పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!

ప్రఖ్యాత అంతర్జాతీయ ఒటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తెలుగులో తొలిసారి నిర్మించిన సిరీస్ “పిట్ట కథలు”. తొలుత హిందీలో తెరకెక్కిన “లస్ట్ స్టోరీస్” రీమేక్ అని ప్రచారం జరిగినప్పటికీ.. ఒరిజినల్ స్టోరీస్ అని విడుదలయ్యాక అందరికీ తెలిసొచ్చింది. తెలంగాణ దర్శకులైన తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి. సంకల్ప్ రెడ్డి, నాగ్ అశ్విన్ లు దర్శకత్వం వహించిన ఈ నాలుగు ఎపిసోడ్ ల సిరీస్ నేడు (ఫిబ్రవరి 19) నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. మరి మన తొలి తెలుగు నెట్ ఫ్లిక్స్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం..!!

1) రాముల:

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎపిసోడ్ గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కింది. మంచు లక్ష్మి కాస్త డిఫరెంట్ రోల్లో కనిపించిన ఈ సిరీస్ లో అలరించే అంశాలు అభయ్ నటన, తెలంగాణ యాస-భాష, సింపుల్ స్టోరీ టెల్లింగ్. నిజానికి కథగా చెప్పడానికి ఏమీ ఉండదు. ఒక రాజకీయ చదరంగంలో తన ఎదుగుదల కోసం ఓ మహిళా రాజకీయనాయకురాలు ఓ ప్రేమజంటను ఎలా బలి తీసుకుంది అనేది మూల కథ. ఆ కథను తరుణ్ భాస్కర్ మొదలెట్టిన విధానం, ఎండ్ చేసిన తీరు అలరిస్తాయి. “పిట్ట కథలు” అనే సిరీస్ టైటిల్ కు పర్ఫెక్ట్ గా జస్టీఫై చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ, వివేక్ సాగర్ సంగీతం ఈ ఎపిసోడ్ కు టెక్నికల్ హైలైట్స్. తరుణ్ భాస్కర్ సతీమణి లత ఈ చిత్రానికి కాస్ట్యూమ్ తోపాటు ప్రొడక్షన్ డిజైన్ కూడా సమకూర్చారు. నేటివిటీని బాగా ఎలివేట్ చేయడంలో ఆమె ప్రతిభ ఈ ఎపిసోడ్ కు ప్లస్ అయ్యింది.

2) మీరా:

అమలపాల్-జగపతిబాబు జంటగా కనిపించిన ఈ ఎపిసోడ్ కు దర్శకురాలు నందిని రెడ్డి. తనకంటే 18 ఏళ్ళు చిన్నదైన పాపులర్ రైటర్ మీరా (అమలపాల్)ను పెళ్లి చేసుకుంటాడు విశ్వ (జగపతిబాబు). భార్య అందగత్తె కావడంతో ఆమెకు ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని అనుక్షణం అనుమానిస్తుంటాడు విశ్వ. అతడి అనుమానానికి తగ్గట్లే మీరా కూడా అందరి మగాళ్లతో సరదాగా, క్లోజ్ గా ఉంటుంది. దాంతో తనకు పుట్టిన ఇద్దరు పిల్లలు, పుట్టబోయే మూడో పిల్లోడు నిజంగానే తనకు పుట్టినవారెనా అని పేటర్నటీ టెస్ట్ చేయించడానికి కూడా సిద్ధమైపోతాడు. అటువంటి శాడిస్టిక్ హజ్బెండ్ నుండి మీరా ఎలా తప్పించుకుంది అనేది ఎపిసోడ్ “మీరా”.

క్లైమాక్స్ లో ఆంగ్ల చిత్రం “గాన్ గర్ల్” ఛాయలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ఓ సగటు మహిళ ఎదుర్కొనే సమస్యలు కుదిరినంత సహజంగా చూపించింది నందిని రెడ్డి. తనను అనునిత్యం వేధిస్తున్న ఓ మృగాడి చెర నుండి తప్పించుకోవడం కోసం తన నైపుణ్యాన్ని ఆయుధంగా ఎలా మార్చుకుంది అనే నేపధ్యంలో స్క్రీన్ ప్లే బాగా అల్లింది.

