కైలాసపురం

ఇదివరకూ సినిమాలు మాత్రమే ఎంటర్ టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్. కానీ.. మెలమెల్లగా సినిమాల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి ఆన్ లైన్ వెబ్ సిరీస్ లు. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, జీ5, వి.ఐ.యు, వూట్, హోయ్ చాయ్ లాంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో పలు వైవిధ్యమైన వెబ్ సిరీస్ లు జనాలకు అందుబాటులోకి వచ్చాయి. అయితే.. తెలుగులో మాత్రం ఈ వెబ్ సిరీస్ హంగామా రీసెంట్ గా మొదలైంది. ఆ క్రమంలో తమడా సంస్థ రూపొందించిన సరికొత్త వెబ్ సిరీస్ “కైలాసపురం”. విశాఖపట్నంలో చోటు చేసుకొన్న కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ ఆరు ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ జూన్ 5వ తారీఖు నుండి జీ5 (zee5) యాప్ మరియు వెబ్ సైట్ లో విడుదలైంది. అందరూ తెలుగు ఆర్టిస్టులతో, పూర్తిస్థాయిలో విశాఖపట్నంలో చిత్రీకరించబడ్డ “కైలాసపురం” ఎలా ఉందో చూద్దాం..!!

kailasapuram-web-series-review1

కథ: విశాఖపట్నం దగ్గరలోని కైలాసపురం అనే గ్రామంలో ఉండే కొందరు యువకులు గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువుతూ, గంజాయికి అడిక్ట్ అయ్యి.. ఆ గంజాయి కొనుక్కోవడం కోసం అదే గంజాయిని అమ్ముతూ డబ్బు సంపాదిస్తుంటారు.

అదే ఊర్లో కానిస్టేబుల్ పార్వతీశం (శివకుమార్) మార్కెట్ లో చిల్లర వ్యాపారుల వద్ద మామూళ్ళు వసూలు చేస్తూ, మధ్యలో గంజాయి వ్యాపారానికి కూడా దోహద పడుతూ డబ్బు సంపాదిస్తూ తన భార్యతో అదే ఊర్లో బ్రతుకుతుంటాడు. కొత్తగా వచ్చిన ఎస్సై కైలాసపురంలో జరిగే గంజాయి మాఫియాను అంతమొందించడమే కాక.. ఆ మాఫియాను సీక్రెట్ గా నడుపుతున్న మోహన్ రావు & ధనుంజయ్ గ్యాంగ్ ను పట్టుకోవడమే ధ్యేయంగా పెట్టుకొంటాడు.

ఈ క్రమంలో తనపై ఆఫీసర్ బాసిజానికి, కైలాసపురం గంజాయి గ్యాంగ్ దాష్టీకానికి, ఆ గంజాయి అమ్మే కుర్రాళ్ళ కుర్రతనానికి నడుమ కానిస్టేబుల్ పార్వతీశం ఎలా నలిగిపోయాడు? చివరికి అందులోనుంచి బయటపడగలిగాడా లేదా? అందుకోసం అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఎలాంటివి? ఈ గంజాయి మాఫియాలో తెలియక ఇరుక్కున్న యువకులు అందులోనుంచి బయటపడగలిగారా లేదా? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ “కైలాసపురం”.

kailasapuram-web-series-review2

నటీనటుల పనితీరు: సిరీస్ మొత్తం మనకి పరిచయం లేని మొహాలే కనిపిస్తాయి. వాళ్ళు జనాలకి కొత్తేమో కానీ కెమెరాలకు మాత్రం కాదు. ఈ విషయం మొదటి ఎపిసోడ్ కే మనకి అర్ధమైపోతోంది. మెయిన్ లీడ్ మోహిత్, ఫీమేల్ లీడ్ స్నేహల్ కామత్, కానిస్టేబుల్ పార్వతీశం పాత్రలో కనిపించిన శివప్రసాద్ నటన చూసి ఆశ్చర్యపోక తప్పదు. సరిగ్గా వినియోగించుకోగలిగితే అద్భుతమైన ఆర్టిస్టుల కోసం పక్క రాష్ట్రాల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు అని ఇలాంటి సిరీస్ లు చూసినప్పుడే తెలిసొస్తుంటుంది. ఇక ఫీమేల్ లీడ్ గా నటించిన స్నేహల్ కామత్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆమె రోమాంటిక్ సీన్స్ లో ఎంత సహజంగా నటించ్చిందో, ఎమోషనల్ సీన్స్ లోనూ అంతే సహజంగా కనిపించింది. ఆమె కళ్ళు ఆమెకి బిగ్గెస్ట్ ఎస్సెట్.

