డియర్ కామ్రేడ్

విజయ్ దేవరకొండ తన మార్కెట్ పరిధిని పెంచుకొనే ప్రయత్నంలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందగా నటించిన చిత్రం “డియర్ కామ్రేడ్”. “గీత గోవిందం” అనంతరం విజయ్-రష్మిక మరోమారు జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. విడుదలైన ట్రైలర్, పాటలు మరియు ప్రోమోలు సినిమా మీద అంచనాలను భారీ స్థాయిలో పెంచేశాయి. మరి విజయ్ దేవరకొండ చేసిన రిస్క్ ఫలించిందో లేదో చూద్దాం..!!

dear-comrade-movie-review1

కథ: బాబీ (విజయ్ దేవరకొండ) కమ్యూనిస్ట్ భావజాలంతో పెరిగిన కుర్రాడు. పక్కింట్లో అద్దెకు దిగిన లిల్లీ (రష్మిక మందన్న)ను ప్రేమిస్తాడు. బాబీ మనస్ఫూర్తిగా ప్రేమించినప్పటికీ.. లిల్లీ మాత్రం బాబీని పెళ్లి చేసుకోవాలా లేదా అనే విషయంలో చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లోనే తనకు ఇష్టమైన క్రికెట్ కోసం బాబీకి బ్రేకప్ చెబుతుంది.

తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నో చెప్పడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు బాబీ. ఆ డిప్రెషన్ నుండి బయటపడడానికి సౌండ్ థెరపీ తీసుకొంటాడు. కాకినాడ తిరిగొచ్చిన బాబీ.. లిల్లీ క్రికెట్ ఆడడం మానేసిందని తెలుసుకొంటాడు.

క్రికెట్ కోసం తనను వదిలేసుకొన్న లిల్లీ.. ఇప్పుడు క్రికెట్ ను ఎందుకు వదిలేసిందో అర్ధం కాక సతమతమవుతుంటాడు. లిల్లీ క్రికెట్ కు దూరమవ్వడానికి గల కారణం తెలుసుకొని.. ఆ సమస్య నుండి ఆమె బయటపడడం కోసం అండగా నిలుస్తాడు.

ఇంతకీ లిల్లీ ఎదుర్కొన్న సమస్య ఏమిటి? క్రికెట్ కు ఎందుకు దూరమైంది? ఆమెకు బాబీ ఎలా అండగా నిలిచాడు? ఆమె సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపించాడు? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రం “డియర్ కామ్రేడ్”.

dear-comrade-movie-review2

నటీనటుల పనితీరు: విజయ్ ఇమేజ్ కు తగ్గట్లుగా రాసుకున్న సన్నివేశాల్లో అతడి పెర్ఫార్మెన్స్ బాగుంది. ఎమోషనల్ సీన్స్ లో డెప్త్ మిస్ అయ్యింది. క్యారెక్టరైజేషన్ లో కొత్తదనం లేదు. కామ్రేడ్ గా మనోడు పోరాడే సమస్యలు పెద్ద చెప్పుకోదగ్గవి కావు. రెగ్యులర్ కాలేజ్ ఇష్యుస్ లాగే ఉంటాయి. కోపం తగ్గించుకోవడం కోసం తీసుకొనే సౌండ్ థెరపీ సీన్స్ లో విజయ్ నటన సహనాన్ని పరీక్షిస్తుంది.

లిల్లీ అనే సగటు అమ్మాయి పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. ఒక ఆడపిల్ల సమస్యల కంటే ఎక్కువగా సమాజానికి ఎలా భయపడుతుంది అనే పాయింట్ ను దర్శకుడు రాసుకున్న విధానం, ఆ పాత్రను రష్మిక ప్రెజంట్ చేసిన తీరు బాగున్నాయి. క్లైమాక్స్ లో రష్మిక పెర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుంది. అయితే.. ఎమోషనల్ సీన్స్ కాకుండా మిగతా వాటిలో మాత్రం రష్మిక తేలిపోయింది. చాలా సన్నివేశాల్లో అమ్మడు అసహజంగా నటిస్తుంది, కనిపిస్తుంది.

