మజిలీ

టాలీవుడ్స్ మోస్ట్ లవ్లీ కపుల్ నాగచైతన్య-సమంత పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా కలిసి నటించిన చిత్రం “మజిలీ”. “నిన్ను కోరి” ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రెండో చిత్రం కూడా ఎమోషనల్ లవ్ స్టోరీ కావడం విశేషం. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

majili-movie-review1

కథ: పూర్ణ (నాగచైతన్య) 19 ఏళ్ల వయసులోనే ప్రేమించిన ఆన్షు (దివ్యాంశ కౌశిక్) కారణాంతరాల వలన దూరమవ్వడంతో.. తండ్రి కోరిక మేరకు శ్రావణి (సమంత)ను పెళ్లి చేసుకొంటాడు. కానీ.. తొలిప్రేమను మర్చిపోలేక పెళ్లి చేసుకున్న శ్రావణితో సౌక్యంగా ఉండలేక తాను ఇబ్బందిపడుతూ.. తన చుట్టూ ఉన్నవాళ్లని కూడా ఇబ్బందికి గురి చేస్తూ జీవితాన్ని నెట్టుకొచ్చేస్తుంటాడు.

కానీ.. ఊహించని విధంగా పూర్ణ జీవితంలోకి ఎంటరవుతుంది చిన్నారి మీరా. మీరా ఎంట్రీతో పూర్ణ-శ్రావణిల జీవితాల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకొంటాయి. ఏమిటా మార్పులు? అసలు మీరా ఎవరు? చివరికి వాళ్ళ మజిలీ ఏ తీరానికి చేరింది? అనేది తెలియాలంటే “మజిలీ” చిత్రాన్ని చూడాల్సిందే.

majili-movie-review2

నటీనటుల పనితీరు: నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ లు చక్కగా నటించినప్పటికీ నాకు బాగా నచ్చింది మాత్రం రావురమేష్ పోషించిన తండ్రి పాత్ర. ఒక మధ్యతరగతి తండ్రిగా, కొడుకు మంచి కోసం ప్రాకులాడే నాన్నగా, కోడలికి ఒక మంచి మామగా ఆయన నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రావు రమేష్ పోషించిన బెస్ట్ రోల్స్ లో ఈ చిత్రంలోని తండ్రి పాత్ర నిలిచిపోతుంది.

నాగచైతన్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతడి పాత్ర పడే బాధ చైతూ కళ్ళల్లో కనిపించింది. అక్కడే నటుడిగా సగం విజయం సాధించాడు చైతన్య. ఇక సమంతతో కలిసి నటించిన సన్నివేశాల్లో నాగచైతన్య చూపిన మెచ్యూరిటీ నటుడిగా చాలా డెవలప్ అయ్యాడని ప్రూవ్ చేస్తుంది.

సమంత పోషించిన శ్రావణి పాత్ర ఈ చిత్రానికి బిగ్గెస్ట్ ఎస్సెట్. ఓ మధ్యతరగతి ఇల్లాలిగా, భర్త మనసు అర్ధం చేసుకున్న పడతిగా సమంత అద్భుతంగా నటించింది. ఆమె క్యారెక్టరైజేషన్ ను ఇంకాస్త డీప్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే జనాలు ఆమె పాత్రకు ఇంకాస్త ఎక్కువగా కనెక్ట్ అయ్యేవారు.

దివ్యాంశ సినిమాకి గ్లామర్ ను యాడ్ చేసింది. ఆమె పాత్ర కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంది. నవతరం యువత ఆమె పాత్రకు బాగా కనెక్ట్ అవుతారు. స్నేహితుడు జోంటీ పాత్రలో సుహాస్ చాలా సహజంగా నటించాడు. ఇంకాస్త ఎక్కువ సన్నివేశాలు ఉంటే బాగుండు అనిపించింది. మరో స్నేహితుడిగా సుదర్శన్, నెగిటివ్ రోల్లో సుబ్బరాజు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

majili-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: గోపీసుందర్ బాణీల్లో “ప్రియతమ.. ప్రియతమ, నా గుండెల్లోన కలవా” పాటలు బాగున్నాయి. తమన్ నేపధ్య సంగీతం సినిమాలోని ఎమోషన్ కి తగ్గట్లుగా లేదు. సన్నివేశంలోని ఎమోషన్ లెవల్ కంటే ఎక్కువగా మ్యూజికల్ ఎలివేషన్ ఉండడంతో రెంటికీ సింక్ అవ్వలేదు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీలో మంచి డెప్త్ ఉంది. కొన్ని ఫ్రేమ్స్ మణిరత్నం సినిమాలను గుర్తుకు తేవడం విశేషం.

దర్శకుడు శివ నిర్వాణ రాసుకున్న కథలో కొత్తదనం లేదు. కానీ.. కథనం, నటీనటుల నుంచి సన్నివేశానికి తగినట్లుగా నటన రాబట్టుకున్న విధానం మాత్రం బాగున్నాయి. కాకపోతే.. ప్రేక్షకులకు ఒక మంచి ఎమోషనల్ ఫీలింగ్ ఇవ్వాలనే అత్యుత్సాహంతో సినిమాను మరీ ఎక్కువగా సాగదీశాడు. సెకండాఫ్ కి వచ్చేసరికి ఎమోషనల్ లెవల్ బార్ ఇంకాస్త పెరిగింది. దాంతో కథ గాడి తప్పింది, కథనం కుదేలయ్యింది. కొన్ని సన్నివేశాల విషయంలో చాలావరకూ సహజంగా ఆలోచించిన శివ నిర్వాణ ఎమోషనల్ సీన్స్ డీలింగ్ విషయంలో మాత్రం చాలా పాత సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొన్నాడు. ముఖ్యంగా బాలచందర్ సినిమాల ప్రభావం శివ నిర్వాణ మీద ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది.

majili-movie-review4

విశ్లేషణ: “మజిలీ” ఒక ఎమోషనల్ లవ్ జర్నీ. విపరీతమైన కామెడీ గట్రా ఎక్స్ పెక్ట్ చేయకుండా.. ఒక డీసెంట్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ కోసం థియేటర్ కి వెళ్తే మాత్రం ఓ మోస్తరుగా అలరింపజేసే చిత్రమిది. అయితే.. నాగచైతన్య-సమంత పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి చిత్రం కావడం, రేపు (ఉగాది) సెలవు కావడంతో.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ బాగానే ఉంటాయి కాబట్టి.. కమర్షియల్ గానూ సినిమా హిట్టయ్యే అవకాశాలున్నాయి.

majili-movie-review5

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

Share.