ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!

‘తిమ్మరుసు’ కి పోటీగా ఈరోజు ‘ఇష్క్’ అనే మరో మూవీ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జ ఈ చిత్రంలో హీరో. ‘ఓ బేబీ’ ‘జాంబీ రెడ్డి’ వంటి హిట్ సినిమాల్లో నటించి ఇతను మంచి ఫామ్లో ఉండడంతో ‘ఇష్క్’ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ మూవీలో హీరోయిన్ కావడం విశేషం.2019వ సంవత్సరంలో మలయాళంలో వచ్చిన హిట్ మూవీ ‘ఇష్క్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. మరి తెలుగు ప్రేక్షకులను ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: సిద్దార్థ్ అలియాస్ సిద్దు (హీరో తేజ సజ్జ) ఓ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్.అతను అనసూయ అలియాస్ అను (హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఈ నేపథ్యంలో అను బర్త్ డే సందర్భంగా ఆమెతో లాంగ్ డ్రైవ్ కు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాడు.అలా వాళ్ళు లాంగ్ డ్రైవ్‌ కు వెళ్లి రాత్రంతా తిరిగి ఎంజాయ్ చేస్తుండగా. మధ్యలో ఓ చోట కారు ఆపి, ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అదే సమయానికి వీళ్ళ ఫోటోలు, వీడియోలు తీసి.. నేను పోలీస్ ను అంటూ వీళ్ళని బెదిరిస్తాడు.

సిద్దుని కార్ నుండీ బయటకి దింపి హీరోయిన్ తో మిస్ బిహేవ్ చేస్తాడు. అలాగే నీ రేటు ఎంత అంటూ చాలా నీచంగా మాట్లాడతాడు. సిద్దు.. ‘డబ్బులిస్తాను వదిలెయ్యి’ అంటూ ఎంత బ్రతిమాలినా అతను వదిలిపెట్టడు. మరి ఈ సమస్య నుండీ వాళ్ళు ఎలా బయటపడ్డారు? విలన్…ని సిద్దు చివరికి ఏం చేసాడు? అనేది మనం తెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: హీరో తేజ సజ్జ బాగానే పెర్ఫార్మ్ చేసినా ఎందుకో అతను ఇంకా చిన్న పిల్లాడిలానే కనిపించిన ఫీలింగ్ కలుగుతుంది.అటు రొమాంటిక్ సీన్లలో చూసుకున్నా.. ఇటు సెకండ్ హాఫ్ లో వచ్చే రివేంజ్ యాంగిల్ లో చూసుకున్నా.. పెద్దగా తేడా తెలీదు.దాంతో ఈ పాత్రకి అతను సెట్ అవ్వలేదేమో అనే అనుమానం కూడా కలుగక మానదు. ఇక ప్రియా ప్రకాష్ వారియర్‌ లుక్స్ బాగానే ఉన్నా పెర్ఫార్మన్స్ పరంగా ఆమె ఆకట్టుకున్నది లేదు. ఎక్కువగా ఏడవడం, కంగారు పడడం వంటి పాత్ర కాబట్టి..

వాటి తాలూకు హావ భావాలను ఈమె పలికిచలేకపోయినట్టు స్పష్టమవుతుంది. ఇక విలన్ పాత్రకి తక్కువ సైకో పాత్రకి ఎక్కువ అనే విధంగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రవీంద్ర విజయ్ పాత్ర ఉంది.కానీ ఉన్నంతలో అతను పర్వాలేదనిపించాడు.

సాంకేతికవర్గం పనితీరు: మహతి సాగర్ అందించిన నేపధ్య సంగీతం బాగానే అనిపించింది.’ఆనందం మదికే’ అనే పాట బాగానే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ విషయంలో శ్యామ్ కె నాయుడు పర్వాలేదు అనిపించుకుంటారు.ఇందులో కథ ఏమీ ఉండదు.కానీ ప్రేమ జంటల పై దాడులు అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఒరిజినల్ తెరకెక్కింది. అది కూడా స్లోగానే సాగినా కథనం ఎక్కడా ల్యాగ్ అనిపించదు. కానీ తెలుగుకి వచ్చే సరికి ఆ లోపం క్లియర్ గా తెలిసిపోతుంది.ప్రేక్షకులకు ఇది గ్రిప్పింగ్ నేరేషన్ లా అనిపించదు.

వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేలా చేయడంలో దర్శకుడు రాజు పూర్తిగా విఫలమయ్యాడు. ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్ బాగానే అనిపించినా మిగతా భాగం అంతా ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారుతుంది. నిడివి రెండు గంటల లోపే ఉన్నా.. చాలా ఎక్కువ సేపు థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ కలిగిస్తుంది ‘ఇష్క్’. రితీష్ రవి అందించిన సంభాషణలు బాగానే ఉన్నా అవి ప్రేక్షకులకు ఏమాత్రం గుర్తుంటాయి అనేది సందేహమే.

విశ్లేషణ: చాలా రోజుల తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యాయి కాబట్టి.. ఏదో ఒక సినిమా చూడాలి అని ఉత్సాహం చూపించే వారు ‘ఇష్క్’ మూవీకి వెళ్లినా.. ‘ఇది ఓటిటిలోనే విడుదల చేసి ఉంటే బాగుండేది కదా’ అనే నిరుత్సాహంతో బయటకి రావడం ఖాయమని చెప్పొచ్చు. అయినప్పటికీ ముందు నుండీ నెలకొన్న హైప్ కారణంగా.. ‘ఇష్క్’ వీకెండ్ వరకు బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకునే అవకాశం అయితే లేకపోలేదు. మరి ఆ అవకాశాన్ని ‘ఇష్క్’ ఎంత వరకు సద్వినియోగపరుచుకుంటుందో చూడాలి..!

రేటింగ్ : 2/5

Click Here To Read In ENGLISH

Share.