మెయిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆహా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమ్ అవుతున్న సరికొత్త సినిమా “మెయిల్”. బుక్ రీడర్స్ ను విశేషంగా ఆకట్టుకున్న “కంబాలపల్లి కథలు” నుండి తీసుకున్న ఒక కథ ఈ “మెయిల్”. మరి ఈ ఓటీటీ మూవీ సంగతేమిటో చూద్దాం..!!

కథ: రవి (హర్షిత్ రెడ్డి)కి కంప్యూటర్ అంటే చాలా ఇష్టం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనేది అతడి కల. అయితే.. ఇంటర్ థర్డ్ క్లాస్ లో పాస్ అవ్వడంతోపాటు ఆర్ధిక పరిస్థితులు కూడా సహకరించకపోవడంతో బీకామ్ జాయినవుతాడు. అయితే.. ఊర్లో కంప్యూటర్ సెంటర్ పెట్టిన హైబత్ (ప్రియదర్శి) దగ్గరకి వెళ్లి కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటాడు. ఈలోపు తన క్లాస్ మేట్ రోజా (గౌరీప్రియ)ను ప్రేమించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో రవి కొత్తగా క్రియేట్ చేసుకున్న మెయిల్ ఐడీకి ఒక లాటరీ తగులుతుంది. ఆ లాటరీ కథను ఎలా మలుపు తిప్పింది? అనేది “మెయిల్” చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: టిక్ టాక్ లో పాపులర్ అయిన హర్షిత్ రెడ్డి ఈ చిత్రంలో రవి పాత్రకు సరిగ్గా సరిపోయాడు. అమాయకత్వం, చురుకుదనాన్ని హుందాగా ప్రదర్శించాడు. కెమెరాకి ఎక్కడా భయపడలేదు సరికదా.. కెమెరాను పట్టించుకోలేదు. ఒక మంచి నటుడికి కావాల్సిన ముఖ్యమైన లక్షణమది. సరైన సినిమాలు ఎంచుకుంటే నటుడిగా స్థిరపడగలిగిన సత్తా పుష్కలంగా ఉన్న నటుడు హర్షిత్ రెడ్డి.

స్నేహితుడు సుబ్బు పాత్రలో మణి, రవి లవ్ ఇంట్రెస్ట్ గా గౌరీప్రియ ముచ్చటగా నటించింది. ఆమె కళ్ళలో స్వచ్ఛత తెలుగు తెరపై చూసి చాలా ఏళ్లవుతోంది. ఇక ప్రియదర్శి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. అన్నీ తెలుసు అనుకొనే ఏమీ తెలియని తింగరోడు హైబత్ పాత్రలో ప్రియదర్శి అదరగొట్టాడు. అందరికంటే శివన్న పాత్రలో నటించిన రవీందర్ బొమ్మకంటి విశేషంగా అలరిస్తాడు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక మంచి సినిమాకి కెమెరా వర్క్ ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే దర్శకుడు ఉదయ్ ఈ చిత్రం కెమెరాను కూడా హ్యాండిల్ చేయడం ఒకరకంగా ప్లస్ అయ్యింది. చక్కని పల్లెటూరిలో చిత్రీకరించడం వలన ఎక్కడ అసహజం అనే పదానికి స్పేస్ ఇవ్వలేదు. శ్వీకర్ అగస్తి సమకూర్చిన పాటలు, నేపధ్య సంగీతం స్వచ్చంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. దర్శకుడు కంబాలపల్లి కథలను ఓన్ చేసుకున్న విధానం బాగుంది. సగటు జనాల అమాయకత్వాన్ని తెరపై చక్కగా ప్రెజంట్ చేసాడు. ఎక్కడా బోర్ కొట్టని విధంగా కథనాన్ని రాసుకున్న విధానం ప్రశంసనీయం.

విశ్లేషణ: చిన్నప్పుడు అమ్మమ్మ-తాతయ్యల చెప్పే కథలు వింటూ పెరిగిన వారికి ఈ “మెయిల్” బాల్యాన్ని గుర్తుచేస్తుంది. నేటి తరానికి ఆ కథలు చాలా అవసరం. ఇప్పుడు అమ్మమ్మ-తాతయ్యల దగ్గర కథలు ఎవరు వింటున్నారు.. అందరూ ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు. ఈ బిజీ జనరేషన్ కి కావాల్సినవి కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఇలాంటి మంచి కథలు కూడా. స్వప్న సినిమా సంస్థ ఇలాంటి మరిన్ని సినిమాలు తీయాలి, జనాలు చూడాలి, మంచి నటీనటులు పరిశ్రమకు పరిచయమవ్వాలి, సినిమా బాగుపడాలి!

రేటింగ్: 3/5

Share.