ఇస్మార్ట్ శంకర్‌

మాస్ పల్స్ మహా బాగా తెలిసిన దర్శకుడు పురీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం “ఇస్మార్ట్ శంకర్”. రామ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ & సాంగ్స్ మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ముఖ్యంగా రామ్ క్యారెక్టరైజేషన్ వింటేజ్ పురీ స్టైల్ ను తలపించాయి. దాంతో ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. ఆ హైప్ కు తగ్గట్లుగా సినిమా ఉందా లేదా అనేది చూద్దాం..!!

ismart-shankar-movie-review1

కథ: శంకర్ (రామ్) డబ్బుల కోసం హత్యలు చేస్తూ ఉంటాడు. ఒకసారి.. కాబోయే ముఖ్యమంత్రి తండ్రిని చంపేందుకు భారీ మొత్తంలో సుపారీ తీసుకొంటాడు. ఆ క్రమంలోనే చాందిని (నభ)ను ఇష్టపడతాడు. తన పని ముగించుకొని అండర్ గ్రూమ్డ్ వెళ్లిపోదామనుకొంటున్న తరుణంలో పోలీస్ టీమ్ శంకర్ & చాందిని ఉంటున్న ప్లేస్ ను ఎటాక్ చేయడం.. ఆ ఎటాక్ లో చాందిని చనిపోవడం.. శంకర్ ను పోలీసులు ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది.

కట్ చేస్తే.. శంకర్ కి ఆపరేషన్ చేసి అరుణ్ (సత్యదేవ్) అనే పోలీస్ ఆఫీసర్ మెమరీస్ ను ఇన్సర్ట్ చేస్తారు. అప్పటినుంచి రెండు బుర్రలతో కాస్త విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలెడతాడు శంకర్.

ఈ డబుల్ దిమాక్ శంకర్ చేసిన లొల్లి ఏమిటి? అసలు అతని బుర్రలో ఇంకో చిప్ ఎందుకు పెట్టారు? అనేది “ఇస్మార్ట్ శంకర్” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.

ismart-shankar-movie-review2

నటీనటుల పనితీరు: ఎదో సరదా పాత్రలు చేసుకుంటూ కెరీర్ ను నెట్టుకొస్తున్న రామ్ కు ఎనర్జిటిక్ స్టార్ అని పేరు ఎందుకు పెట్టారో ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. తెలంగాణ మాస్ కుర్రాడిగా రామ్ ఎనర్జీ లెవల్స్ మాములుగా లేవు. సినిమా మొత్తం రామ్ మాత్రమే కనిపిస్తాడు, వినిపిస్తాడు, అరిపిస్తాడు. టైటిల్ సాంగ్ లో డ్యాన్స్ మూమెంట్స్ కానీ.. యాక్షన్ సీన్స్ లో మ్యానరిజమ్స్ కానీ మాస్ ఆడియన్స్ కు విందు భోజనంలా ఉంటాయి. పురీ మ్యాజిక్ తర్వాత “ఇస్మార్ట్ శంకర్” సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది రామ్ ఎనర్జీ. ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరవుతాడు రామ్.

ఒక కమర్షియల్ సినిమాలో హీరోయిన్ల అందాల ఆరబోత చూసి చాలా ఏళ్ళవుతొంది. ఆ లోటును భర్తీ చేశారు నభ & నిధి. ఈ ఇద్దరి పాత్రలు చెప్పుకొనే స్థాయిలో లేకపోయినా.. వారి స్క్రీన్ ప్రెజన్స్ & గ్లామర్ మాత్రం మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటుంది. కేవలం వారి అందాలను ఆస్వాదించడానికి ప్రేక్షకులు రెండోసారి సినిమాకి వచ్చేలా ఉన్నారు.

సత్యదేవ్ పాత్ర చిన్నదే అయినా.. ఎఫెక్టివ్ గా ఉంది. జబర్దస్త్ శ్రీను కామెడీ కొన్ని చోట్ల ఆకట్టుకొంటుంది.

ismart-shankar-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: మణిశర్మ పాటలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ అయితే.. ఆయన నేపధ్య సంగీతం సినిమాకి ఆయువుపట్టు. రామ్ మాస్ అప్పీల్ కి పూరీ డైలాగ్స్ ఇచ్చే కిక్ కి మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ యాడ్ అయ్యేసరికి.. ఆ సన్నివేశాలు పటాసుల్లా పేలాయి.

“అర్జున్ రెడ్డి” ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీ బాగుంది. మాస్ సినిమాని కొత్త యాంగిల్లో చూపించాడు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండు అనిపిస్తుంది.

ఇక మాస్ డైరెక్టర్ పురీ జగన్నాధ్ ముందుగానే చెప్పినట్లుగా ఇది కేవలం మాస్ ఆడియన్స్ ను మాత్రమే టార్గెట్ చేసి తీసిన సినిమా. క్లాస్ ఆడియన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పొరపాటున కూడా థియేటర్లకు వెళ్లారో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరియు హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ చూసి ఇబ్బందిపడాలసిందే. మూల కథను క్రిమినల్ (2016)లో వచ్చిన ఓ హాలీవుడ్ మూవీ నుంచి తీసుకొన్న పురీ.. ఆ కథకు తనదైన మార్క్ యాక్షన్ & హీరోయిజాన్ని యాడ్ చేసాడు. రామ్ ను ఎప్పుడు చూడని విధంగా ప్రెజంట్ చేయడం, హీరోయిన్స్ ను సూపర్ గ్లామరస్ గా చూపించడం, యాక్షన్ బ్లాక్స్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని మాస్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాడు. చాలా రోజులుగా మిస్ అవుతున్న పురీ మార్క్ మాస్ డైలాగ్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ఇక హీరో సెంట్రిక్ గా సాగే ఈ సినిమాలో రామ్ క్యారెక్టరైజేషన్ యూత్ ను బాగా ఆకట్టుకొంటుంది. మొత్తానికి “టెంపర్” తర్వాత ఒక మంచి హిట్ కొట్టలేదన్న పూరీ మరియు ఆయన అభిమానుల బాధ “ఇస్మార్ట్ శంకర్”తో తీరిపోయింది.

ismart-shankar-movie-review4

విశ్లేషణ: లాజిక్కులు వెతకకుండా.. కేవలం పూరీ మ్యాజిక్ ను ఎంజాయ్ చేయగలిగితే “ఇస్మార్ట్ శంకర్” పైసా వసూల్ ఎంటర్ టైనర్. అలా కాదు మాకు లాజిక్స్ కావాలి, ఒక మంచి కథ-కథనం, సెన్సిబిలిటీస్ ఇలా అన్ని ఉండాలి అని థియేటర్ కి వెళ్తే మాత్రం “దిమాక్ ఖరాబ్” అవ్వడం ఖాయం.

ismart-shankar-movie-review5

రేటింగ్: 2.5/5

Click here To Read In ENGLISH

Share.