పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వర్మ తెరకెక్కించిన వెబ్ ఫిలిమ్ “పవర్ స్టార్”. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం, వ్యవహార శైలి ఎలా మారింది అనే విషయానికి కావాల్సినంత వ్యంగ్యాన్ని జోడించి తెరకెక్కించిన వెబ్ ఫిలిమ్ “పవర్ స్టార్”. మరి వర్మ తన పైత్యాన్ని మరోసారి ఎలా ప్రూవ్ చేసుకొన్నాడో చూద్దాం..!!

కథ: ప్రవన్ కళ్యాణ్ (నరేశ్ చల్లకోటి) అనే రాజకీయ నాయకుడు మనసేన అనే పార్టీ స్థాపించి కేవలం ఒకే ఒక్క సీట్ గెలుచుకొని తీవ్ర నిరాశతో నిట్టూర్చుతూ ఉంటాడు. ఆ వ్యక్తి చుట్టూ ఉన్నవారు, కుటుంబ సభ్యులు అతడి పరాజయాన్ని ఎలా తీసుకొన్నారు? అనేది ఈ 37 నిమిషాల వెబ్ ఫిలిమ్ సారాంశం.

నటీనటుల పనితీరు: బేసిక్ గా ఇది పేరడీ సినిమా. అందువల్ల సినిమాలో నటీనటుల పనితీరు గురించి సీరియస్ గా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. అయితే.. నరేశ్ చల్లకోటి మాత్రం పవన్ కళ్యాణ్ ను భలే ఇమిటేట్ చేశాడు. అతడి బిహేవియర్, మ్యానరిజమ్స్ ప్రతి ఫ్రేములో పవన్ కళ్యాణ్ ను గుర్తుచేస్తాయి. సొ ఒక ఇమిటేటర్ గా అతను 100 మార్కులు సంపాదించుకున్నాడు. అలాగే మెగాస్టార్, త్రివిక్రమ్, బండ్ల గణేష్ డూప్ లు కూడా బాగానే అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: బేసిక్ గా ఇది వెబ్ ఫిలిమ్ కాబట్టి.. టెక్నికల్ గా సినిమా గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. కనీసం సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఎవరు అనేది వర్మ కూడా రివీల్ చేయలేదు కాబట్టి వాళ్ళ గురించి లైట్ తీసుకోవచ్చు.

విశ్లేషణ: “పవర్ స్టార్” అనేది మన దృష్టికోణం (Perspective)ని బట్టి నచ్చే సినిమా. మీకు పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానంతోపాటు ఆయన రాజకీయ ప్రస్థానంపై మంచి అవగాహన ఉందనుకోండి ఈ వెబ్ ఫిలిమ్ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ మీద ప్రేమ మాత్రమే ఉంది అనుకోండి కొంత మేరకు నచ్చుతుంది, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీద కూడా అవగాహన ఉందనుకోండి సినిమా చూసి పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు, అసలు ఇదంతా కాక ప్రస్తుత రాజకీయ సమీకరణల మీద అవగాహన, పవన్ కళ్యాణ్ మీద కోపం ఉన్నాయనుకోండి వర్మను ముద్దుపెట్టుకొనే స్థాయిలో నచ్చుతుంది. ఇక కరడు గట్టిన పవన్ కళ్యాణ్ అభిమాని అనుకోండి అప్పుడు మాత్రం అస్సలు నచ్చదు.

ఒక విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ ను ఎక్కడా తక్కువ చేసి చూపించలేదు వర్మ. కొన్ని విషయాలను వ్యంగ్యంగా చూపించాడంతే. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మీద తనకున్న విపరీతమైన ప్రేమను కాస్త ఘాడంగా వ్యక్తిపరిచాడు వర్మ. చివరి పది నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ను కొందరు తమ స్వప్రయోజనాల కోసం ఎలా వాడుకున్నారు? పవన్ కొందరు అసమర్ధులను ఎలా పక్కన చేర్చుకుని మోసపోయాడు? వంటి విషయాలకు ఊహించని శైలిలో సమాధానాలు చెప్పాడు వర్మ. చివరిలో వర్మ వోడ్కా, సిగరెట్ తాగుతూ పవన్ కి చెప్పే విషయాలన్నీ నిజమే కదా అనిపిస్తుంది. అయితే.. అక్కడ కూడా పవన్ వ్యక్తిత్వాన్ని సర్కాస్టిక్ గానే కెలికాడు ఆర్జీవీ. తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమానినని నిరూపించుకోవడం కోసం వర్మ తీసిన వెబ్ ఫిలిమ్ ఈ “పవర్ స్టార్”.

సో, ఇప్పటివరకూ పవన్ కు వ్యతిరేకంగా ఈ వెబ్ ఫిలిమ్ తీశాడంటూ ఎగిరిన బ్యాచ్ అందరూ నోళ్ళు మూసేయాల్సిందే. మరీ ముఖ్యంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినంత దారుణంగా ఈ సినిమా లేకపోవడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఊరట. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రంలో బాలయ్యను “బుల్ బుల్” అని మళ్ళీ కెలికిన వర్మ.. పవన్ ను మాత్రం ఎక్కడా డిరాగేటరీగా చూపించలేదు.

సొ, పవన్ కళ్యాణ్ ను అభిమానించేవారు, తిట్టుకొనేవారు, ఆడిపోసుకొనేవారు ఇలా అన్నీ వర్గాల వారు చూడదగ్గ చిత్రం “పవర్ స్టార్”.

రేటింగ్: 1.5/5

Share.