‘విరాటపర్వం’ ఫస్ట్ గ్లింప్స్: కామ్రేడ్ రవన్నగా రానా జీవించేశాడు!

టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న ‘విరాటపర్వం’ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు చిన్న టీజర్ ని వదిలింది. 1990లలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు టీజర్ ఆరంభంలోనే చెప్పారు. ఆ తరువాత నక్సలైట్ ల దళం చూపిస్తూ.. రానా పాత్రని పరిచయం చేశారు.

”ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది.. సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది.. డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్న” అంటూ నక్సలైట్ అవతారంలో ఉన్న రానాని చూపించారు. కామ్రేడ్ రవన్న పాత్రలో రానా జీవించేశాడనే చెప్పాలి. తన లుక్, గెటప్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టీజర్ మొత్తానికి సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా మూడు, నాలుగు షాట్స్ చూపించి నేపధ్య సంగీతంతో టీజర్ ని కట్ చేసిన విధానం ఆకట్టుకుంది.

ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సాయి పల్లవి, ప్రియమణి, నందితాదాస్ వంటి తారలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్ గా నివేదా పేతురాజ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share.