“వి” సినిమా రివ్యూ & రేటింగ్!

నాని 25వ సినిమా కాబట్టి ”వి” పబ్లిసిటీ అతడి చుట్టూ నడిచింది. అతను నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయడంతో ‘వి’ ఫర్ విలన్ (నాని) అన్నారు. అసలు, సినిమాలో ‘వి’ అంటే ఏంటి? సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమా నేడు ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఎలా ఉందో చూద్దాం.‌..!!

కథ: ఆదిత్య (సుధీర్ బాబు) హైదరాబాద్ సిటీ వెస్ట్ జోన్ డిసిపి. నగరంలోని టప్పాచబుత్రా ప్రాంతంలో ఓ మతానికి చెందిన కార్యక్రమం జరుగుతుండగా మతకలహాలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. యుద్ధక్షేత్రాన్ని తలపించిన ఆ ప్రాంతంలో రంగంలోకి దిగిన ఆదిత్య క్షతగాత్రులను కాపాడి నేరస్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. కేసులను వేగవంతంగా పరిష్కరిస్తూ ప్రజల్లో హీరో ఇమేజ్ సొంతం చేసుకున్న అతని సాహసాన్ని మెచ్చి ప్రభుత్వం గ్యాలంట్రి మెడల్ ఇస్తుంది.

సూపర్ కాప్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్యకు ఒక సైకో కిల్లర్ (నాని) సవాల్ విసురుతాడు. ఒక హత్య చేశాక తరవాత ఎవరిని చంపబోయేదీ ఒక క్లూ రూపంలో ఇచ్చి వీలైతే పట్టుకోమని ఛాలెంజ్ చేస్తాడు. మొత్తం మీద ఐదుగురిని హతమారుస్తాడు. ఆ ఐదుగురినీ హత్య చేయడానికి గల కారణం ఏంటి? హత్య చేసిన తరవాత మృతదేహం దగ్గర ఏదో ఒక క్లూతో పాటు “వి” అని ఎందుకు హింట్ ఇస్తూ వెళ్ళాడు? “వి” అంటే ఏంటి? పోలీసులు అతడిని ఎందుకు పట్టుకోలేకపోయారు? ఒక రాష్ట్రానికి హోమ్ మినిష్టర్ కొడుకును ఎందుకు కాపాడలేకపోయారు? సైకో కిల్లర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సెన్సేషన్ అవ్వాలని హత్యలు చేశాడా? యితర కారణం ఏదైనా ఉందా? యిత్యాది ప్రశ్నలకు సమాధానమే “వి” సినిమా.

నటీనటుల పనితీరు: “వి” పాత్రలో నాని అదరగొట్టేసాడు. సినిమాలో రెండు గెటప్ లలో కనిపిస్తాడు. ఒక గెటప్ ప్రేక్షకులు చూశారు. మరో గెటప్ సర్‌రైజ్. రెండు గెటప్‌ల మధ్య నాని వేరియేషన్ చూపించాడు. సైకో కిల్లర్ గెటప్, మేకోవర్ అతడి యాక్టింగ్‌ని కొంచెం ఎలివేట్ చేశాయని చెప్పాలి. కంప్లీట్ నెగెటివ్ షేడ్‌ క్యారెక్టర్‌లో సైకోయిజం చూపించాడు. ట్రయిన్, బస్ జర్నీలో తోటి ప్రయాణీకులతో సీరియస్‌గా మర్డర్లు, హింస గురించి డైలాగులు చెప్పే సమయంలో నాని హావభావాలతో ఆశ్చర్యపరుస్తాడు. నాని తరవాత హీరోగా నటించిన సుధీర్ బాబు పోలీస్ క్యారెక్టర్‌కి తగ్గ ఫిజిక్‌తో సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటాడు. వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌లో నివేదా థామస్ లావుగా కనిపించింది. అదితిరావ్ హైదరి ఎక్స్‌ప్రెషన్ క్వీన్. అందంగా కనిపించింది. ‘మనసు మరీ…’ పాటలో ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. రాజా క్యారెక్టర్ ఫ్లాష్‌బ్యాక్ నేరేట్ చేయడానికి ఉపయోగపడింది. ఎమోషన్ మాత్రం వర్కవుట్ కాలేదు. తనికెళ్ల భరణి, హరీష్ ఉత్తమన్, జయప్రకాష్ తదితరులవి రొటీన్ క్యారెక్టర్లు. కమెడియన్ వెన్నెల కిషోర్‌ని వాడుకోలేదు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఎంచుకున్న కథలో కొత్తదనం కొరవడింది. కథకు కీలకమైన పాయింట్ ‘గజినీ’ సినిమా, అందులో అసిన్ క్యారెక్టర్‌ని గుర్తు చెయ్యడం గ్యారెంటీ. మేజర్ ట్విస్ట్ ఎండింగ్ వరకు రివీల్ కాదు. అప్పటివరకు సోసోగా సినిమా చూసిన ప్రేక్షకుడికి అది తెలియగానే మరింత నీరు గారిపోతాడు. అయితే చివరి అరగంట సినిమాలో కథ ముందుకు కదులుతూ ఉంటుంది. సినిమాకి మేజర్ డ్రాబ్యాక్ ట్విస్టులు. మెయిన్ పాయింట్. రీసెంట్ టైమ్‌లో మీడియాలో హెడ్ లైన్స్‌లో ఉండి, హాట్ టాపిక్ అయ్యి అనాథాశ్రమం భాగోతం కనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా అటువంటి పాయింట్ మీద సినిమాలు వచ్చాయి. రొటీన్ కథకి కొత్త స్క్రీన్ ప్లేతో “వి” తీయాలని ట్రై చేశారు.

