తెల్లవారితే గురువారం సినిమా రివ్యూ & రేటింగ్!

“మత్తు వదలరా” చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై మంచి హిట్ అందుకోవడమే కాక.. నటుడిగానూ మంచి మార్కులు సంపాదించుకున్న శ్రీసింహ కథానాయకుడిగా నటించిన రెండో చిత్రం “తెల్లవారితే గురువారం”. మణికంఠ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కింకిన ఈ చిత్రం నేడు (శనివారం, మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి కీరవాణి గారబ్బాయి హీరోగా రెండో సినిమాతోనూ హిట్ అందుకోగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: వీరేంద్ర అలియాస్ వీరు (శ్రీ సింహా) తండ్రి ఇచ్చిన డబ్బుతో కనస్ట్రక్షన్ కంపెనీ మొదలుపెట్టి స్నేహితులతో కలిసి లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తండ్రి బలవంతపు బెదిరింపుతో మధు (మిశా నారంగ్)తో పెళ్ళికి ఒప్పుకుంటాడు. తెల్లవారితే గురువారం పెళ్లి అనగా తాను ప్రేమించిన కృష్ణవేణి (చిత్ర శుక్ల) ఫోన్ చేసిందని మండపం నుంచి పారిపోయి వెళ్లిపోవాలనుకుంటాడు.

కట్ చేస్తే.. పెళ్లికూతురు మధు (మిశా నారంగ్) కూడా పెళ్లి మండపం నుంచి తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నిస్తూ వీరకు చిక్కుతుంది.

అసలు మధు పెళ్లి నుండి ఎందుకు పారిపోవాలి అనుకుంటుంది. ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఇంతకీ తెల్లవారితే గురువారం రోజున పెళ్లి అయ్యిందా? లేదా? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: సింహా నటుడిగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఎమోషన్స్ పండించడానికి ఇంకా కష్టపడుతున్నాడు కానీ.. డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ వరకూ పర్వాలేదనిపించుకున్నాడు. మిశా నారంగ్ పక్కన పర్లేదు కానీ, చిత్ర శుక్ల పక్కన కనిపించడానికి చాలా ఇబ్బందిపడ్డట్లు కనిపించాడు. ఆమె ఈ సినిమాలో అతడి కంటే పెద్దగా కనిపించడం గమనార్హం.

మిశా నారంగ్ ఫస్ట్ సినిమా అయినప్పటికీ.. నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. చిత్ర శుక్ల క్యారెక్టరైజేషన్ కు యూత్ బాగా కనెక్ట్ అవుతారు. కానీ.. ఆమె బదులు కాస్త మంచి పెర్ఫార్మర్ ఎవరైనా ఆ క్యారెక్టర్ చేసి ఉంటే సినిమాకి హెల్ప్ అయ్యేది. ఆడియన్స్ ఆ క్యారెక్టర్ ను ఇంకాస్త ఎంజాయ్ చేసేవారు.

సత్య ఈ సినిమాకి హీరో. కనిపించేది అప్పుడప్పుడే అయినప్పటికీ.. తన సీన్స్ అన్నీ భీభత్సంగా పేలాయి. అతడి కామెడీ టైమింగ్, డైలాగ్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి.

హర్ష, సిరి హనుమంత్, రాజీవ్ కనకాల, శరణ్య ప్రదీప్ లు పర్వాలేదనిపించుకున్నారు. పాపం అజయ్ పాత్ర ఎందుకొచ్చింది? అనేది దర్శకుడికి తప్ప ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. ఆ చిన్న పాత్రలోనూ తన బెస్ట్ ఇచ్చాడు అజయ్.

సాంకేతికవర్గం పనితీరు: బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా కాలభైరవ చేసే ప్రయోగాలు బాగుంటాయి. నిజానికి మత్తువదలరా చిత్రానికి భైరవ నేపధ్య సంగీతమే బిగ్గెస్ట్ ఎస్సెట్. అలాంటిది “తెల్లవారితే గురువారం” చిత్రానికి భైరవ అందించిన నేపధ్య సంగీతం సన్నివేశంలోని ఎమోషన్ తో సింక్ అవ్వకపోవడం గమనార్హం. పాటలు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. అయితే.. భైరవ మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ మాత్రం రీచ్ అవ్వలేకపోయాడు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, డి.ఐ, ప్రొడక్షన్ డిజైన్ బడ్జెట్ కు తగ్గట్లుగా ఉన్నాయి.

దర్శకుడు మణికంఠ ఒక సాధారణ కథను నవ్యమైన రీతిలో ప్రెజంట్ చేద్దామనుకున్నాడు. అయితే.. ఆలోచన ఆచరణ రూపం దాల్చడంలో పూర్తిగా విఫలమైంది. పెళ్ళికొడుకు-పెళ్లికూతురు ఒకరికి తెలియకుండా ఒకరు పారిపోదామనుకొని, గడప దాటుతుండగా ఒకరికొకరు ఎదురుపడడం, వారి కథలు ఒకరికో ఒకరు షేర్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ బాగుంది. అయితే.. మూల కథలో ఉన్న బలం కథనంలో కొరవడింది. ఫస్టాఫే భీభత్సంగా సాగింది అనుకుంటుండగా.. సెకండాఫ్ లో అనవసరమైన సన్నివేశాలు యాడ్ చేసి ప్రేక్షకుడ్ని పడుకోబెట్టడానికి విశ్వప్రయత్నం చేశాడు. ఇక అజయ్-మేక ఎపిసోడ్ ఎందుకు ఇరికించాడో అర్ధం కాలేదు. దాని బదులు ఏవైనా కామెడీ సీన్స్ ఇరికించినా కాస్తో కూస్తో నవ్వుకునేవారు ప్రేక్షకులు.

అయినా ప్రీరిలీజ్ ఈవెంట్లో రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్ లు “కథ చెప్పు” అని అడిగినప్పుడే హీరో-డైరెక్టర్ చెప్పలేకపోయారు. థియేటర్లోనూ అదే జరిగింది. అసలు ఎవరికి, ఎప్పుడు, ఎలా ప్రేమ పుట్టింది? ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? అనేది క్లారిటీ లేదు. సొ, రైటర్ గా, డైరెక్టర్ గా మణికంఠ తనకు వచ్చిన అవకాశాని సద్వినియోగపరుచుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పాలి.

విశ్లేషణ: సత్య, చిత్ర శుక్ల క్యారెక్టర్ లెంగ్త్ పెంచి, అనవసరమైన సీన్స్ కట్ చేసి ఉంటే కనీసం యావరేజ్ గా నిలిచేది సినిమా. అటు ఎమోషనల్ కనెక్టివిటీ లేక, ఇటు కామెడీ సరిగా పండక “తెల్లవారితే గురువారం” ఎప్పుడు తెల్లారుతుందా అని ప్రేక్షకుడు ఆలోచించేలా చేసింది. కథ-కథనం కొత్తగా మాత్రమే కాక ఎంగేజింగ్ గా ఉండడం ఇంపార్టెంట్ అని నవతరం దర్శకులు అర్ధం చేసుకున్నప్పుడే వాళ్ళకు వచ్చే అవకాశాలు సద్వినియోపరుచుకోగలుగుతారు, ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేయగలుగుతారు.

రేటింగ్: 2/5

Share.