వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!

“ఎఫ్ 2” లాంటి సూపర్ సక్సెస్ తర్వాత వెంకటేష్, “మజిలీ” లాంటి డీసెంట్ హిట్ అనంతరం నాగచైతన్య నటించిన చిత్రం “వెంకి మామ”. మల్టీస్టారర్ సినిమాగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో మాత్రం కాస్త టెన్షన్ పడి.. ఇంకాస్త టెన్షన్ పెట్టి ఎట్టకేలకు నేడు విడుదలైంది. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!

కథ: మేనల్లుడు కార్తీక్ (నాగచైతన్య) కోసం పెళ్లి కూడా చేసుకోకుండా.. వాడి ఆనందమే తన ఆనందంగా బ్రతుకుతుంటాడు మిలిటరీ నాయుడు అలియాస్ వెంకటరత్నం నాయుడు అలియాస్ వెంకి మామ (వెంకటేష్). తన భుజాల మీద పెరిగిన మేనల్లుడు, తనతో కలిసి మందుకొట్టిన మేనల్లుడు ఒక్కసారి దూరమవుతాడు. దగ్గరవ్వాలని ప్రయత్నించినా కనికరించడు. తనే ప్రాణంగా పెరిగిన మేనల్లుడు తనను ఎందుకు దూరం పెడుతున్నాడో అర్ధం కాక మదనపడుతున్న వెంకి మామకు.. దీనంతటికీ కారణం తన తండ్రి (నాజర్) అని తెలుసుకొంటాడు.

అసలు తనకు చాలా ఇష్టమైన వెంకి మామకు దూరంగా కార్తీక్ వెళ్లిపోవడానికి కారణం ఏమిటి? అందుకు నాజర్ ఎలా కారకుడయ్యాడు? తన మేనల్లుడ్ని మళ్ళీ కలుసుకోవడం కోసం వెంకి మామ చేసిన ప్రయత్నాలు ఏమిటి? అనేది “వెంకి మామ” కథాంశం.

నటీనటుల పనితీరు: టైటిల్ పాత్రకు వెంకీ పూర్తి న్యాయం చేశాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సెంటిమెంట్ సీన్స్ & కామెడీ సీన్స్ ను వెంకీ కంటే బాగా ఎవరూ చేయలేరు. వెంకటేష్ కి ఈ క్యారెక్టర్ టైలర్ మేడ్. ఇక నాగచైతన్య మరోమారు మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. రాశీఖన్నా కేవలం అందాల ప్రదర్శనకే పరిమితమవ్వకుండా నటనతో ఆకట్టుకొంది. పాయల్ రాజ్ పుత్-వెంకటేశ్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. అలాగే వాళ్ళిద్దరి మధ్య హిందీ కామెడీ జనాల్ని భలే నవ్విస్తుంది. నాజర్, రావురమేష్, చమ్మక్ చంద్ర, విద్యుల్లేఖ రామన్, హైపర్ ఆది పాత్రలు ఆకట్టుకొంటాయి.

సాంకేతికవర్గం పనితీరు: ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ వర్క్ & సురేష్ ప్రొడక్షన్స్ వారి ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. తమన్ సమకూర్చిన బాణీలు అలరిస్తాయి. నేపధ్య సంగీతంతోనూ ఆకట్టుకున్నాడు తమన్.

జాతకాలు, మానవీయ బంధాల నేపధ్యంలో బాబీ-కోన వెంకట్ ఒక సాధారణమైన కథను రాసుకొని.. దానికి మిలటరీ బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి మంచి పని చేశారు. వెంకటేశ్ సినిమా నుండి జనాలు ఏం ఆశిస్తారో జనాలకు అవన్నీ అందించారు. ఆరోగ్యకరమైన హాస్యం, మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫైట్స్, సెంటిమెంట్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి ఈ చిత్రంలో. అయితే.. ఫస్టాఫ్ వరకు చాలా సరదాగా సాగిపోయిన కథ సెకండాఫ్ లో మాత్రం కాస్త నెమ్మదిస్తుంది. ముఖ్యంగా కాశ్మీర్ ఎపిసోడ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కు విందు భోజనం లాంటిది “వెంకి మామ” చిత్రం. కథనంలో ఉన్న చిన్నపాటి లోటును తన స్క్రీన్ ప్రెజన్స్ తో కవర్ చేసేశాడు మన వెంకీ.

విశ్లేషణ: ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసి తీసిన “వెంకి మామ” వాళ్ళను సంతృప్తిపరచడంలో సక్సెస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెంకీ-నాగచైతన్యల కాంబో కోసం.. రాశీఖన్నా-పాయల్ అందాల కోసం, రెండున్నర గంటల టైమ్ పాస్ కోసం హ్యాపీగా ఒకసారి చూడదగ్గ చిత్రం “వెంకి మామ”.

రేటింగ్: 3/5

Click Here To Read In English

Share.