‘తలైవి’ ట్రైలర్ : ”మహాభారతానికి ఇంకో పేరే.. జయ”

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో నటిస్తోంది. ఏఎల్ విజయ్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి.

”ఒక సినిమా నటితో మనకి రాజకీయం నేర్పించాలని అనుకోవడం అనేది..” అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ”ఇది మగవాళ్ల ప్రపంచం.. మగవాళ్లే పాలించాలి. ఒక ఆడదాని చేతిలో పార్టీని పెట్టి వెనక్కి నుంచోమ్” అనే డైలాగ్స్ రాజకీయాల్లో ఎదగడానికి జయలలిత ఎన్ని సవాళ్లను ఎదుర్కొందో అర్ధమయ్యేలా చేస్తున్నాయి.

”నిన్ను గెలవాలనుకోవడానికి నువ్ అంత పెద్ద మనిషివేమీ కావు. నిన్న కురిసిన వానకి ఇవాళ మొలిచిన గడ్డిమొక్కవి నువ్వు.. మర్రిచెట్టుని ఢీ కొట్టాలనుకోకు..” అంటూ సముద్రఖని పాత్ర జయలలితకి వార్నింగ్ ఇవ్వడం.. దానికి ఆమె ”ఎవరు మొక్కో ఎవరు చెట్టో కాలమే చెబుతుంది” అని బదులిచ్చే సీన్ హైలైట్ గా నిలిచినది.

”మహాభారతంలో ద్రౌపదికి కూడా ఇదే జరిగింది.. తన చీరని లాగి అవమానపరిచిన ఆ కౌరవుల కథ ముగించి.. జడను ముడేసుకొని శపథాన్ని నెరవేర్చుకుంది. ఆ మహాభారతానికి ఇంకో పేరుంది.. జయ” అంటూ వార్నింగ్ ఇచ్చే సీన్ అదిరిపోయింది.

ట్రైలర్ లో వినిపించిన మరికొన్ని డైలాగులు..

”ఇది పోరాటం.. ప్రజల కోసం పోరాటం.. ప్రాణం పోయేవరకు పోరాడుదాం”

”నువ్ ప్రజలను ప్రేమిస్తే.. ప్రజలు నిన్ను ప్రేమిస్తారు.. అదే రాజకీయం”

”నన్ను అమ్మగా చూస్తే.. నా హృదయంలో మీకు చోటుంటుంది.. నన్ను కేవలం ఒక ఆడదానిగా చూస్తే..”

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని మరింత ఎలివేట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.