ద్వారక

“పెళ్లి చూపులు” ఫేమ్ విజయ్ దేవెరకొండ-పూజ ఝవేరి జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “ద్వారక”. శ్రీనివాస్ రవీందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీత సారధ్యం వహించాడు. గత ఏడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం పలుమార్లు వాయిదా అనంతరం నేడు (మార్చి 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : అమీర్ పేట్ ఎర్ర శీను అలియాస్ కృష్ణానంద (విజయ్ దేవరకొండ) తనకే తెలియకుండా స్వామీజీగా మారిపోయిన ఓ దొంగ. తేరగా వస్తున్న సొమ్ములను చూసి స్వామీజీగా “ద్వారక” అపార్ట్ మెంట్స్ లో తన స్నేహితులతో కలిసి తిష్టవేస్తాడు. అక్కడే వసుధ (పూజ ఝవేరి) కనిపించడం, కనపడిన వెంటనే హీరోగారు ప్రేమలో పడిపోవడం టకటక జరిగిపోతాయి. అయితే.. అప్పటివరకూ తన స్వార్ధం కోసం మాత్రమే స్వామీజీగా నటించిన శీను వెనుక జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడడం, ఈ గందరగోళం నుంచి తాను బయటపడాలంటే ఇమ్మీడియట్ గా తాను ఒరిజినల్ స్వామీజీని కాదని చెప్పేయడమే సరైనదని తెలుసుకొంటాడు శీను.

అయితే.. ఒక క్రిమినల్ లాయర్ (ప్రభాకర్), ఒక పోలీస్ ఆఫీసర్ (జానీ), ఒక మినిస్టర్ అతడిని అడ్డుకొని స్వామీజీగా వేషం కంటిన్యూ చేసి తమ ఖజానాలో కోట్లు పడేలా చేయాలని రూల్స్ విధించడం జరుగుతుంది. ఈ చట్రం నుంచి శీను ఎలా బయటపడ్డాడు, అందుకు హేతువాది చైతన్య (మురళీ శర్మ) ఎలా తోడ్పడ్డాడు అనేది “ద్వారక” కథాంశం.

నటీనటుల పనితీరు : “పెళ్ళిచూపులు” చిత్రంలో ప్రశాంత్ పాత్రలో తెలంగాణ యాసలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన విజయ్ దేవరకొండ, “ద్వారక”లో శీను పాత్రలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఎమోషనల్ సీన్స్ లో తెలంగాణ యాసతో మెప్పించలేకపోయాడు. పూజ ఝవేరి అందంగానే కనిపించింది కానీ.. ఆమె పాత్రకు సినిమాలో పెద్ద ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె క్యారెక్టర్ పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. హీరోకు చాలా కష్టపడి ఇచ్చిన రెండు లిప్ లాక్స్ వృధా అయ్యాయనే చెప్పాలి.

తన అమాయకత్వంతో అందర్నీ పిచ్చోళ్లను చేసే బురిడీ స్వామిగా పృధ్వీ నాన్ సింక్ కామెడీతో కాసేపు నవ్వించాడు. నవీన్ నేనీ, సుదర్శన్, షకలక శంకర్ లు సింగిల్ లైన్ పంచస్ తో కాసేపు నవ్వించారే కానీ.. పూర్తి స్థాయిలో అలరించలేకపోయారు. మురళీశర్మ, ప్రకాష్ రాజ్ పాత్రలు చిన్నవే అయినా.. తమ నటసామర్ధ్యంతో పాత్రలను రక్తి కట్టించి తమ ఇంపాక్ట్ ను చూపగలిగారు.

సాంకేతికవర్గం పనితీరు : సాయి కార్తీక్ పాటలన్నీ ఎక్కడో విన్నట్లే ఉన్నాయి. నేపధ్య సంగీతంలోనూ కొత్తదనం కనపడలేదు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువల కారణంగా క్వాలిటీ కొరవడి మంచి ఔట్ పుట్ ఇవ్వలేకపోయింది. లక్ష్మీ భూపాల్ సంభాషణలు ప్రాసలు లేకుండా సందర్భానుసారంగానే సాగినప్పటికీ.. స్క్రీన్ ప్లే సరిగా లేక ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి.

బేసిక్ గా కథ చాలా పాతది, సో, స్క్రీన్ ప్లే ఏమైనా కొత్తగా రాసుకొన్నారా అంటే ఏమీ లేదు. అసలు సన్నివేశానికి సన్నివేశానికి సంబంధం లేక “ఈ సీన్ ఇప్పుడెందుకు వచ్చింది” అని ప్రేక్షకుడు తనని తాను ప్రశ్నించుకొనే స్థాయిలో స్క్రీన్ ప్లే ఉండడం గమనార్హం. ఇక్కడే దర్శకుడి ప్రతిభ తెలిసొచ్చింది. అసలు హీరో క్యారెక్టరైజేషన్ మెయిన్ బేస్ గా సాగే ఇలాంటి చిత్రాల్లో హీరో క్యారెక్టర్ ఏంటి, బిహేవియర్ ఏంటి అనేది సినిమా చూసిన ప్రేక్షకుడికి ఏమాత్రం అర్ధం కాదు.

విశ్లేషణ : “దొంగ బాబా” కాన్సెప్ట్ లో ఇప్పటికే మన తెలుగులో చాలా సినిమాలోచ్చాయి. అయితే.. రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో తెరకెక్కిన “అయ్యారే” మాత్రం వైవిధ్యమైన కథాంశంతో హిట్ అవ్వకపోయినా మంచి సినిమాగా నిలిచింది. అదే ఫార్మాట్ లో తెరకెక్కిన చిత్రమే “ద్వారక”. అయితే.. కథనంలో కొత్తదనం కొరవడడంతో కామెడీ కాస్త పండినా సినిమా మాత్రం బోర్ కొట్టించింది.

రేటింగ్ : 3/5

Share.