ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!

ఈమధ్యకాలంలో చిన్న-పెద్ద సినిమా అనే తేడాను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారు. సినిమా బాగుంటే చాలు ఆదరిస్తున్నారు. అందరు కొత్తవాళ్లతో రూపొంది టీజర్ తోనే మంచి రెస్పాన్స్ ను చూరగొన్న “ఎవ్వరికీ చెప్పొద్దు” చిత్రం నేడు విడుదలైంది. దిల్ రాజు సారధ్యంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

evvarikee-cheppoddu-movie-review1

కథ: తండ్రి దుర్గాప్రసాద్ చిన్నప్పటినుండి కులం గురించి నూరిపోయడంతో.. తనకు తెలియకుండానే తాను కూడా కులానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలెడుతుంది హారతి (గార్గేయి). ఆధునిక యువతి అయినప్పటికీ.. ఈ కుల పిచ్చి మాత్రం కాస్త గట్టిగానే ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఈవెంట్ లో పరిచయమైన హరి (రాకేష్ వర్రే)ని తొలి చూపులోనే ఇష్టపడుతుంది కానీ.. అతడు తన కులానికి చెందినవాడు కాదని గ్రహించి వెంటనే అతడ్ని వద్దు అనుకొంటుంది.

అప్పట్నుంచి ఆమె ప్రేమను సాధించి.. ఆమెను పెళ్లాడడం కోసం కులంతో కుస్తీ పట్టిన హరి కథే ఈ “ఎవ్వరికీ చెప్పొద్దు” చిత్రం.

evvarikee-cheppoddu-movie-review2

నటీనటుల పనితీరు: ఇదివరకు పలు చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించిన అనుభవం ఉన్న రాకేష్ వర్రే ఈ చిత్రంలో హరి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ప్రెజంట్ జనరేషన్ యూత్ & లవర్స్ సినిమాలోని మనోడి క్యారెక్టరైజేషన్ కు గట్టిగా కనెక్ట్ అవుతారు. ఎమోషనల్ సీన్స్ లోనూ ప్రశంసార్హమైన నటన ప్రదర్శించి తన ప్రతిభను ఘనంగా చాటుకొన్నాడు.

గార్గేయి అందమైన అభినయంతో ఆకట్టుకొంది. ఆమె చలాకీతనం ఆమెకు బిగ్గెస్ట్ ఎస్సెట్. ఆ ఎస్సెట్ సినిమాకి కూడా పనికొచ్చింది. చాన్నాళ్ల తర్వాత ఒక తెలుగమ్మాయిని తెలుగు తెరపై చూడడం ఆనందంగాను అనిపించింది. సరిగ్గా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే.. గార్గేయికి తెలుగులో మంచి గ్రోత్ ఉంటుంది.

దుర్గాప్రసాద్ అనే తండ్రి పాత్ర పోషించిన నటుడు చాలా సహజంగా నటించాడు. ఆయన పాత్ర ద్వారా సమాజంలో క్యాస్ట్ పిచ్చి ఏరేంజ్ లో ఉంది అనేది అందరికీ అర్ధమవుతుంది. స్నేహితుల పాత్రల ద్వారా మంచి హాస్యం పండింది. క్లైమాక్స్ ఎమోషనల్ సీక్వెన్స్ ఆలోజింపజేసే విధంగా ఉంది.

evvarikee-cheppoddu-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: ఒక కొత్త బృందం, కొత్త ఎనర్జీతో పనిచేసినప్పుడు అవుట్ పుట్ కూడా కొత్తగా ఉంటుంది. అందుకే శంకర్ శర్మ సంగీతం, విజయ్ జె.ఆనంద్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. “పెళ్ళిచూపులు, హ్యాపీడేస్” లాంటి ఒక సినిమా చూస్తున్నప్పుడు కలిగే సేమ్ ఫీల్ “ఎవ్వరికీ చెప్పొద్దు” చూసినప్పుడు కలుగుతుంది. ఎలాంటి కమర్షియల్ ఆర్భాటాలకు తావు లేకుండా కేవలం కంటెంట్ ను నమ్ముకొని ఈ యువ బృందం తీసిన ఈ సినిమాని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ఎంతో కొంత ప్రేక్షకుల మీద కూడా ఉంటుంది. అప్పుడే మరింతమంది దర్శకులు ఈ తరహా సినిమాలు తీయడానికి ముందుకోస్తారు.. తెలుగు సినిమా స్థాయి కూడా అప్పుడే కమర్షియల్ పరిమితులను దాటుకొని బయటకు వస్తుంది.

దర్శకుడు బసవ శంకర్ ఈ సినిమాకి ఎడిటింగ్ విభాగంలోనూ పనిచేయడం సినిమాకి ఒకరకంగా ప్లస్, మరోరకంగా మైనస్ కూడా. తాను చెప్పాలనుకున్న పాయింట్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే ఆలోచనతో ఫస్టాఫ్ ను చాలా ఎంటర్ టైనింగ్ గా కట్ చేయించగా.. సెకండాఫ్ లో ఎడిటర్ ను, రైటర్ డామినేట్ చేశాడు. దాంతో కాస్త ల్యాగ్ పెరిగింది. ఆ ఒక్క మైనస్ తప్పితే.. సినిమా మొత్తంలో ఫలానా పాయింట్ బాలేదు, సీన్ బాలేదు అని చెప్పడానికి ఏమీ లేదు. అలాగే.. కులం గురించి, కుల పిచ్చి గురించి ఇచ్చిన డెఫినిషన్ & సోల్యూషన్ ఆలోజింపజేసే విధంగా ఉన్నాయి. అలాగని ఏదో క్లాసులు పీకలేదు, ఎంటర్ టైనింగ్ గానే చెప్పారు. అందువల్ల.. వయోబేధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేలా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని.

evvarikee-cheppoddu-movie-review4

విశ్లేషణ: ఒక మంచి సినిమా చూశామన్నా సంతృప్తి కోసం తప్పకుండా చూడాల్సిన చిత్రం “ఎవ్వరికీ చెప్పొద్దు”. రాకేష్ వర్రే డబ్బుతోపాటు మనసుపెట్టి చేసిన, తీసిన సినిమా ఇది. కులం గురించి, కుల పిచ్చి గురించి గుణపాఠంలా కాకుండా హుందాగా ఒక చక్కని మెసేజ్ ఇచ్చిన చిత్రమిది.

evvarikee-cheppoddu-movie-review5

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Share.