స్నేహితుల పాత్రల్లో సుహాస్, హీరోయిన్ అక్క పాత్రలో శృతి రామచంద్రన్ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఫ్రెండ్స్ గ్యాంగ్ మరియు తాతయ్య, తండ్రి పాత్రలు పోషించిన నటులు కూడా బాగా చేశారు.

dear-comrade-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సినిమాకి ఆయువుపట్టు. మూడు అద్భుతమైన పాటలతోపాటు.. నేపధ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోసాడు. సన్నివేశాలు, సన్నివేశంలో ఎమోషన్ పేలవంగా ఉన్నా.. నేపధ్య సంగీతంతో ఎలివేట్ చేసాడు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఒక మంచి మలయాళం సినిమా చూస్తున్న ఫీల్ కలుగుతుంది. ఈ తరహా కలర్ గ్రేడింగ్ మరియు టింట్ మనకి కొత్త కావడంతో ఆ ఫీల్ కలుగుతుంది.

ప్రొడక్షన్ వేల్యూస్ మాత్రం పతాక స్థాయిలో ఉన్నాయి. కథకు అవసరమైన దానికంటే కాస్త ఎక్కువే ఖర్చు చేశారనిపిస్తుంది. కానీ.. ఒకేసారి నాలుగు భాషల్లో తెరకెక్కించడం, ఒకేరోజు విడుదల చేయడం వలన చాలా సన్నివేశాల్లో ప్రధాన పాత్రధారుల లిప్ సింక్ మిస్ అయ్యింది. అదొక్కటి తప్పితే టెక్నీకల్ గా పెద్ద సమస్యలేమీ కనిపించలేదు. ఇక దర్శకుడు భరత్ కమ్మ విజన్ గురించి మాట్లాడుకోవాలి.

భరత్ ఒక దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ నచ్చాడు నాకు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం హీరో దృష్టికోణంలో సినిమాను నడిపించాడు కానీ.. హీరోయిన్ దృష్టి కోణంలో సినిమాని నడిపించి ఉంటే ఇంకా బాగుండేది. ఒక అమ్మాయి సమస్యను ఎదిరించడం పక్కడ పెడితే.. ఆ సమస్యను చెప్పుకోవడానికి కూడా ఇబ్బందిపడతారు, భయపడతారు. పరిష్కారం కనిపిస్తున్నా.. అక్కడికి చేరుకోవడానికి జంకుతారు అనే విషయాన్ని చాలా సెన్సిబుల్ గా చూపించాడు. కానీ.. నిర్లప్తత కారణంగా అవేమీ ప్రేక్షకుడిపై పెద్దగా ఇంపాక్ట్ చూపించవు. ఒక్కోసారి మనం రాసుకున్న సన్నివేశం మీద ప్రేమ ఎక్కువైపోతుంది, ఆ ప్రేమ ఎడిట్ రూమ్ బయట వదిలేయాలి.. లేదంటే ల్యాగ్ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తుంది. “డియర్ కామ్రేడ్” విషయంలో జరిగింది అదే. కొన్ని సన్నివేశాలు బాగోలేవు అని చెప్పలేం కానీ.. ఉన్న సన్నివేశాల్లో ల్యాగ్ ఎక్కువైపోవడంతో ప్రేక్షకులు నీరసిస్తారు. 169 నిమిషాల సినిమాలో సునాయాసంగా ఒక 20 నిమిషాల దాకా కత్తెర వేయవచ్చు. ఇక యూత్ ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసిన “కాలేజ్ క్యాంటీన్” సాంగ్ సినిమాలో లేకపోవడం గమనార్హం.

dear-comrade-movie-review4

విశ్లేషణ: ప్రేమ పర్యవసానం ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రతిస్పందించాల్సిన పరిస్థితిని ఓ ప్రేమికుడు ఎలా ఎదుర్కొన్నాడు? అలాగే తాను ప్రేమించిన అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్యలను ఎదిరించడానికి ఒక కామ్రేడ్ (ఎప్పటికీ తోడు ఉండేవాడు) గా ఎలా తోడు నిలిచాడు అనే సింపుల్ & సెన్సిబుల్ లైన్ తో రూపొందిన “డియర్ కామ్రేడ్”లో మోటివ్ లోపించింది. అలాగే.. సాగదీసిన కథనం, నేచురాలిటీ పేరుతొ ఇరికించిన అసందర్భమైన సన్నివేశాలు మైనస్ లుగా మారాయి. దాంతో ఈ కామ్రేడ్ అందరివాడిలా కాక కొందరివాడిగా మిగిలిపోయాడు. విజయ్ మీద అభిమానంతోపాటు సహనం పాళ్ళు కాస్త ఎక్కువగా ఉంటేనే “డియర్ కామ్రేడ్”ను 169వ నిమిషం వరకు చూడగలరు.

dear-comrade-movie-review5

రేటింగ్: 2/5

Share.