యువరత్న సినిమా రివ్యూ & రేటింగ్!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా కన్నడంలో తెరకెక్కిన చిత్రం “యువరత్న”. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ ఏకకాలంలో అనువాద రూపంలో విడుదల చేశారు. “అఖిల్” ఫేమ్ సాయేషా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సాయికుమార్ కీలకపాత్రలు పోషించారు. మరి ఈ తాజా కన్నడ చిత్రం “కె.జిఎఫ్” రేంజ్ లో తెలుగు ప్రేక్షకులను అలరించిందా లేక “పొగరు, రాబర్ట్” తరహాలో కనుమరుగైందా? అనేది చూద్దాం..!!

కథ: అర్జున్ (పునీత్ రాజ్ కుమార్) కాలేజ్ గొడవల్లో పాల్గొంటున్నాడని కాలేజ్ నుండి రస్టిగేట్ చేయబడతాడు. అప్పుడు ఆర్కే కాలేజ్ లో 7వ సెమిస్టర్ కి జాయినవుతాడు. అర్జున్ కాలేజ్ లో జాయినయ్యాక కాలేజ్ వ్యవహారంలో చాలా మార్పులు వస్తాయి. అయితే.. అర్జున్ అసలు పేరు యువరాజ్ అని ప్రిన్సిపాల్ (ప్రకాష్ రాజ్) రివీల్ చేయడంతో కథలో ట్విస్ట్, అక్కడ్నుంచి ఇంకో నాలుగైదు ట్విస్టులు వచ్చాక కథలో అప్పటివరకూ హీరోలుగా ఉన్నవాళ్ళందరూ విలన్స్ అయిపోతారు. ఇంతకీ ఆర్కే కాలేజ్ లో ఏం జరుగుతోంది? అర్జున్ అలియాస్ యువరాజ్ ఎవరు? కాలేజ్ లో ఏం చేయడానికి వచ్చాడు? అనేది “యువరత్న” సినిమా చూశాక అర్ధమయ్యే సమాధానాలు.

నటీనటుల పనితీరు: కన్నడలో పవర్ స్టార్ గా పిలవబడే పునీత్ నటుడిగా పర్వాలేదు. డ్యాన్స్ లు మాత్రం ఇరగ్గొట్టాడు. అయితే.. చాలా సన్నివేశాలు, సందర్భాలు ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో చూసేసినవి కావడంతో ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేరు, అలాగే పెద్దగా ఎంటర్ టైన్ కూడా అవ్వలేరు. హీరోయిన్ సాయేషా పాత్ర అలా వచ్చి వెళ్తూ ఉంటుంది. ఆమె అందంగా కనిపించి, చక్కగా తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ, సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడంతో ఆమె పాత్ర పాటలకు మాత్రమే పరిమితమైపోయింది.

ప్రకాష్ రాజ్, సాయికుమార్ లాంటి నటులను కూడా పరిమిత సన్నివేశాలకు రెస్ట్రిక్ట్ చేసేశారు. కమర్షియల్ సినిమాల్లో ఇది సర్వసాధారణం అయినప్పటికీ.. ఈ సినిమాల్లో వాళ్ళ పాత్రలు మరీ అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి.

సాంకేతికవర్గం పనితీరు: నాగచైతన్య పరిచయ చిత్రం “జోష్”కి ఎల్డర్ వెర్షన్ లా ఉంటుందీ చిత్రం. అలాంటిది తెలుగులో అనువాదరూపంలో రిలీజ్ చేయడం అనేది పెద్ద మైనస్. యాక్షన్ బ్లాక్స్ దగ్గర నుంచి డైలాగ్స్ వరకూ దాదాపుగా అన్నీ ఆల్రెడీ తెలుగులో కొన్నేళ్ళ క్రితం చూసేసినవే. అందువల్ల కన్నడ ఆడియన్స్ పునీత్ ను చూసి పులకించిపోవచ్చేమో కానీ.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ చిత్రం ఓ మోస్తరుగా కూడా ఎక్కదు.

తమన్ పాటలు కూడా సోసోగా ఉన్నాయి. ఇక నేపధ్య సంగీతంలో “సర్కారు వారి పాట” మోషన్ పోస్టర్ ట్యూన్ ఎక్కువగా వినిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ భారీ స్థాయిలో ఉన్నప్పటికీ.. మెయిన్ కథలో కంటెంట్ లేకపోవడంతో వాళ్ళ కష్టాన్ని ప్రేక్షకులు పెద్దగా నోటీస్ చేసే అవకాశం రాలేదు. దర్శకుడు కమ్ రైటర్ సంతోష్ ఆనంద్ కథ-కథనం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. కేవలం కన్నడ రిలీజ్ అనుకుంటే పర్లేదు కానీ.. తెలుగు-కన్నడ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నప్పుడు కనీస స్థాయి జాగ్రత్తలు వహించాలి.

అసలు ఆ ట్విస్టులు ఎందుకు ఉన్నాయో, ఎందుకు ఉన్నట్లుండి రివీల్ అవుతాయో, వాటికి జస్టిఫికేషన్ ఏమిటి అనేది సినిమా పూర్తయ్యేవరకూ అర్ధం కాదు. అన్నిటికీ మించి కథను “జోష్” నుంచి స్పూర్తి పొందాడు సరే, దానికి కనీస స్థాయి మార్పులు చేర్పులు చేసినా బాగుండేది. అన్నిటికంటే ముఖ్యంగా ట్రైలర్ లోనే మెయిన్ ట్విస్ట్ రివీల్ చేసేసి సినిమా మీద ఎలాంటి అంచనాలు లేకుండా చేశాడు. కన్నడ యావరేజ్ గా నిలిచే అవకాశం ఉన్న ఈ చిత్రం తెలుగులో బేసిక్ ఓపెనింగ్స్ కలెక్ట్ చేయడం కూడా కష్టమే.

విశ్లేషణ: రాంగ్ టైంలో, రాంగ్ ఏరియాలో (తెలుగు రాష్ట్రాలు) విడుదలైన చిత్రం “యువరత్న”. కంటెంట్ సోసోగా ఉండి, కథనంలో పట్టు లేకపోవడంతో థియేటర్లో సినిమా చూసే ప్రేక్షకుడికి నీరసం వచ్చి బయటకు వెళ్లిపోవాలనే ఆలోచనలు రావడం ఖాయం.

రేటింగ్: 1.5/5

Share.