వినరా సోదర వీర కుమారా

“మేం వయసుకువచ్చాం, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్” లాంటి హిట్ సినిమాల తర్వాత ఆ బ్యానర్ నుంచి సినిమా “వినరా సోదర వీర కుమారా”. శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా చంద్ర నాదెళ్ళ దర్శకుడిగా పరిచయమయ్యాడు. రొటీన్ లవ్ స్టోరీస్ కి భిన్నంగా కొత్త కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ఇవాళ విడుదలై. “నేనే రాజు నేనే మంత్రి”తో రచయితగా మంచి గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మీభూపాల మాటలు, పాటలు అందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం..!!

vinara-sodara-veera-kumara-movie-telugu-review1

కథ: తల్లిదండ్రుల ఆశల్ని పట్టించుకోకుండా, తనకంటూ ఒక ఆశయం అనేది లేకుండా ఆకతాయిగా తిరిగే కుర్రాడు రమణ (శ్రీనివాస్ సాయి). అదే ఊర్లో ఉండే సులోచన (ప్రియాంక జైన్)ను ఇష్టపడతాడు. తన ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియని కంగారులో ఆమెకు ముద్దు పెడతాడు. ఆ ముద్దుతో చిగురిస్తుంది అనుకున్న ప్రేమ కాస్త బెడిసికొడుతుంది. ఆ తర్వాత మళ్ళీ దగ్గరైనప్పటికీ.. కారణాంతరాల వలన సులోచన తన బావను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు రమణ.

అప్పటివరకూ తన ప్రేమకు సహాయపడిన సురేష్ అలియా సూరి అనేది దెయ్యంతో ఈ విషయాన్ని మొత్తం చెప్పి ఆత్మహత్య చేసుకోవాలనుకొంటాడు రమణ. కానీ.. దెయ్యం రూపంలో సూరి ఆ ఆత్మహత్యను ఆపుతాడు. తాను కూడా ఇలాగే ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకొన్నానని, తనకో చివరి కోరిక ఉందని.. తన మరణం కారణంగా బాధపడిన తన తల్లిదండ్రులు, గురువు, స్నేహితుడు మరియు తాను ప్రేమించిన అమ్మాయికి తన బదులుగా క్షమాపణ చెప్పమని కోరతాడు.

తన ప్రేమ ఎటూ పోయింది కాబట్టి.. కనీసం సూరి చివరి కోరికైనా తీరుద్దామని ఒక కొత్త ప్రయాణం మొదలెడతాడు రమణ. ఆ ప్రయాణంలో రమణ తెలుసుకొన్న జీవిత సత్యం ఏమిటి? సూరి తల్లిదండ్రులను, స్నేహితులను కలిసిన తర్వాత రమణలో వచ్చిన మార్పు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

vinara-sodara-veera-kumara-movie-telugu-review2

నటీనటుల పనితీరు: ఇదివరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఉన్న శ్రీనివాస్ సాయికి కెమెరా కొత్త కాకపోవడంతో రమణ పాత్రకు ప్రాణం పెట్టాడు. రెండున్నర గంటల సినిమాలో దాదాపు 40 నుంచి 50 నిమిషాల వరకూ కెమెరా అనేది స్టాండర్డ్ ఫ్రేమ్ లో శ్రీనివాస్ సాయి ముఖం మీద ఉంటుంది. ఆ 40,, 50 నిమిషాల్లో ఏ ఒక్క సెకను కూడా నటుడిగా తేలిపోలేదు శ్రీనివాస్ సాయి. కొన్ని చోట్ల అరవ హీరోలా కనిపించినా.. కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఇండస్ట్రీకి శ్రీనివాస్ సాయి రూపంలో మరో మంచి యువ కథానాయకుడు దొరికినట్లే. డైలాగ్ డెలివరీ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే కుర్రాడికి అద్భుతమైన భవిష్యత్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రియాంక జైన్ పద్ధతిగల పల్లెటూరి పిల్ల పాత్రకి సరిగ్గా సరిపోయింది. హావభావాల ప్రకటన కూడా బాగుంది కానీ.. క్యారెక్టరైజేషన్ కి సరైన జస్టీఫికేషన్ లేకపోవడంతో ఆమె పాత్రకు ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ అవ్వరు.
కనిపించిన మూడునాలుగు సన్నివేశాల్లోనూ ఉత్తేజ్-ఝాన్సీలు సగటు మధ్యతరగతి తల్లిదండ్రులుగా సహజమైన నటనతో అలరించారు. ప్రీక్లైమాక్స్ సీన్ లో ఉత్తేజ్ సింగిల్ షాట్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత.. ఈయనకి ఎందుకు సరైన ఆఫర్లు రావడం లేదు, ఎందుకు ఈయన్ని మన తెలుగు దర్శకులు సరిగా వినియోగించుకోకుండా బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ లా వాడుతున్నారు అని బాధపడడం తప్ప ఏం చేయలేం.

