ఉన్నది ఒక్కటే జిందగీ

“నేను శైలజ, హైపర్” చిత్రాల విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న రామ్ కథానాయకుడిగా “నేను శైలజ”తో సూపర్ హిట్ అందుకొన్న కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం “ఉన్నది ఒకటే జిందగీ”. స్నేహం, ప్రేమ, త్యాగం వంటి జీవితంలో అత్యంత ముఖ్యమైన మూడు ఎమోషన్స్ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఏమేరకు సినిమాలోని ఎమోషన్ తో మూవ్ చేయగలిగిందో చూద్దాం..!!

కథ : అభిరామ్ అలియాస్ అభి (రామ్) చిన్నప్పుడే తల్లిని కోల్పోయి.. అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిలా బాధపడుతున్న తరుణంలో దొరికిన స్నేహితుడు వాసు (శ్రీవిష్ణు). పిన్న వయసు నుంచే ప్రాణస్నేహితుల్లా పెరిగిన అభి-వాసులు ఊహించని విధంగా ఒక అమ్మాయి “మహా” (అనుపమ పరమేశ్వరన్) కారణంగా దూరమవుతారు. మళ్ళీ అయిదేళ్ళ తర్వాత తమ స్నేహితుడి పెళ్ళిలో కలిసినప్పటికీ.. మాట్లాడుకోవడానికి కోపం అడ్డొచ్చి అపరిచితుల్లా వ్యవహరిస్తుంటారు. ఆ సమయంలో అభికి పరిచయమవుతుంది వెడ్డింగ్ ప్లానర్ మేఘన (లావణ్య త్రిపాఠి). అయిదేళ్ళ క్రితం ఎలా అయితే “మహా” వల్ల అభి-వాసు దూరమయ్యారో మళ్ళీ ఇప్పుడు అదే విధంగా “మేఘన” మరోమారు ఎక్కడ దూరమవుతారోనని భయపడిన మరో ఫ్రెండ్ సతీష్ (ప్రియదర్శి) క్రియేట్ చేసిన చిన్న కన్ఫ్యూజన్ కంక్లూజన్ కి దారి తీస్తుంది. మహా కారణంగా అభి-వాసుల మధ్య వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి? సతీష్ క్రియేట్ చేసిన కన్ఫ్యూజన్ ఏమిటి? చివరికి ఫ్రెండ్ షిప్ అండ్ లవ్ లో దేనికి అభి-వాసు ఓటు వేశారు? అనేది “ఉన్నది ఒకటే జిందగీ” చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు : ఎనర్జీటిక్ స్టార్ రామ్ తన బిరుదుకు తగ్గట్లు ఎనర్జీకి ఎమోషన్ ను యాడ్ చేసి అభి పాత్రలో ఒదిగిపోయాడు. ఆ గెడ్డం గెటప్పే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కానీ.. మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. రామ్ తర్వాత సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచింది శ్రీవిష్ణు. బేసిక్ గా థియేటర్ ఆర్టిస్ట్ అయిన శ్రీవిష్ణు.. ఎమోషన్ ను అవలీలగా పండించాడు. ఆల్మోస్ట్ సెకండ్ హీరో లాంటి క్యారెక్టర్ లో శ్రీవిష్ణు సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. మహా పాత్రలో కాస్త బరువైన పాత్ర పోషించిన అనుపమ పరమేశ్వరన్ హావభావాలు, డబ్బింగ్ విషయాల్లో ఆశ్చర్యపరిచినప్పటికీ.. ఆమె వయసుకు లేదా శరీరాకృతికి తగ్గ డ్రెస్సింగ్ కానీ మేకప్ కానీ ఆమెకు వేయలేదని ఆమె కనిపించిన ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తూనే ఉంటుంది. ఏదో టెన్త్ క్లాస్ పిల్ల టీచర్స్ డే రోజున ప్రిన్స్ పాల్ గెటప్ వేసినట్లుగా ఉంటుంది అనుపమ వేషధారణ. లావణ్య త్రిపాఠి రోల్ రెగ్యులర్ గానే ఉంటుంది. అయితే.. ఆమె అసిస్టెంట్ గా నటించిన హిమజ హీరోయిన్ కంటే అందంగా కనిపించడమే కాక కామెడీ పంచ్ లతోనూ ఆకట్టుకొంది. మందు బాబుగా ప్రియదర్శి అక్కడక్కడా అలరించాడు, కిరీటి క్యారెక్టర్ కి చాలామంది రిలేట్ అవుతారు.

సాంకేతికవర్గం పనితీరు : దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. “వాటమ్మా వాటీస్ దిస్ అమ్మా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు” పాటలు బాగున్నాయి. నేపధ్య సంగీతంతో ఎమోషన్ ను పతాక స్థాయిలో ఎలివేట్ చేశాడు దేవీ. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డి.ఐ మిక్స్ వంటి సాంకేతికపరమైన విషయాల్లో నిర్మాణ సంస్థ స్పెషల్ కేర్ తీసుకోవడం వలన సినిమా మనసు/మెదడుకి ఎలా ఉన్నా.. కంటికి మాత్రం ఇంపుగా ఉంటుంది.

దర్శకుడు కిషోర్ తిరుమల రాసుకొన్న కథ కంటే.. ఆ కథను నడిపించే కథనం కోసం బాలీవుడ్ సినిమాల నుంచి కాస్త ఎక్కువగా స్పూర్తి పొందాడనిపిస్తుంది. తనదైన శైలి సంభాషణలతో అక్కడక్కడా మనసు లోతులు తాకేందుకు ప్రయత్నించినా పెద్దగా సత్ఫలితాన్నివ్వలేదు. అయితే.. ఫ్రెండ్ షిప్ – ప్రేమ ఏది గొప్పది అనే సందర్భంలో స్నేహానికి ఎక్కువ వేల్యూ ఇస్తూ రాసుకొన్న సంభాషణలు-సన్నివేశాలు హత్తుకుంటాయి. కానీ.. క్లైమాక్స్ ట్విస్ట్ అండ్ ఎండింగ్ మాత్రం అప్పటివరకూ క్రియేట్ చేసిన ఎమోషన్ కు ఏమాత్రం జస్టిఫై చేయలేకపోవడం మైనస్ అనే చెప్పాలి.

విశ్లేషణ : చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులున్న జనాలకి విపరీతంగా నచ్చే చిత్రం “ఉన్నది ఒకటే జిందగీ”. అయితే.. ఎమోషన్ అనేది అందరికీ కనెక్ట్ అవ్వాలి. ప్రేమించినవాడికి మాత్రమే అర్ధమవ్వాలి అంటే “టైటానిక్” అప్పట్లో సినిమా చూసిన సగం మందికి కూడా అర్ధమయ్యి ఉండదు. ఫీలింగ్ & ఎమోషన్ కి ఇన్వాల్వ్ మెంట్ ఉండాలే కానీ కనెక్టివిటీ కాదు. ఆ లాజిక్ మిస్ అయ్యాడు దర్శకుడు కిషోర్ తిరుమల. అక్కడక్కడా స్లో స్క్రీన్ ప్లే కారణంగా బోర్ కొట్టొచ్చేమో కానీ.. ఒకసారి చూడదగ్గ చిత్రం “ఉన్నది ఒకటే జిందగీ”.

రేటింగ్ : 2.5/5

Click Here For ENGLISH Review

Share.