మత్తు వదలరా సినిమా రివ్యూ & రేటింగ్!

కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ కథానాయకుడిగా, పెద్ద కుమారుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన చిత్రం “మత్తు వదలరా”. టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేశాయి. మరి సినిమా అదే ఆసక్తిని కలిగించిందో లేదో చూద్దాం..!!

కథ: బాబు మోహన్ (శ్రీసింహ), ఏసుదాస్ (సత్య), అభి (నరేష్ అగస్త్య).. ముగ్గురూ రూమ్ మేట్స్. బాబు, ఏసుదాస్ లు కొరియర్ బాయ్స్ గా వర్క్ చేస్తుంటారు. ఇక ఉద్యోగం మానేసి ఊరెళ్ళి పోదాం అనుకునే తరుణంలో ఊహించని రీతిలో ఒకటి కాదు ఏకంగా రెండు మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటారు బాబు, ఏసుదాస్, అభి.

ఈ మర్డర్ మిస్టరీని ముగ్గురు స్నేహితులు కలిసి ఎలా చేధించారు? అసలు బాబును ఈ మర్డర్ మిస్టరీలో ఇరికించింది ఎవరు? అనేది తెలియాలంటే “మత్తు వదలరా” చిత్రం చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: బాబు మోహన్ పాత్రలో శ్రీసింహ డీసెంట్ డెబ్యూ ఇచ్చాడు. నవతరం ప్రేక్షకులకు శ్రీసింహ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతుంది. అతడి క్యారెక్టరైజేషన్ ను డెప్త్ గా రాసుకున్నాడు దర్శకుడు. సత్య కామెడీ టైమింగ్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్.. సీరియస్ సీన్స్ లోను సత్య కామెడీ టైమింగ్ అదిరిపోయింది. “రౌడీ ఫెలో” తర్వాత సత్య కామెడీ టైమింగ్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకున్న చిత్రమిదే. నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, డి.ఐ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు అభినందనీయం. కలరింగ్ పరంగా “మత్తు వదలరా” చిత్రం ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఎమోషన్ కు తగ్గట్లు కలరింగ్ & టోన్ ను చాలా తక్కువమంది మైంటైన్ చేయగలుగుతారు. ఆ విషయంలో సురేష్ ది బెస్ట్ వర్క్ ఇచ్చాడు. ఇక కాలభైరవ గొంతు లాగే.. అతడి నేపధ్య సంగీతం కూడా చాలా వైవిధ్యంగా ఉంది. పాటలు గుర్తుంచుకునే స్థాయిలో లేకపోయినా క్యాచీగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.

దర్శకుడు రితేష్ రానా రాసుకున్న కథ కంటే కథనం ఆసక్తికరంగా ఉంది. కామెడీని ఇరికించినట్లుగా కాకుండా సందర్భానుసారంగా వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకి మెయిన్ ఎస్సెట్ గా మలిచాడు. బడ్జెట్ ను ఎక్కడా వేస్ట్ చేయలేదు. ఇంటర్వల్ బ్యాంగ్ & క్లైమాక్స్ ట్విస్టులను ప్లాన్ చేసుకున్న విధానం కూడా బాగుంది. కాకపొతే.. 130 నిమిషాల నిడివి ఉన్న సినిమా కూడా సెకండాఫ్ లో సాగినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి చిన్నపాటి మైనస్ లు తప్పితే.. పెద్దగా నెగిటివ్స్ ఏమీ లేవు సినిమాలో.

విశ్లేషణ: ప్రెజంట్ జనరేషన్ ఫిలిమ్స్ కు కథ కంటే కథనం ముఖ్యమని నవతరం దర్శకులు అర్ధం చేసుకోవడంతోపాటు.. ప్రాధాన్యత కూడా ఇస్తుండడం మంచి విషయం. అయితే.. లాజిక్కులు వివరించే విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాలి. వైవిధ్యమైన చిత్రాలు ఆదరించే ప్రేక్షకులకు “మత్తు వదలరా” ఒక మంచి సినిమా చూసిన భావన కలుగుతుంది.

రేటింగ్: 2.5/5

Share.