‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మూవీ గురించి మనకు తెలియని రికార్డు..!

ఓ భాషలో హిట్టైన సినిమాని.. మరో భాషలోకి రీమేక్ చెయ్యడం అనేది కొత్తేమి కాదు. ఇప్పటివరకూ ఇతర భాషలకు చెందిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి ఘన విజయాలు సాధించాయి. అలాగే ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలను ఎక్కువగా బాలీవుడ్లోకి రీమేక్ చేసుకుంటున్న సందర్భాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓకే సినిమాని ఎక్కువ భాషల్లోకి రీమేక్ చేస్తే అది ఒక రికార్డుగానే చెప్పుకోవాలి. గతంలో మహేష్ బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘పోకిరి’,రవితేజ- రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన ‘విక్రమార్కుడు’.. వంటి సినిమాలు నాలుగైదు భాషల్లోకి రీమేక్ అయ్యి సూపర్ హిట్లు అయ్యాయి. అలాగే ఇతర భాషల్లో 96,దృశ్యం వంటివి కూడా నాలుగైదు భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అయితే ఇవి మాత్రమే రికార్డు అనుకుంటే పొరపాటే..! ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనే తెలుగు చిత్రం ఏకంగా 9 భాషల్లోకి రీమేక్ అయ్యి సంచలనం సృష్టించింది.బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. 7 భారతీయ భాషల్లోకి అలాగే 2 విదేశీ భాషల్లోకి రీమేక్ అయ్యింది ఈ చిత్రం.

2005 వ సంవత్సరంలో సిద్దార్థ్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్ట్ చేసాడు. ‘సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై యం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన అబ్బాయి… పేదరికంలో పుట్టి పెరిగిన అమ్మాయి మధ్య చిగురించిన ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ లైన్ తో అప్పటికే వందల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. కానీ ఈ చిత్రం టేకింగ్ వాటికి పూర్తి భిన్నంగా అలాగే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఓ సగటు ప్రేక్షకుడు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి. లవ్, కామెడీ,సెంటిమెంట్, డైలాగ్స్, సాంగ్స్ ఇలా అన్ని రకాలుగాను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. అందుకే ఈ చిత్రం ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయినట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఏ ఏ భాషల్లో రీమేక్ అయ్యిందో అలాగే అక్కడి టైటిల్స్ ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1.తమిళంలో ఈ చిత్రాన్ని ‘ఉనక్కం ఎనక్కం’ పేరుతో రీమేక్ చేశారు.

2. కన్నడలో ఈ చిత్రాన్ని ‘నీనెల్లో నానల్లే’ పేరుతో రీమేక్ చేశారు.

3.బెంగాలీలో ఈ చిత్రాన్ని ‘ఐ లవ్‌ యు’ పేరుతో రీమేక్ చేశారు.

4.మణిపురిలో ఈ చిత్రాన్ని నింగోల్‌ తజబ పేరుతో రీమేక్ చేసారు.

5.ఒడియాలో ఈ చిత్రాన్ని ‘సునా ఛాదీ మో రూపా ఛాదీ’ పేరుతో రీమేక్ చేసారు.

6.పంజాబీలో ఈ చిత్రాన్ని ‘తేరా మేరా కీ రిష్తా’ పేరుతో రీమేక్ చేశారు.

7.హిందీలో ఈ చిత్రాన్ని ‘రామయ వస్తావయ’ పేరుతో రీమేక్ చేశారు.

8.బెంగాలీలో ఈ చిత్రాన్ని ‘నిస్సా అమర్‌ తుమీ’ పేరుతో రీమేక్ చేశారు.

9.నేపాలీలో ఈ చిత్రాన్ని ‘ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా’ పేరుతో రీమేక్ చేశారు.

మొత్తానికి రీమేక్ అయిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం విజయం సాధించడం మరో విశేషంగా కాదు కాదు.. మరో రికార్డుగా చెప్పుకోవాలి.

Share.