సైరా నరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

“ఖైదీ నెం.150″తో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన 151వ చిత్రం “సైరా నరసింహారెడ్డి”. చరిత్ర పుటల్లో సరైన స్థానం సంపాదించుకోలేకపోయిన సాయిధ పోరాట యోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని చిరు తనయుడు చరణ్ దాదాపు 300 కోట్ల రూపాయలు వెచ్చించి భారీ స్థాయిలో నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అభినయ చక్రవర్తి సుదీప్, స్టైలిష్ విలన్ జగపతిబాబు, లేడీ సూపర్ స్టార్ నయనతార, మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు (అక్టోబర్ 2) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. మరి ఈ పీరియాడిక్ & పేట్రియాటిక్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

sye-raa-movie-review1

కథ: ధన సంపద కంటే ఎక్కువగా భారతీయుల దగ్గర సంస్కారం, సాంప్రదాయం, వేద సంపదలు మెండుగా ఉన్నాయని.. అవి దొంగిలించి లేదా నాశనం చేసి భారతీయులను తమ బానిసలుగా మార్చుకోవాలని కుటిల బ్రిటిష్ వారు పన్నిన పన్నాగంలో భాగంగా భారతదేశంలో అడుగిడిన తెల్లదొరలకు రొమ్ము విరిచి ఎదురు నిలిచిన తొలి సాయిధ స్వాతంత్ర సమరయోధుడు మజ్జారి నరసింహా రెడ్డి ఉరఫ్ సైరా నరసింహారెడ్డి (చిరంజీవి). స్వతంత్ర సాధన కోసం తెల్లవారిని ఎదిరించడమే కాదు.. ప్రజల్లో ఐకమత్యాన్ని, స్వాతంత్ర కాంక్షను, స్ఫూర్తిని నింపి.. వీరమరణం పొంది చరితార్ధుడవుతాడు. ఉరికంబం మీద నిలబడి కూడా తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన ఈ ధీరుడి పోరాట పటిమ, అతడి ధీరత్వమే ఈ చిత్ర కథాంశం.

sye-raa-movie-review2

నటీనటుల పనితీరు: కొన్ని పాత్రలు కొందరి కోసం వేచి చూస్తుంటాయి అంటారు. అలా ఎన్నో ఏళ్ల నుండి మజ్జారి నరసింహారెడ్డి అనే పాత్ర చిరంజీవి కోసం వేచి చూసి.. ఆయన ఈ సినిమాలో నటిస్తున్నాడు అని తెలుసుకొని.. షూటింగ్ జరిగినన్నాళ్లూ ఆయనను ఆవహించిందేమో అనిపిస్తుంటుంది సినిమా చూస్తున్నంతసేపూ. ఆయన కళ్ళల్లో పౌరుషం చూస్తుంటే.. ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుచుకొంటాయి. ముఖ్యంగా.. క్లైమాక్స్ లో ఉరికంబం మీద నిలబడి ఆయన చెప్పే ప్రతి డైలాగ్, పలికే ప్రతి పదం, ఆయన కంట్లో ప్రతిబింబించిన ప్రతి భావం.. “ఇందుకు కదా చిరంజీవిని భారతదేశం గర్వ్హించదగ్గ నటుడు అనేది” అని పదే పదే గుర్తుకుచేస్తుంది. కళ్ళు నిప్పులు కురిపించాయి అని కవులు, రచయితలు కవితాత్మక ధోరణిలో రాస్తుంటారు. ఈ సినిమాలో చిరంజీవి కళ్ళు చూస్తే అది నిజమే అనిపించింది. 64 ఏళ్ల వయసులో చిరంజీవిని 30 ఏళ్ల యువకుడిగా చూపించడం కోసం చిత్రబృందం & గ్రాఫిక్స్ టీం పడిన శ్రమ కాస్త ఇబ్బంది కలిగించి బెడిసికొట్టిందనే చెప్పాలి. ఆ ఒక్క మైనస్ తప్పితే.. సినిమా మొత్తం బూతద్దం పెట్టి వెతికినా నెగిటివ్స్ అనేవి కనిపించవు.

