UN దేఖి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ “అన్ దేఖి”. ప్రముఖ టీవీ సంస్థ సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ట్రైలర్ నెటిజన్స్ ను విశేషంగా ఆకట్టుకొంది. మరి అంతగా ఎగ్జైట్ చేసిన ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!

కథ: ఓ పెద్ద కుటుంబంలో జరిగే భారీ పెళ్లి. నార్త్ హిల్ స్టేషన్ లోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో జరుగుతున్న ఈ పెళ్ళిని కవర్ చేయడానికి వచ్చిన రిషి (అభిషేక్ చౌహాన్) & టీం.. పెళ్లి హడావుడిలో భాగంగా మగరాయుళ్ళందరూ చేసుకుంటున్న ఓ పార్టీలో పెళ్ళికొడుకు తండ్రి పాపాజీ (హర్ష చాయా) బంగ్లా నుండి వచ్చిన ఇద్దరు డ్యాన్సర్స్ లో ఒకరిని తాగిన మైకంలో గన్ తో షూట్ చేయడాన్ని కూడా షూట్ చేస్తారు. ఆ విషయాన్ని బయటపెట్టడంతోపాటు.. ఆమె సోదరి కోయల్ (ఆపేక్ష)ను కాపాడడం కోసం రిషి చేసే ప్రయత్నాలన్నీ రింకు (సూర్య శర్మ) కారణంగా బెడిసికొడతాయి. ఈ పెద్దల వలలో చిక్కుకున్న రిషి & కోయల్ వారి నుండి తప్పించుకొన్నారా లేదా? చివరికి నిందితుడికి శిక్ష పడిందా లేదా అనేది తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం.

నటీనటుల పనితీరు: సిరీస్ మొత్తంలో ఒకరు సరిగా చేయలేదు అని వేలెత్తి చూపడానికి వీల్లేకుండా అందరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా డీసీపీగా నటించిన దిబ్యేందు బట్టాచార్య సిరీస్ కి హైలైట్. తన కేర్ ఫ్రీ యాటిట్యూడ్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో విశేషంగా అలరిస్తాడు. రిషి పాత్రలో అభిషేక్ చౌహాన్, రింకు పాత్రలో సూర్య శర్మా, సలోని రోల్లో ఆయన్ జోయా సిరీస్ కి కాస్త హాట్ నెస్ ను అద్దింది. ఆమె శృంగార సన్నివేశాలు మరీ అసభ్యంగా లేకపోవడం కాస్త ప్లస్. కోయల్ గా ఆపేక్ష ఆశ్చర్యపరుస్తుంది. ఆమె క్యారెక్టర్ వేరియేషన్స్ సిరీస్ ని మరింత ఎగ్జైంటింగ్ గా ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడ్డాయి.

సాంకేతికవర్గం పనితీరు: రచయితలు వరుణ్ బడోలా, ఉమేష్ పడాల్కర్, సిద్ధార్ధ్ సేన్ గుప్తా, మోహిందర్ ప్రతాప్ సింగ్ లు ఒక రియల్ ఇన్సిడెంట్ ను తీసుకొని దానికి మంచి ఫిక్షన్ ను జోడించి సిరీస్ ను ఆసక్తికరంగానే కాకుండా ఇన్ఫోర్మేటివ్ గానూ రాసుకొన్నారు. దర్శకుడు అనీష్ ఆర్.శుక్లా సిరీస్ ను వీలైనంత ఆకట్టుకొనే విధంగా తీర్చిదిద్దాడు. ప్రతి ఎపిసోడ్ లో ఉద్విగ్నత కొట్టొచ్చినట్లు కనబడుతుంది. 10 ఎపిసోడ్స్ కంటిన్యూ గా చూసేంతవరకూ నిద్రపోరంటే పోరు. అందుకు రచయితల బృందం మరియు దర్శకుడిని తప్పకుండా మెచ్చుకోవాలి. సెకండ్ సీజన్ కి కూడా కావాల్సినంత స్కోప్ ఉంది కాబట్టి.. వెయిట్ చేయడంలో తప్పులేదు, మరి సీజన్ 2 రిలీజ్ ఎప్పుడు అనేది ప్రస్తుతానికి తెలియదు.

అలాగే.. సిరీస్ మొత్తం ఒకే చోట నడుస్తున్నప్పటికీ బోర్ కొట్టకుండా తెరకెక్కించిన ఛాయాగ్రాహకుడు ముర్జీ మరియు ప్రొడక్షన్ డిజైన్ పనితనం కూడా ప్రశంసనీయం.

విశ్లేషణ: ఒక మంచి వెబ్ సిరీస్ కి కావాల్సిన ప్రేక్షకుడిని ఆశ్చర్యపరిచే కథ, అలరించే కథనం. ఈ రెండూ ఉన్న సిరీస్ “అన్ దేఖి”. వాస్తవ ఘటనల నేపధ్యంలో తెరకెక్కడం.. మొదటి ఎపిసోడ్ నుండి 10వ ఎపిసోడ్ వరకూ ఆసక్తికరంగా సాగడం ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ముఖ్యంగా థ్రిల్లింగ్ డ్రామాస్ ను ప్రిఫర్ చేసేవారు తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. సొ, సోనీ లివ్ సబ్ స్క్రిప్షన్ ఉంటే ఓ లుక్కేయండి.

రేటింగ్: 3/5

Share.