జాబ్ లో జాయిన్ అవ్వాలా లేక ఊరు తిరిగిపోవాలా? అనే మీమాంసలో ఊగిసలాడే ఓ కుర్రాడు (శ్రీ). తనను ప్రేమిస్తున్న వ్యక్తి మంచోడే అయినా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడనే ఒకే ఒక్క రీజన్ తో అతడి ప్రేమను అంగీకరించక అతడ్ని తన చుట్టూ తిప్పుకుంటుంటుంది (రెజీనా). ఈ ముగ్గురి జీవితాలు కార్తీక్ అనే కుర్రాడి కారణంగా అనూహ్యరీతిలో కొన్ని మలుపులు తిరుగుతాయి. పి.కె.పి అనే గూండా కమ్ బిజినెస్ మ్యాన్ అనే పేరు వీరి జీవితాల్లోని అనూహ్య మలుపులకు కారణం. అసలు ఎవరా పి.కె.పి, అతనికి ఈ ముగ్గురికి సంబంధం ఏంటి, కార్తీక్ వీరి జీవితాల్లోకి ఎలా వస్తాడు? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రమే “నగరం”.

నటీనటుల పనితీరు : మొరటు యువకుడిగా సందీప్ కిషన్ డిప్ప కటింగ్, గెడ్డం లుక్ లో పాత్ర బాడీ లాంగ్వేజ్ వరకూ న్యాయం చేశాడు. అయితే.. వ్యవహారశైలిలో మాత్రం ఆ కరుకుతనం ఎక్కడా కనిపించదు. అందువల్ల క్యారెక్టరైజేషన్ లో ఉన్న క్లారిటీ క్యారెక్టర్ లో కనిపించదు. తమిళ నటుడు శ్రీ సగటు సాధారణ యువకుడిగా ఆకట్టుకొన్నాడు. ఇతడి పాత్రను ఎక్కువ మంది ఓన్ చేసుకొనే అవకాశాలున్నాయి. కానీ.. ఎలివేషన్ సరిగా ఉండి ఉంటే ఇంకాస్త బాగుండేది. రెజీనా పాత్ర చాలా చిన్నది. తిప్పికొడితే ఓ నాలుగు సీన్లున్నాయి. కానీ ఉన్నంతలో భిన్నమైన ఎమోషన్స్ ను చక్కగా పలికించి పర్వాలేదనిపించుకొంది. సీనియర్ ఆర్టిస్ట్ చార్లీ క్యారెక్టర్ పరంగా చాలా అమాయకుడే కానీ.. అతడిలోని అమాయకత్వాన్ని ప్రూవ్ చేయడం కోసం అతడు మరీ బుద్ధావతరం ఎక్స్ ప్రెషన్స్ పెట్టి కాస్త అతి చేశాడేమో అనిపిస్తాడు. పాత్ర నిడివి తక్కువే అయినా పవర్ ఫుల్ విలన్ గా తనదైన మార్క్ వేశాడు మధు. సినిమా మొత్తానికి స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఇదొక్కటే కావడం వల్ల విలనిజం బాగా ఎలివేట్ అయ్యింది.

సాంకేతికవర్గం పనితీరు : జావేద్ రియాజ్ నేపధ్య సంగీతం కథనంలోని ఇంటెన్సిటీని చక్కా ఎలివేట్ చేసింది. సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ హైలైట్ గా పేర్కొనవచ్చు. కొన్ని టైట్ క్లోజ్ షాట్స్, జంప్ స్కేర్ షాట్స్, ఎలివేషన్ షాట్స్ ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేస్తాయి.
సినిమాటోగ్రఫీ తర్వాత సినిమాకి కీలకమైన మరో అంశం ఎడిటింగ్. నాలుగు కథలను కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా కట్ చేశారు. అలాగే.. నాలుగు కథలు కలిసే పాయింట్ కూడా ఇంట్రెస్ట్ గా ఉండేలా తీసుకొన్న జాగ్రత్తలు, కథనంలో ఎక్కువగా ల్యాగ్ లేకుండా సీన్ టు సీన్ కనెక్టివిటీని మేనేజ్ చేసిన విధానాన్ని ప్రశంసించి తీరాలి. నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నా.. మిగతా టెక్నికల్ అంశాలన్నీ మాత్రం బాగున్నాయి.

దర్శకుడు లోకేష్ ఎంచుకొన్న పాయింట్ కొత్తదేమీ కాదు. కన్ఫ్యూజన్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా “నగరం” చిత్రాన్ని తీర్చిదిద్దాలని చేసిన ప్రయత్నం పూర్తి స్థాయిలో ఫలించలేదనే చెప్పాలి. విలనిజాన్ని “ఫోన్ కాల్ వార్నింగ్ సీన్”తో బాగా హైలైట్ చేశాడు. అయితే.. ప్రీక్లైమాక్స్ లో నలుగురి కథలో ఒక కంచికి ఎలా తీసుకురావాలో తెలియక అనవసరమైన సీన్స్ ను యాడ్ చేసి కథనాన్ని సాగదీశాడు. ఆ సాగదీత లేకుంటే గనుక సినిమా ఓ మోస్తరుగానైనా ఆడేదేమో. కానీ, కథలో క్లారిటీ మిస్సవ్వడం, పాత్రల తీరుతెన్నులు చివరివరకూ సరిగా ఎలివేట్ చేయకపోవడం వంటి కారణాల వల్ల యావరేజ్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయింది.

విశ్లేషణ : నలుగురి జీవితాలు, నాలుగు కథల కాంబినేషన్ లో ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో లెక్కకి మిక్కిలి చిత్రాలొచ్చాయి. టేకింగ్ పరమైన మార్పులు కొన్ని వచ్చాయే కానీ కథనం పరంగా కొత్తదనం పెద్దగా కనపడని చిత్రం “నగరం”.

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Share.