మిస్టర్ మజ్ను

అక్కినేని మూడోతరం నట వారసుడు అఖిల్ నటించిన మూడో చిత్రం “మిస్టర్ మజ్ను”. మొదటి రెండు సినిమాలు అటు నటుడిగా, ఇటు హీరోగా అఖిల్ ను నిలబెట్టలేకపోవడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో చిత్రంతో కథానాయకుడిగా నిలబడాలన్న కృత నిశ్చయంతో అఖిల్ నటించిన చిత్రమిది. “తొలిప్రేమ” సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. నవతరం ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

mr-majnu-movie-review1

కథ: విక్కీ అలియాస్ విక్రమ్ కృష్ణ (అఖిల్) స్త్రీలోలుడు కాదు కానీ అమ్మాయిల పాలిట మన్మధుడు లాంటోడు. తాను ఎవర్నీ అప్రోచ్ అవ్వడు కానీ.. తనను అప్రోచ్ అయిన అమ్మాయిని మాత్రం వదలడు. అదో రకమైన జెంటిల్మన్ షిప్ మైంటైన్ చేస్తుంటాడు. తనకు కాబోయే భర్త శ్రీరాముడిలా ఉండాలని కలలు కంటూ.. లండన్ లో తన బాబాయ్ దగ్గర హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటుంది నిక్కీ (నిధి అగర్వాల్).

కొన్ని విచిత్రమైన పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ కలుసుకోవాల్సి వస్తుంది. ఈ పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టకపోయినా.. ఆ ప్రేమ నిలబడడానికి మాత్రం చాలా టైమ్ పడుతుంది. ఈలోపు చోటు చేసుకున్న కొన్ని విచిత్రమైన సంఘటనల సమాహారమే “మిస్టర్ మజ్ను” సినిమా కథాంశం.

mr-majnu-movie-review2

నటీనటుల పనితీరు: పరిచయ చిత్రంలో కాస్త తత్తరపాటు కనిపించినా సెకండ్ సినిమా “హలో”లో చాలా మెచ్యూర్డ్ గా కనిపించి ఆకట్టుకున్న అఖిల్ మూడో సినిమాలో మాత్రం నటుడిగా మెప్పించలేకపోయాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లోని ఎమోషనల్ ఎపిసోడ్ లో అఖిల్ తేలిపోయాడు. ఎమోషనల్ సీన్స్ పరంగా అఖిల్ ఇంకా చాలా ట్రైనప్ అవ్వాల్సిన అవసరం ఉందని ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది.

నిధి అగర్వాల్ పాత్ర ఈ సినిమాకి చాలా కీలకం. అయితే.. ఆమె తన హావభావాలతో కానీ నటనతో కానీ ఆ క్యారెక్టర్ ను రక్తి కట్టించలేకపోయింది. సినిమాకి ప్లస్ పాయింట్ గా మారాల్సిన పాత్ర కాస్తా మైనస్ గా మిగిలిపోయింది. వెంకీ అట్లూరి ఆమె క్యారెక్టరైజేషన్ కు సరైన జస్టీఫికేషన్ ఇవ్వలేదు. ప్రియదర్శి, హైపర్ ఆది కాస్త నవ్వించగా.. చిన్నారి మనసులో మాటగా వచ్చే యానిమేటెడ్ కార్టూన్ మాత్రం విశేషంగా నవ్వించింది.

రావు రమేష్, జయప్రకాష్, రాజా, నాగబాబు, పవిత్ర లోకేష్, సితార వంటి ఆర్టిస్టులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

mr-majnu-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడిగా పరిచయ చిత్రమైన “తొలిప్రేమ” చూసినప్పుడు వెంకీ అట్లూరి ప్రతిభను పొగడనివారు లేరు. అలాంటి వెంకీ తాను 2012లో రాసుకున్నాను అని చెప్పిన “మిస్టర్ మజ్ను” కథతో పొగిడిన నోళ్లన్నీ మూతబడేలా చేశాడు. తొలిప్రేమ సినిమాలో ప్రతి ఒక్క పాత్రని అంత అద్భుతంగా తీర్చిదిద్దిన వెంకీనా ఈ సినిమా తీసింది అని సగటు ప్రేక్షకుడు అనుమానపడే స్థాయిలో సినిమాలోని పాత్రలు ఉన్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు అతడు సినిమాను మలచడంలో ఎంత పెద్ద తప్పు చేశాడో. “పగిలిన మనసు అతకదు, ఒకవేళ అతికినా మునుపటిలా ఉండదు” అనే బేసిక్ లైన్ మీద కథను అల్లుకున్న వెంకీ.. ఆ లైన్ ను ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పడంలో మాత్రం విఫలమయ్యాడు. హీరోహీరోయిన్ల నడుమ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను బాగానే ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ.. ఆ పాయింట్ ను క్లైమాక్స్ లో డీల్ చేయడంలో తడబడ్డాడు. దాంతో సినిమా కథనానికి ఒక అర్ధం లేకుండాపోయింది. ఆ హీరోయిన్ ధ్యేయాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే గనుక సినిమా ఎండింగ్ కి ఒక అర్ధం ఉండేది. అది లేకపోవడం వలన సినిమాకే మీనింగ్ లేకుండాపోయింది.

జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ మరీ బ్రైట్ గా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా బ్రైట్ లైట్ ఎందుకు వాడాడో అర్ధం కాలేదు. బేసిగ్గా సిచ్యుయేషన్ కి తగ్గట్లుగా లైటింగ్ యూజ్ చేయడంతో సిద్ధహస్తుడైన జార్జ్ ఈ సినిమాలో మాత్రం తన ప్రతిభ సరిగా ప్రదర్శించలేకపోయాడు. సినిమా మొత్తానికి మెచ్చుకోదగ్గ అంశం ఏదైనా ఉంది అంటే అవి నిర్మాణ విలువలే. భోగవల్లి ప్రసాద్ ఎక్కడా రాజీ పడకుండా గట్టిగానే ఖర్చుపెట్టాడు. ఆ ఖర్చు సినిమాలో కనిపిస్తూనే ఉంటుంది.

ఇక మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయానికి వస్తే.. డైరెక్టర్ వెంకీ అట్లూరి కథ చెబుతున్నప్పుడు, మ్యూజిక్ సిట్టింగ్స్ టైమ్ లో “నాకు తొలిప్రేమ తరహా మ్యూజికల్ హిట్” కావాలి అని చాలా గట్టిగా అడిగినట్లున్నాడు. అందుకే సేమ్ ఆ తరహా ట్యూన్సే ఇచ్చాడు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా సన్నివేశాల్లో “అరవింద సమేత” చిత్రాన్ని గుర్తుకుచేశాడు తమన్.

mr-majnu-movie-review4

విశ్లేషణ: ఒక హిట్ కొట్టి కమర్షియల్ హీరోలా సెటిల్ అవ్వాలన్న ధ్యేయంతో అఖిల్ అక్కినేని చేస్తున్న దండయాత్రలో మూడో ప్రయత్నమైన “మిస్టర్ మజ్ను” కూడా అఖిల్ కి ఆశించిన స్థాయి విజయాన్ని ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు లేకుండా కథ-కథనాలు పట్టించుకోకుండా అయితే ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు.

mr-majnu-movie-review5

రేటింగ్: 2/5

Share.