వెళ్ళిపోమాకే

యాకుబ్ అలీ అనే యువ ప్రతిభాశాలి తన స్నేహితులతో కలిసి తెరకెక్కించిన చిత్రం “వెళ్లిపోమాకే”. మొదట్లో స్వయంగా విడుదల చేసుకోడానికి సన్నద్ధమైన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు చూసి.. కంటెంట్ బాగుందని తన స్వంత నిర్మాణ సంస్థ “శ్రీవేంకటేశ్వరా క్రియేషన్స్” ద్వారా విడుదల చేశారు. మరి దిల్ రాజు మెచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూద్దాం.

కథ : ఓ యానిమేషన్ ఆఫీస్ లో వర్క్ చేసే చంద్రశేఖర్ అలియాస్ చందు (విశ్వక్సేన్) పని పట్ల బాధ్యత ఉన్నవాడు. ఉద్యోగం, మంచి స్నేహితులు ఉన్నప్పటికీ.. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ లేదనే విషయంలో మాత్రం బాధపడుతుంటాడు. తన ఫ్రెండ్ లవర్స్ ని చూస్తూ తనాకెప్పుడు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందా అని ఆలోచిస్తుంటాడు. తాను ఇష్టపడ్డ ఒకే ఒక్క అమ్మాయి శ్రుతి (సుప్రజ) తనను రిజెక్ట్ చేయడంతో.. ఆ ఆలోచనలో తనకు ఫేస్ బుక్ లో పరిచయమైన శ్వేత (శ్వేత)తో పరిచయం పెంచుకుంటాడు. మొదట్లో శ్వేతతో అంతా గానే సాగినప్పటికీ.. ఆమె వ్యవహారశైలి కారణంగా ఉద్యోగపరంగానే కాక పర్సనల్ లైఫ్ లోనూ ఇబ్బందులు మొదలవుతాయి. కట్ చేస్తే.. ఉన్నట్లుండి శ్వేత కనిపించడం మాత్రమే కాక కాంటాక్ట్ చేయడం కూడా మానేస్తుంది. శ్వేత కోసం వెతకడం మొదలెట్టిన చందుకి ప్రియురాలు శ్వేత గురించి కొన్ని నమ్మలేని నిజాలు తెలిస్తాయి. ఏమిటా నిజాలు? చివరికి చందు జీవితం ఏ తీరానికి చేరింది? ప్రేమించి ఒకమ్మాయిని సొంతం చేసుకోవాలన్న చందు కోరిక నెరవేరిందా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు : సినిమాలో కనిపించేదే మొత్తం కలిపి ఓ ఆరుగురు ఆర్టిస్టులు. అందరు కొత్తవారే. అయితే.. హీరో విశ్వక్సేన్ థియేటర్ ఆర్టిస్ట్ అయ్యి ఉండడం, హీరోయిన్స్ గా నటించిన సుప్రజ, శ్వేతలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనుభవం ఉండడంతో అందరూ నేచురల్ పెర్ఫార్మెన్స్ లతో అలరించారు. హీరోయిన్లను గ్లామరస్ గా చూడాలనుకొనేవారికి తప్పితే.. హీరోయిన్ ను నటిగా చూడాలి అనుకొనేవారికి మాత్రం సుప్రజ, శ్వేత బాగా నచ్చుతారు. విశ్వక్సేన్ స్నేహితుడిగా నటించిన వ్యక్తి కూడా సహజమైన నటనతో ఆకట్టుకొన్నాడు.

సాంకేతికవర్గం పనితీరు : సాంకేతికపరంగా సినిమా చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించినది కావడంతో.. కెమెరా వర్క్ మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో మరో అంశం కనపడలేదు. సంగీతం కూడా ఎక్కడో విన్నట్లుగానే ఉంది. సినిమాటోగ్రాఫర్ ను మాత్రం ప్రశంసించితీరాలి. చాలా తక్కువ బడ్జెట్ లో చాలా క్వాలీటీ అవుట్ పుట్ ఇచ్చారు. ముఖ్యంగా టైట్ క్లోజ్ ఫ్రేమ్స్ పెట్టి కూడా ఎక్కడా ప్రేక్షకుడు ఇబ్బందిపడకుండా చేసిన అతడి నేర్పును మెచ్చుకోవాల్సిందే. దర్శకుడిగా యాకుబ్ అలీ తక్కువ పాత్రలతో ఎక్కువ డ్రామాను క్రియేట్ చేశాడు కానీ.. రచయితగా మాత్రం ఫెయిల్ అయ్యాడు. “ప్రేమించిన అమ్మాయి దూరమైనంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు” అని దర్శకుడు చెప్పదలచుకున్న ముఖ్యమైన విషయం ఆడియన్స్ కు రీచ్ అవ్వదు. మరీ ముఖ్యంగా సున్నిత మనస్కులైతే తప్ప సాధారణ ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అన్నిటికంటే ముఖ్యంగా.. చెప్పాలనుకొన్న విషయాన్ని ఖరాకండిగా చెప్పలేక కథనాన్ని చాలాసేపు సాగదీశాడు. అందువల్ల ఆడియన్స్ బోర్ ఫీలవుతారు.

విశ్లేషణ : సినిమా మీద కంటే ప్రేమ మీద విపరీతమైన అవగాహన ఉండడంతోపాటు.. కనీసం ఒకట్రెండు బ్రేకప్ స్టోరీస్ ఉంటే తప్ప “వెళ్లిపోమాకే” సినిమాకి కనెక్ట్ అవ్వడం కష్టం. ముఖ్యంగా కమర్షియల్ సినిమా లవర్స్ ఈ చిత్రానికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది.

రేటింగ్ : ఇదో ప్రయత్నం, కావున రేటింగ్ ఇవ్వడం లేదు.

Click Here For ENGLISH Review

Share.