vinara-sodara-veera-kumara-movie-telugu-review3

సాంకేతికవర్గం పనితీరు: శ్రవణ్ భరద్వాజ్ బాణీలు కొత్తగా ఉన్నాయి. కాకపోతే.. డి.టి.ఎస్ మిక్సింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడాల్సింది. ముఖ్యంగా.. దెయ్యంగా సూరి.. రమణని కాంటాక్ట్ చేయడం కోసం గోడను టక్ టక్ మని కొట్టే చప్పుడు మరీ లౌడ్ గా ఉండడంతో.. ఏదో సుత్తి పట్టుకొని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడి నెత్తి మీద కొడుతున్నట్లుగా ఉంటుంది.రవి.వి కెమెరా వర్క్ బడ్జెట్ కు తగ్గ అవుట్ పుట్ ఇచ్చాడు. లైటింగ్ పరంగా తీసుకున్న కేర్ బాగుంది. కాకపోతే.. ఒకటే రూమ్ లో షాట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రొజెక్ట్ చేసి ఉంటే ప్రేక్షకుడికి బోర్ కొట్టేది కాదు.

దర్శకుడు చంద్ర రాసుకున్న పాయింట్ చాలా బాగుంది. ఆ ఆలోచన రావడమే అభినందనీయం. “ఆత్మహత్య చేసుకోవాలనుకునే ముందు.. అదే విధంగా చనిపోయిన ఒక వ్యక్తి ప్రపంచంలోకి ఒకసారి వెళ్ళి చూస్తే.. “ఆఫ్టర్ ఎఫెక్ట్స్” అనేవి ఎలా ఉంటాయో తెలుస్తుంది” ఇది “వినరా సోదర వీర కుమారా” బేసిక్ కాన్సెప్ట్. నిజానికి ఇది చాలా మంచి కథ, కానీ.. ఆ కథను నడిపించిన కథనం ఆసక్తికరంగా లేదు. ముఖ్యంగా.. లాజిక్స్ అనేవి ఎక్కడా కనిపించవు. అలాగే.. కొన్ని సన్నివేశాల కంపోజిషన్ కూడా బాగోలేదు.లక్ష్మీభూపాల సాహిత్యం కంటే సంభాషణలే బాగున్నాయి. ముఖ్యంగా.. సూరిని ఎందుకు క్షమించరో అతని స్నేహితులు చెప్పే కారణాలు మనసుకి హత్తుకుంటాయి. అలాగే.. సూరి తల్లి ఇంటికి వచ్చిన రమణను తన కొడుకు అని భావించి ఏడ్చే సన్నివేశంలో ఎమోషన్ అద్భుతంగా పండింది.

vinara-sodara-veera-kumara-movie-telugu-review4

విశ్లేషణ:మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. సరైన కథనం, అలరించే డీలింగ్ కొరవడడంతో “వినరా సోదర వీరకుమారా” ఓ ఫెయిల్డ్ ఆటెంప్ట్ గా మిగిలిపోయింది. అయితే.. నటీనటులకు మాత్రం మంచి భవిష్యత్ ఉందనే చెప్పాలి.

vinara-sodara-veera-kumara-movie-telugu-review5

రేటింగ్: 1.5/5

CLICK HERE TO READ IN ENGLISH

Share.