భయపెడుతున్న కరోనాకు బాబు ఎవరో తెలుసా?

తెలుగు సినిమాలకు పెద్దగా పరిచయం లేదని జోనర్‌లో సినిమా తీస్తున్నప్పుడు ట్రైలర్‌లో సినిమా గురించి ఆసక్తిగా చూపించాలి. ఇప్పుడు అదే పని చేశాడు ప్రశాంత్‌ వర్మ. ‘జాంబి రెడ్డి’ అంటూ టైటిల్‌తోనే ఆసక్తి రేపిన ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఉత్సుకత చాలామందిలో ఉంది. రెడ్డి అని ఉండటంతో ఇదేదో ఫ్యాక్షన్‌ సినిమా అక్కడ ఒకాయన పేరు జాంబి అలియాస్‌ జాంబవంత అయి ఉంటుంది అంటూ రకరకాలుగా అనుకున్నారు. అయితే ఇది జాంబీల నేపథ్యంతోనే తెరకెక్కుతుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు ప్రశాంత్‌ వర్మ. ఇప్పుడు ట్రైలర్‌తో ఆ ఆశక్తిని రెట్టింపు చేశాడు.

జాలీగా తిరిగే జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ, స్నేహితులతో గడుపుతుంటాడు హీరో. అయితే అనుకోకుండా రాయలసీమ వెళ్లాల్సి వస్తుంది. మామూలుగా రాయలసీమ అంటే కత్తులు, బాంబులు, సుమోలు, పేలుళ్లు అలవాటు చేసుకున్న బాడీ కదా మనది. అందుకే ట్రైలర్‌లో అమ్మాయి కూడా అదే మాట అంటుంది. ఇంతలో ఆమె అనుకున్నవన్నీ కనిపిస్తాయి. అయితే అదంతా ఉత్తిదే అంటూ హేమంత్‌ కూల్‌ చేస్తాడు. అప్పటివరకు అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో కథలో ట్వస్ట్‌ మొదలవుతుంది. అదేనండి జాంబీలు ఎంటర్‌ అవుతాయి. ఇక అక్కణ్నుంచి అసలు కథ మొదలవుతుంది. జాంబవంతుడు మాత్రమే తెలిసిన ఆ ప్రాంతంలో జాంబీలు ఎక్కణ్నుంచి వచ్చాయి, వచ్చి ఏం చేశాయనేదే కథ. ట్రైలర్‌లో ఇదే చూపించారు. అయితే వచ్చాక ఏం చేశాయనేది సినిమాలో చూడాలి. అదే సినిమా మెయిన్‌ పాయింట్‌ కూడా.

ప్రశాంత్‌ వర్మ అంటే టిపికల్‌ సబ్జెక్ట్స్‌ తీసుకుంటాడనే విషయం గత సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. ఇప్పుడూ అదే పని చేశాడు. అంతేకాకుండా ఇందులో డైలాగ్స్‌ కూడా బాగున్నాయి. కరోనా నేపథ్యంలో రాసుకున్న డైలాగ్స్‌ అయితే బంపర్‌. ‘ప్రధాని మోదీ కరోనా వైరస్‌ గురించి చెబుతుంటే… వింటున్నవాళ్లు కరోనా బీర్‌ గురించి అనుకోవడం’ లాంటి డైలాగ్‌లు, ‘కరోనా అందరినీ భయపెడుతోంది.. మరి ఆ కరోనాకు బాబు ఎవరు?’ అంటూ వేసిన టీజర్‌ బ్లాక్స్‌, ఆఖర్లో ‘సంక్రాంతి ఎప్పుడూ అల్లుళ్లు వస్తారు.. ఈ సారి జాంబీలు వస్తున్నాయ్‌’ డైలాగ్‌ అట్రాక్టివ్‌గా ఉన్నాయి. జాంబీ సన్నివేశాలంటే హాలీవుడ్‌లో చాలా భయంకరంగా చూపిస్తారు. ఇందులో కాస్త కామెడీగా చూపించారు. దాంతోపాటు ఒళ్లు గగుర్పొడిచే జాంబీ సన్నివేశాలు కూడా ఉన్నాయి. అన్నట్లు సంక్రాంతికే వచ్చేస్తున్నాడు ‘జాంబీ రెడ్డి’. మరింకేం రెడీ అవ్వండి. రెడ్డిగారిని చూడటానికి.

Share.