నిఫా వైరస్ సినిమా రివ్యూ & రేటింగ్!

2018లో కేరళను కుదిపేసిన “నిఫా వైరస్” నేపథ్యంలో 2019లో తెరకెక్కిన చిత్రం “నిఫా వైరస్”. ప్రముఖ మలయాళ నటీనటులందరూ నటించిన ఈ చిత్రం అప్పట్లోనే అందర్నీ ఆకట్టుకొని.. భారీస్థాయి విజయాన్ని అందుకొంది. అప్పట్లోనే ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేయాలనుకున్నారు కానీ.. తెలుగులో మార్కెట్ ఉన్న నటీనటులెవరు ప్రధాన పాత్రల్లో కనిపించకపోవడంతో ఆలోచనను ఆదిలోనే ఆపేసారు. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను ఆహా యాప్ డబ్బింగ్ రూపంలో ప్రేక్షకులకు అందించింది. ఈ సినిమాను ఎందుకని తప్పకుండా చూడాలో తెలుసుకోండి.

కథ: కేరళలోని మెడికల్ ఆసుపత్రిలో ఒక వ్యక్తి ఆకస్మికంగా అర్ధం కానీ వ్యాధి కారణంగా మరణిస్తాడు. అసలు ఆ వ్యాధి ఏమిటి అనే పరిశోధనలో మొదలైన కథ, ఆ వ్యాధి వ్యాప్తి, దాని నివారణ కోసం కేరళ ప్రభుత్వం, వైద్యులు ఏస్థాయిలో పరితపించారు. జనాలు ఎంత ఇబ్బందిపడ్డారు? అసలు ఆ వైరస్ సోర్స్ ఏమిటి? ఎవరి వల్ల వ్యాపించింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: చాలా అరుదుగా సినిమాలోని ప్రతి నటుడికి సరైన పాత్ర లభించి, తమ పాత్రకు వారు న్యాయం చేయడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. “నిఫా వైరస్” సినిమాలో ఆ మ్యాజిక్ ను చూడొచ్చు. ప్రతి ఒక్క యాక్టర్ తమ పాత్రలకు నటనతో జీవం పోశారు. వాళ్ళ బాధ, వ్యధను సినిమా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. అందుకే.. అందరూ యాక్టర్లూ తోపులే.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు ఆషిక్ అబు, రచయిత ముషిన్ పరారీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఒక డాక్యుమెంటరీ లాంటి కథాంశాన్ని తీసుకొని దాని ఆసక్తికరంగా అందించే ప్రయత్నంలో మేళవించిన ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్ గా వర్కవుట్ అయ్యాయి. ఒక ప్రేమికుడి తపన, ఒక భర్త బాధ, ఒక డాక్టర్ వ్యధ, ఒక తండ్రి వేదన ఇలా సినిమాలో అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండాయి అంటే కారణం దర్శకరచయితల బృందం పడిన శ్రమ. కెమెరామెన్ రాజీవ్ రవి, సుషిన్ శ్యామ్ సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్స్. వీళ్ళందరితోపాటుగా ప్రశంసలకు అర్హులు ఆర్ట్ &ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్.

వాళ్ళు పడిన శ్రమ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇక ఆహా యాప్ వారు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అందించడం కోసం తీసుకున్న జాగ్రత్తలు, డబ్బింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఆరిస్ట్స్ తో వాయిస్ అరువు ఇప్పించడం అనేది ప్రశంసార్హం.

విశ్లేషణ: కరోనా వైరస్ కంటే ముందే భారతీయులను ఒక మోస్తరుగా వణికించిన నిఫా వైరస్ గురించి తెలుసుకోవడం కోసం ఈ సినిమాను తప్పకుండా చూడండి. అలాగే.. ఒక జాతీయ స్థాయి సమస్యను ప్రభుత్వం హాస్పిటల్స్ ఎలా ఎదుర్కొంటాయి అనేది ఎంతో బాధ్యతగా చూపించిన ఈ చిత్రం చూస్తే కరోనాను నివారించడం కోసం మన ఫ్రంట్ లైన్ వారియర్స్ ఏస్థాయిలో అహరహం శ్రమిస్తున్నారో కూడా అవగతమవుతుంది. అందుకే.. ఆహా యాప్ లో లభ్యమవుతున్న ఈ చిత్రాన్ని తప్పకుండా చూడండి.

రేటింగ్: 3.5/5

Share.