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అన్నప్పుడు ప్రేక్షకుల ఊహకు అందకుండా కథనం వేగంగా పరుగులు తీయాలి. “వి” నిదానంగా నత్తనడకన సాగుతూ బోర్ కొట్టిస్తుంది. ఫస్టాఫ్‌లో పోలీస్, విలన్ గేమ్ సీరియస్‌గా సాగుతుందని ఆశించిన ప్రతిసారీ సుధీర్ బాబు, నివేదా థామస్ లవ్ ట్రాక్ మధ్యలోకి వచ్చి విసిగిస్తుంది. సెకండాఫ్‌లో నాని, అదితిరావ్ మధ్య లవ్ ట్రాక్ కూడా గొప్పగా లేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రోటిన్ సీన్ సినారియో.

థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ వింటుంటే లాస్ట్ ఇయర్ రిలీజైన హిట్ థ్రిల్లర్ సినిమాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ వింటున్నట్టు ఉంటుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ప్రొడక్షన్ వేల్యూస్ సూపర్బ్. రచయితగా పర్ఫెక్ట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రాయడంలో ఫెయిల్ అయిన మోహనకృష్ణ ఇంద్రగంటి నాని, సుధీర్ బాబు నుండి చక్కటి యాక్టింగ్, సినిమాటోగ్రాఫర్ పి.జి. విందా, మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది నుండి రెండు గుడ్ ట్యూన్స్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు.

V movie story totally revealed by Nani before release1

విశ్లేషణ: నాని ప్రయోగం చేశాడు కాబట్టి “వి”జయం సాధించాడని నమ్మాలని అనిపిస్తుంది. కానీ, కష్టంగా ఉంటుంది. సినిమాలో అతడు కనిపించినప్పుడు తప్ప మిగతా టైమ్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు కనుక. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ మాత్రమే కాదు. థ్రిల్స్ కూడా. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కంఫర్ట్ జోన్ దాటి బయటకొచ్చి కొత్త అట్టెంప్ట్ చేశాడని “వి”జయం సాధించాడని నమ్మాలని అనిపిస్తుంది. కానీ, కష్టంగా ఉంటుంది. టీజర్, ట్రయిలర్‌తో ఆడియన్స్‌లో పెరిగిన ఎక్స్‌పెక్టేషన్స్ మ్యాచ్ కాలేదు కనుక. సినిమా ఏదో సోసోగా సాగింది. “వి” for వెలితిగా ఉంటుంది. థ్రిల్లర్ సినిమాలకు కావాల్సింది గుడ్ యాక్టర్లు, సెటప్ మాత్రమే కాదు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే & గుడ్ స్టోరీ పాయింట్.

రేటింగ్: 2.5/5

Click Here To Read in ENGLISH

ఫ్లాట్‌ఫార్మ్: ప్రైమ్ వీడియో

Share.