సినిమా మొత్తం చిరంజీవే కనిపించినా.. చిరంజీవి తర్వాత తన నటనతో పాత్రకి ప్రాణం పోసిన నటుడు సుదీప్. తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకోవడంతో క్యారెక్టర్ ఇంకా బాగా రిజిష్టర్ అయ్యింది. నయనతార, తమన్నాల అందం, అభినయం సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, బ్రహ్మాజీ, రణధీర్, రవికిషన్, రఘుబాబు, పృధ్వీలు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫిదా ఫేమ్ సాయిచంద్ ఉన్న రెండు సన్నివేశాల్లో పతాకస్థాయి నటన కనబరిచాడు. సినిమాలో ఒకరు బాగా చేశారు, ఒకరు చేయలేదు అని లేదు. అందరు సమిష్టిగా తమ ఉత్తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు.

sye-raa-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: బాహుబలి లాంటి విజువల్ వండర్ తర్వాత ఏ పీరియాడిక్ డ్రామా వచ్చినా.. ఆ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ను బాహుబలితో కంపర్ చేయడం కామన్ అయిపోయింది. అందులో తప్పు లేదు కూడా. ఎందుకంటే.. 200, 300 కోట్ల బడ్జెట్ అనేది కనిపించేది ఆ విజువల్స్ లోనే. అయితే.. బాహుబలి తర్వాత ఆ స్థాయి వి.ఎఫ్.ఎక్స్ వర్క్ & గ్రాఫిక్స్ తో ఆకట్టుకొన్న చిత్రం “సైరా” అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ చరణ్ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరమీద కనిపించేలా చేశాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ఆయన పెట్టిన ఫ్రేమ్స్ & టిల్ట్ షాట్స్ ఎలివేట్ చేసిన హీరోయిజం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొంటాయి.

ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఎడిటింగ్ గ్లిట్ఛస్ అనేవి ఊహించనివి. చాలా చోట్ల సీన్ టు సీన్ ట్రాన్షిసన్ ఫ్లో దెబ్బతిన్నది. ఫస్టాఫ్ లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకొన్నారు. ఆ చిన్నపాటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించి ఉంటే సినిమా విజయ పతాకం ఇంకాస్త ఎక్కువగా రెపరెపలాడేది.

రాజీవన్ ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. 1850 నాటి పరిస్థితులను, వేషధారణను, నివాస పద్ధతులను కళ్ళకు కట్టినట్లు చూపించారు. అనవసరమైన సెట్స్ అనేవి ఎక్కడా కనిపించలేదు. అమిత్ త్రివేది పాటలు సినిమా గమనానికి ప్లస్ అవ్వగా.. జూలియస్ ప్యాకియమ్ నేపధ్య సంగీతం సినిమాకి ఆయువుపట్టుగా నిలిచింది. పరుచూరి బ్రదర్స్ కథ, బుర్రా సాయిమాధవ్ మాటలు సినిమాకి మెయిన్ పిల్లర్స్. సాయిమాధవ్ రాసిన ప్రతి మాట మెదడు లోతుల్లోకి చొచ్చుకుపోతుంది, మనసుకి హత్తుకుంటుంది.

కమర్షియల్ ఎలిమెంట్స్ ను స్టైలిష్ గా ప్రెజంట్ చేయడంలో సిద్ధహస్తుడైన సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం తన పంధాను కొద్దిగా మార్చుకొని.. కథకు అనుగుణంగా కథనంలో కొద్దిపాటి మార్పులు చేసి తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. చిరంజీవిలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అయిన ఆయన కళ్లను విశ్వనాథ్ (ఆపద్భాంధవుడు), బి.గోపాల్ (ఇంద్ర), మురుగదాస్ (స్టాలిన్) తర్వాత చక్కగా సద్వినియోగపరుచుకుంది సురేందర్ రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎమోషన్స్ ను ఇంకాస్త బాగా ఎలివేట్ చేసే అవకాశమున్న సందర్భాలను నిడివి సమస్య కారణంగా వాడుకోలేకపోయాడు సురేందర్ రెడ్డి. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం మరీ ఎక్కువ సమయం తీసుకొన్నాడు. కానీ.. మెగా అభిమానులను మాత్రమే కాక ప్రతి తెలుగు ప్రేక్షకుడ్ని సంతృప్తిపరిచి డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడు.

sye-raa-movie-review4

విశ్లేషణ: చరిత్ర సైతం మర్చిపోతున్న ఓ మహావీరుడి కథ ఈ చిత్రం. మరీ భీభత్సమైన ఎలివేషన్స్ కోరుకొని థియేటర్ కి వెళ్తే కాస్త నిరాశ చెందే అవకాశాలున్నాయి కానీ.. చరిత్రను చరిత్రలా చూస్తే మాత్రం తప్పకుండా ఆకట్టుకొంటుంది. చిరంజీవి నట విశ్వరూపం కోసమైనా ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.

sye-raa-movie-review5

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Share.