అజ్ఞాతవాసి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం “అజ్ణాతవాసి”. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి నాలుగు రోజుల ముందు విడుదలైన ఈ చిత్రం అభిమానులకు పండగ లాంటిదే. మరి ముందునుంచి వినిపిస్తున్నట్లుగా ఈ సినిమా “లార్గో వించ్” అనే ఫ్రెంఛ్ సినిమాకి కాపీనా, సినిమాలో పవన్ కళ్యాణ్ తన అభిమానులను ఏమేరకు సంతుష్టపరిచాడు, త్రివిక్రమ్ తన మాటలతో మళ్ళీ మ్యాజిక్ చేశాడా. సోషల్ మీడియాలో అర్ధరాత్రి నుంచి జరుగుతున్న నెగిటివ్ ప్రచారంలో నిజమెంత వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మా “ఫిల్మీఫోకస్” రివ్యూని చదవాల్సిందే.

కథ : కొన్ని వేల కోట్ల అధిపతి అయిన విందాను, అతడి వారసుడ్ని చంపి అతడి ఆస్తికి వారసుడు కావాలనుకొంటాడు సీతారామ్ (ఆది పినిశెట్టి). గోవింద భార్గవ్ అలియాస్ విందా (బోమన్ ఇరానీ) ఏ.బి గ్రూప్ సంస్థ ఛైర్మన్. ఎలాంటి సందర్భాన్నైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండడం అతడి లక్షణం. అందుకే ప్రతి విషయానికి “ప్లాన్ బి”ని సిద్ధం చేసుకొంటాడు. సో, తన ఆస్తికి వారసుడి విషయంలోనూ అదే విధమైన ఆలోచనతో విందా ప్రిపేర్ చేసుకొన్న “ప్లాన్ బి” అభిషిక్త్ భార్గవ్ (పవన్ కళ్యాణ్). అసలు అభిషిక్త్ భార్గవ్ ఎవరు? విందా వారసుడిగా అభిని ఎంపిక చేసుకోవడానికి కారణమేంటి? విందాను ఆస్తి కోసం చంపినవారిపై అభిషిక్త్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకొన్నాడు అనేది “అజ్ణాతవాసి” కథ.agnyaathavaasi-first-review-2

నటీనటుల పనితీరు : సాధారణంగా ఎలాంటి సినిమాలో అయినా కంటెంట్ తో సంబంధం లేకుండా తన ఎనర్జీ లెవల్స్ తో ఆకట్టుకొనే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మాత్రం త్రివిక్రమ్ తన స్నేహితుడే కదా అనే చనువు ఎక్కువయ్యో లేక ఆసక్తి లేకనో తెలియదు కానీ బద్ధకంగా కనిపించాడు. ఇక ఆ వింత వేషాలకు (అమ్మాయిలా నటించడం) అంతే లేదాయే. అసలు పవన్ కళ్యాణ్ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియదు, కథ అసలే అర్ధం కాదు. కోట్ల మంది అభిమానులు కలిగిన పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమాలోనే “నా అభిమానులు నేనేం చేసినా చూస్తారు” అనే నమ్మకంతో వేసిన వేషాలు, చూపిన పైత్యాన్ని హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం స్వాగతించలేకపోయారు. కానీ.. ఆ సినిమా రిజల్ట్ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ లేదా యాక్టింగ్ లో ఎలాంటి మార్పు తీసుకురాలేదని “అజ్ణాతవాసి” చూస్తే అర్ధమవుతుంది.

పాపం కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూల్ లు సినిమాలో ఎందుకున్నారో వారికైనా క్లారిటీ ఉందో లేదో. కీర్తి బొద్దుగా తెర నిండుగా కనిపిస్తే.. అను ఎమ్మాన్యూల్ కుదిరినంతలో తన యద సౌష్టవాన్ని వెండితెరపై ప్రదర్శించడం మినహా మరేం చేయలేక మిన్నకుండిపోయింది. ఇకపోతే.. తమ పాత్రలకు తామే డబ్బింగ్ కూడా చెప్పుకొన్నా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూల్ లను ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. రావు రమేష్, మురళీశర్మలు కాస్త కామెడీ పండించడానికి ప్రయత్నించి పర్వాలేదనిపించుకొన్నారు. తనికెళ్ళభరణి పాత్ర చాలా పాత్ర సినిమాలను గుర్తుకుతెస్తుంది.

సినిమా మొత్తానికి కాస్తంత వేల్యూతోపాటు ఎలివేషన్ కూడా ఉన్న పాత్ర ఖుష్బూది. తల్లి పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. సినిమా మొత్తానికి కాస్తంత పర్పస్ ఉన్న ఏకైక క్యారెక్టర్ ఆది పినిశెట్టిది. తనకు లభించిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొన్నాడు ఆది. సరిగ్గా చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్ కంటే బాగా నటించాడని చెప్పాలి.agnyaathavaasi-first-review-4

సాంకేతికవర్గం పనితీరు : అనిరుధ్ పాటలు వినడానికి ఎంత అద్భుతంగా, అద్భుతమైన సాహిత్యంతో ఉన్నాయో.. చూడ్డానికి అంత చిరాగ్గా ఉన్నాయి. అసలు ఇంస్టంట్ చార్ట్ బస్టర్ అయిన “గాలివాలుగా..” సాంగ్ పిక్చరైజేషన్ సినిమాలో ఎంత దారుణంగా ఉందంటే.. “దీనికంటే అనిరుధ్ చేసిన ట్రిబ్యూట్ సాంగ్ ప్లే చేసినా బాగుండేది” అనిపిస్తుంది. ఇక బీజీయమ్ స్పెషలిస్ట్ అయిన అనిరుధ్ ఈ సినిమాలోనూ తనదైన ట్రెండీ ఎలక్ట్రిక్ మ్యూజిక్ తో ఆకట్టుకొన్నాడు.

