“గమ్యమే”తొలి అడుగైతే….

సహజంగా ప్రతీ ఒక్కరూ జీవితంలో ఒక లక్ష్యంతో తమ గమ్యాన్ని చేరుకునే విధంగా పరుగులు పెడుతూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి జీవితం అదే ‘గమ్యం’ అనే తొలి అడుగుతో మొదలైతే, ప్రజా జీవితాలు, సామాన్య బ్రతుకులే ఆయన కధలకు మూలం అయితే. జీవిత సారంశాలను తెరకెక్కించే విధానంలో ఒక వ్యక్తి దర్శకుడుగా మారితే, గమ్యం నుంచి కంచే వరకూ కమర్షియల్ ఫొర్ములా లేకుండా భారీ హిట్స్ సాధిస్తే వినడానికే కాదు చెప్పుకోవడానికి కూడా ఎంత బావుందో కదా. నిజమే అది దర్శకుడిగా జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ సాధించిన విజయం. ఫక్తు కమర్షియల్ ఫొర్ములాలతో, ఆరు పాటలు, రెండు. మూడు ఫైట్స్, భారీగా క్లైమ్యాక్స్ ఇవన్నీ ఉన్నది మాత్రమే సినిమా కాదు అని, సహజమైన కధలతో, సామాన్య జీవన ప్రమాణాలను తన కలంతో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న క్రిష్ ను నిజంగా అభినందించాల్సిందే. ఇక ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలు లెక్కల్లో తక్కువ అయి ఉండవచ్చు ఏమో కానీ, ఆయన సందించిన బాణాలు, ఆయన విసిరిన జీవన ప్రమాణ నిజాలు ప్రేక్షకుల గుండెల్లో మాత్రం ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి. మరి క్రిష్ తీసిన కొన్ని సినిమాల విశేషాలపై ఒక లుక్ వేద్దాం రండి.

గమ్యం

Gamyam,Gamyam Movie,Krish Moviesజీవితం విలువ తెలియకుండా డబ్బులో మునిగి తేలే ఒక పారిశ్రామికవేత్త కుమారుడు. డబ్బు కోసం దొంగ తానాలు చేసే ఒక దొంగ. జీవితాన్ని ఎలా జీవించాలో తెలిసి, జీవితాన్ని గురించి వివరించే ఒక డాక్టర్. ఈ మూడు పాత్రల్లో క్రిష్ ప్రేక్షకులకు జీవితాన్ని చూపించాడు. ఒకరికి సహాయం చేయడంలో వచ్చే ఆనందం ఎన్ని కోట్లు పెట్టినా పొందలేం అని క్రిష్ కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ముఖ్యంగా ఈ చిత్రంలో అక్కడక్కడ సంభాషణలు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. అందులో ముఖ్యంగా “రెండు పూటలా తిండి కొంచెం ‘నమ్మకం’ ఇస్తే చాలు”, “ప్రదేశాలను కాదు చూడవలసింది ప్రపంచాన్ని”, ప్రయాణంలో నన్ను నేను చూసుకున్నాను. ఈ డైలాగ్స్ అందరి గుండెలకు హత్తుకుని ఆయా సన్నివేశాలను తారా స్థాయికి చేర్చాయి. ఇక ఈ చిత్రానికి క్రిష్ కు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది.

వేదం

Vedam,Vedam Movie,Krish Moviesసమాజంలో బ్రతుకుతున్న ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక మానసిక సంఘర్షణ ఉండే ఉంటుంది. ఆ పాత్రల మానసిక సంఘర్షణలు వెండి తెరపై ఆవిష్కరిస్తే…అదే వేదం. మార్పు సమయంలొ మనిషి ఎదుర్కొనే మానసిక సంఘర్షణల సమాహారమే ఈ వేదం…అవును ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్న రాములు పాత్రలో పేదవాడి జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. బిడ్డ చదువు కోసం అవయవాలు సైతం అమ్ముకునేందుకు సిద్ధమైన తల్లి పాత్రలో బిడ్డలా భవిష్యత్తు కోసం తల్లి తండ్రులు పదే ఆవేదన చూపించారు. లౌకిక దేశంలో మతం మత్తుకి తట్టుకోలెక దేశమె వదికలేద్దామనుకునే ముస్లిం పాత్రలో దేశంలోని మత కల్లోలంపై సామాన్యుల వేదనను చూపించారు. చేస్తున్నది తప్పని తెలియక సొంతంగా కంపెనీ పెట్టి వ్యభిచారం చేయాలనుకునే వేశ్య పాత్రలో సమాజంలో తప్పక తప్పు చేస్తున్న కొందరు అమాయకుల జీవితాల సారాంశాన్ని తెరపై ఆవిష్కరించారు. సమాజం కంటే సంగీతం, అంతకు మించి కెరీర్ ముఖ్యమనుకునే పాత్రలో మనిషి స్వార్ద స్వరూపంపై విశ్లేషించారు. డబ్బు ఉంటే చాలు ఏదైనా చేయవచ్చు అనుకునే సామాన్యుని పాత్రలో సామాన్య జీవితాల జీవనాన్ని, వారి ఆశలు, ఆలోచనలని స్పష్టంగా ఆవిష్కరించారు. ఇలా సమాజంలో బ్రతుకీడుస్తున్న ఎన్నో జీవితాలపై క్రిష్ సందించిన బాణమే ఈ వేదం.