3) Xలైఫ్:

వర్చువల్ రియాలిటీ అనేది ప్రపంచానికి కొత్త కాదు. అయితే ఆ వర్చువల్ రియాలిటీయే ప్రపంచం అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తీసిన ఎపిసోడ్ “Xలైఫ్”. విక్ (సంజిత్ హెగ్డే) “Xలైఫ్” అనే కంపెనీ మొదలుపెట్టి.. జనాలను వర్చువల్ రియాలిటీకి బానిసలను చేసేస్తాడు. తాము నిజజీవితంలో పొందలేని ఆనందాలు, అనుభూతులు ఈ వర్చువల్ ప్రపంచంలో సాకారమవుతుండడంతో అందరూ నిజానికి దూరంగా, భ్రాంతిలో బ్రతికేస్తుంటారు. ఈ కలల ప్రపంచాన్ని అంతం చేస్తే కానీ మనుషులు మళ్ళీ మామూలు స్థితికి రాలేరు అని నమ్మే కొందరు వ్యక్తులు విక్ ను ఆపడానికి చేసిన ప్రయత్నం ఏమిటో ఎపిసోడ్ చూసి తెలుసుకోవాలన్నమాట.

సిరీస్ మొత్తంలో కాస్త కంటెంట్, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ ను పర్ఫెక్ట్ గా యుటిలైజ్ చేసుకున్న ఎపిసోడ్ ఇదే. నిజజీవితంలోనూ ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ప్రకృతికి దగ్గరగా జీవించే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ ఎపిసోడ్ పర్పస్ బాగుంది. ప్రస్తుత జనరేషన్ టెక్నాలజీకి ఎలా బానిసలు అవుతున్నారు అనేది బాగా చూపించాడు. అలాగే భవిష్యత్ లో మనిషిని ప్రభుత్వాల నుంచో, టెర్రరిస్టుల నుంచో కాదు టెక్నాలజీ నుంచి కాపాడాల్సిన పరిస్థితి వస్తుందని చాలా సింపుల్ గా చెప్పాడు అశ్విన్. శ్రుతిహాసన్ నటనతో ఎపిసోడ్ కు ప్రాణం పోసింది.

4) పింకీ:

సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఎపిసోడ్ ఇది. సత్యదేవ్-ఈషారెబ్బ-ఆషిమా-అవసరాల శ్రీనివాస్ లు ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఎపిసోడ్ “కోరిక”ను బేస్ చేసుకొని ఉంటుంది. సిరీస్ మొత్తంలో అసలు అర్ధం కాని ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే ఇదే. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే సిరీస్ ను ముగించేశారు. ఎపిసోడ్ మొత్తంలో బాగా ఇబ్బందికరంగా కనిపించేది అవసరాల శ్రీనివాస్ విగ్. క్యారెక్టర్ ఆర్క్ అనేది ఎక్కడా కనిపించలేదు. సంకల్ప్ రెడ్డి కొరికకు, కోరుకోవడానికి మధ్య తేడాను చూపించడానికి ప్రయత్నించాడు కానీ.. పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

విశ్లేషణ:

బేసిగ్గా ప్రేమ-కోరిక-అవసరం-భవిష్యత్-భయం అనే అంశాలను కథాంశలుగా మలిచి తెరకెక్కించిన సిరీస్ “పిట్ట కథలు”. పిట్ట కతైనా, పెద్ద కతైనా గమనం ఉండాలి, మొదలు-చివర అనేవి ఉండాలి. పాత్రలకు ఒక పర్పస్ ఉండాలి. ఈ పిట్ట కథల్లోని కొన్ని కథల్లో అవి మిస్ అయ్యాయి. కొన్నిట్లో ఉన్నా అవి సగటు ప్రేక్షకుడు అర్ధం చేసుకొనే స్థాయిలో లేకపోవడం కూడా మైనస్ అనే చెప్పాలి. దర్శకులు తమ క్రియేటివ్ ఈగొతోపాటు.. ప్రేక్షకుల పాయింటాఫ్ వ్యూను కూడా సంతృప్తిపరిస్తే బాగుండేది.

రేటింగ్: 2/5

Share.