బాలీవుడ్ లో “రా ఒన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఓం శాంతి ఓం” లాంటి భారీ కమర్షియల్ సినిమాలతోపాటు “అపరిచితుడు” లాంటి అద్భుతమైన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసిన సీనియర్ మోస్ట్ కెమెరామెన్ మణికందన్ ను వాడుకోవడం త్రివిక్రమ్ కు సరిగా రాలేదు. పైన సినిమాల ట్రైలర్స్ ఒక్కసారి చూసి “అజ్ణాతవాసి” సినిమా చూస్తే ఆ సినిమాటోగ్రాఫరేనా ఈ సినిమా తీసింది అని ఆలోచించకమానడు ఏ సగటు ప్రేక్షకుడైనా సరే.

అలాగే మరో సీనియర్ టెక్నీషియన్ అయిన ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర్రావు గారికి త్రివిక్రమ్ నేరేట్ చేసిన కథ సరిగా అర్ధం కాలేదో లేక సినిమా చూశాక ఆయనకి కూడా బుర్ర గిర్రుమందో తెలియదు కానీ.. ఏ సన్నివేశం తర్వాత ఏ సన్నివేశం వస్తుంది అనేది అస్సల అర్ధం కాదు.

అందరూ గౌరవంతో “గురూజీ” అని పిలుచుకొనే త్రివిక్రమ్ గురించి చాలా మాట్లాడుకోవాలి.. నిజానికి త్రివిక్రమ్ ఒక రచయితగా “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాతోనే తన మార్క్ ను కోల్పోయాడు. ఇక “అ ఆ”తో ఒక దర్శకుడిగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు “అజ్ణాతవాసి”తో త్రివిక్రమ్ ఒక దర్శకుడిగానే కాక రచయితగా ఫెయిల్ అయ్యాడు. కేవలం ప్రాసలతో సినిమా హిట్ అవ్వదు అనే విషయం ఆయన ఇప్పటికైనా గుర్తించకపోతే ఒక దర్శకుడిగా తన గౌరవాన్ని కోల్పోవాల్సి వస్తుంది.

ఇక “అజ్ణాతవాసి” సినిమాలో త్రివిక్రమ్ పనితనం గురించి చెప్పాలంటే.. అసలు సన్నివేశానికి, సందర్భానికి సంబంధం ఏమిటో అస్సలు అర్ధం కాదు. కథ ఎలాగూ ఫ్రెంచ్ సినిమా “లార్గో వించ్” నుంచి స్పూర్తిపొందాడు, కథనం కూడా కాపీ కొట్టేసి “సేమ్ టు సేమ్” తీసి ఉంటే బాగుండేదేమో.agnyaathavaasi-first-review-3

సినిమాలో కొన్ని డైలాగులను త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభకు అనుకరిస్తే..

1) అసలే మనకి క్రియేటివిటీ తక్కువ, ఎక్కువ ఆలోచించకు
2) కొత్త ఐడియా రానప్పుడు, పాత ఐడియా రిపీట్ చేయడమే బెటర్.
3) పద్ధాక కొత్త కొటేషన్స్ ఎక్కడ్నుంచి తీసుకోస్తాం

ఈ డైలాగ్స్ త్రివిక్రమ్ తనపై తానే వేసుకొన్న సెటైర్స్ లా ఉంటాయి. కానీ.. సినిమా చూశాక నిజమే అనిపిస్తుంది. త్రివిక్రమ్ లో క్రియేటివిటీ తగ్గిపోయింది, అతనికి నిజంగానే కొత్త ఐడియాలు రాక పరాయి దేశం నుంచి కథలు కాపీ కొడుతున్నాడు. ఇక పద్దాకా కొత్త డైలాగులు ఎక్కడ రాస్తాను అనుకొన్నాడో ఏమో కానీ ఒకట్రెండు సన్నివేశాల్లో తప్ప సినిమా మొత్తానికి ఒక్కటంటే ఆకట్టుకొనే డైలాగ్స్ పెద్దగా లేవు.

విశ్లేషణ : ఒక హీరోగా పవన్ కళ్యాణ్ కి, దర్శకుడిగా త్రివిక్రమ్ కి కనువిప్పు లాంటి సినిమా “అజ్ణాతవాసి”. మేమేం చేసినా/తీసినా జనాలు చూస్తారు అనే వారి గుడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ ను ఈ సినిమా తునాతునకలు చేసింది. ఇకనైనా వారు తమ పంధాను మార్చుకొంటే వారి తదుపరి సినిమాలు ఆడతాయి. లేదంటే “అజ్ణాతవాసి”లాగే తయారవుతాయి. సో ఫైనల్ గా చెప్పాలంటే.. “అజ్ణాతవాసి” సినిమా చూశాక పవన్ కళ్యాణ్ తోపాటు ఆయన అభిమానులు కూడా కొన్నాళ్లపాటు “అజ్ణాతవాసం” చేయాల్సిందే.agnyaathavaasi-first-review-1

రేటింగ్ : 2/5

Share.