ఒకట్రెండు ఎపిసోడ్స్ చూశాక ఒక వెబ్ సిరీస్ చూస్తున్నామనే భావన ప్రేక్షకుడికి కలగదు, ఒక సినిమా చూస్తున్నట్లే లీనమైపోతారు. అందుకు కారణం నటీనటుల పనితీరు. ఎస్సై పాత్ర పోషించిన నటుడు నాకు సిరీస్ మొత్తానికి బాగా నచ్చిన ఆర్టిస్ట్. అతడు కెమెరాను పట్టించుకోకుండా జీవించిన విధానం సిరీస్ కి హైలైట్.

kailasapuram-web-series-review3

సాంకేతికవర్గం పనితీరు: నిన్నమొన్నటివరకూ నెట్ ఫ్లిక్స్ & అమేజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ మరియు హిందీ వెబ్ సిరీస్ లు చూసి చూసి.. ఇలాంటివి మన తెలుగులో ఎందుకు రావు అనుకునే నాకు దొరికిన సమాధానమే “కైలాసపురం”. ఇదివరకు కూడా తెలుగులో పలు వెబ్ సిరీస్ లు వచ్చినప్పటికీ.. అవి “కైలాసపురం” స్థాయిలో అలరించలేదు, ఆకట్టుకోలేదు. “కైలాసపురం”లో ఏముంది అంతగా ఆకట్టుకోవడానికి అనడిగితే నా దగ్గర నాలుగు కారణాలున్నాయి.

1. సహజమైన నటులు, 2. ఊహించలేని కథ-కథనం, 3. టాప్ క్లాస్ టెక్నికాలిటీస్, 4. చివరివరకూ కట్టిపడేసే దర్శకుడు భార్గవ్ పనితనం.

నటీనటుల గురించి ఆల్రెడీ పైన మాట్లాడేసుకోన్నాం కాబట్టి.. ఆ నటీనటుల నుంచి సన్నివేశానికి తగ్గ నటన రాబట్టుకొన్న దర్శకుడి ప్రతిభ గురించి చర్చించుకొందాం.

మోహిత్, శివ ప్రసాద్, బృందావన్ నాయుడు, కేతిరెడ్డి, రామ్ నల్లిమిల్లి ఇలా అందరు నటులు సన్నివేశానికి తగ్గ ఎమోషన్ ను పండించగలిగారంటే అందుకు కారణం దర్శకుడు భార్గవ్ కి స్క్రిప్ట్ మీద ఉన్న కమాండ్. అందువల్ల ఏ ఒక్క సన్నివేశంలోనూ ఏ ఒక్క ఆర్టిస్ట్ అతి చేస్తున్నాడనే లేక సన్నివేశానికి తగ్గ ఎమోషన్ ను పండించలేకపోతున్నాడనే భావన మనకి కలగదు. ప్రతి సన్నివేశం రియలిస్టిక్ గా ఉండేలా తను తీసుకొన్న జాగ్రత్త, ప్రతి ఫ్రేమ్ లో కవితాత్మకత కనబడేలా తెరకెక్కించిన విధానం ఆకట్టుకోవడమే కాదు.. భార్గవ్ కి దర్శకుడిగా మంచి భవిష్యత్ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తాయి.

శేఖర్ బూన్ సినిమాటోగ్రఫీ, నరేన్ సంగీతం, యువకిరణ్ ఎడిటింగ్, తమడా సంస్థ ప్రొడక్షన్ వేల్యూస్ అన్నీ సిరీస్ కి తగ్గట్లుగా ఉన్నాయి.

kailasapuram-web-series-review4

విశ్లేషణ: సహజత్వాన్ని మించిన అందం ప్రపంచంలోనే కాదు ఈ విశ్వంలో కూడా ఎక్కడా కనిపించదు. “కైలాసపురం” వెబ్ సిరీస్ కి ఆ సహజత్వమే పెద్ద ప్లస్ పాయింట్. ప్రతి పాత్ర, సన్నివేశం, సందర్భం సహజంగా ఉంటాయి. అందుకే.. “కైలాసపురం” ఈమధ్యకాలంలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్.

kailasapuram-web-series-review5

రేటింగ్: ఇది ఒక మంచి ప్రయత్నం, రేటింగులతో వారి కష్టాన్ని బేరీజు వేయదలుచుకోలేదు.

Click Here To Watch The Web-Series

నటీనటులు: మోహిత్ పెడాడ, స్నేహల్ కామత్, శివ ప్రసాద్, బృందావన్ నాయుడు, కేతిరెడ్డి, రామ్ నల్లిమిల్లి

సాంకేతికవర్గం – దర్శకత్వం: భార్గవ్ మాచర్ల, ఛాయాగ్రహణం: శేఖర్ బూన్, సంగీతం: నరేన్ ఆర్కే సిద్ధార్థ్, ఎడిటర్: యువ కిరణ్ నల్లారి, నిర్మాత: రాహుల్ తమడా-సాయిదీప్ రెడ్డి బొర్రా, బ్యానర్: తమడా మీడియా, ప్లాట్ ఫార్మ్: జీ5 (Zee5), ఎపిసోడ్స్: 6, నిడివి: 146 నిమిషాలు

Share.