కృష్ణం వందే జగద్గురుం

Krishnam Vande Jagadgurum,Rana,Krish Movieసామాన్యుని జీవితాల్లో స్వార్ధం కోసం ఒక బడా వ్యాపారవేత్త, రాజకీయ పలుకుబడి ఉన్న నేత చేసిన అఘాయిత్యం, దాన్ని ఎదుర్కున్న కధానాయకుడు. ఇలా తనదైన శైలిలో పదునైన సంభాషణలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు క్రిష్. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం పర్వాలేదు అనిపించినప్పటికీ, విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకోవడం విశేషం.
ఈ చిత్రంలో “తాత రాసింది దేవుడు గురించి కాదు, సాయం గురించి”,
“దొరికినోడు దోచుకుంటున్నాడు, దొరకనోడు ఏడుస్తున్నాడు”
“పురిటి నొప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసిన వాడు పశువు అవుతాడు” ఇలాంటి ఎన్నో పదునైన సంభాషణలు ప్రేక్షకులకు ఆలోచించే అవకాశాన్ని కల్పించాయి.

కంచె

Kanche,Kanche Movie

సైనికుడే ప్రేమికూడైతే….తుపాకీ నీడలో గులాబీ పువ్వుల పరిమళాల సువాసనలు గుప్పుమంటే….గుండె చప్పుడు వెనుక సతగ్ని శబ్ధాలు వినిపిస్తే…ఆనాటి రెండో ప్రపంచ యుద్దాన్ని ప్రేమ కధతో రంగరించి వెండి తెరపై ఆవిష్కరిస్తే…భావోద్వేగాలు, బలిదానాలు, ధైర్య సాహసాలు, ఎదురు చూపులు, కన్నీళ్ళు అన్నీ కలగలసిన విలక్షణమైన కధని మన ముందు ఉంచితే…అదే క్రిష్ ‘కంచె’. ఈ చిత్రానికి ‘న్యాషనల్ అవార్డ్’ దక్కడం నిజంగా మన తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. ఇక ఈ చిత్రంలో కొన్ని సంభాషణలు మనసుకు హత్తుకునేలా సంధించాడు క్రిష్..అనులో ముఖ్యంగా కులం పై తాను రాసిన ఈ డైలాగ్, ఎంత మందిని ఆలోచింపజేసేలా ఉంది…”కమతాన్ని నమ్ముకున్న వాడు కమ్మోడు అయ్యాడు, కాపు కాసే వాడు కాపోడు అయ్యాడు, కుమ్మరోడి కుండ, చాకలోడి బండ, కంసాలి సెట, శాలీల నేత, వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావ్ అని, నీ నెత్తురు ఏంటి అని కాదు. అలా అడిగిన వాడు మనిషే కాదు.

ఇలా విలక్షణ పాత్రలతో, తనదైన శైలిలో, తన మదిలో మెదిలిన భావాలను తెరపై ఆవిష్కరిస్తున్న క్రిష్ త్వరలో నటసింహం నందమూరి బాలయ్య కధానాయకుడిగా, గౌతమీపుత్ర శాతకర్ణి కధతో మరోసారి తెలుగు తెరకు సవాల్ విసురుతున్నాడు. మరి నవరసాలూ పండించే నటసింహాన్ని మన క్రిష్ ఏ విధంగా తెరపై ఆవిష్కరిస్తాడో…జస్ట్ వెయిట్ అండ్ సీ…

Share.