నాగ్ ని ఆలోచనలో పడేసిన నాని.. కారణం అదే?

నాగార్జున ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ‘మన్మథుడు 2’ చిత్రం చేస్తున్నాడు. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత కూడా కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా పోర్చుగల్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ‘ఆనంది ఆర్ట్ క్రియేషన్స్’ బ్యానర్స్ పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ క్రేజీ సీక్యూల్ ను మొదట ఆగస్టు చివరి వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేసాడట నాగార్జున. అయితే అదే నెలలో దాస్ కూడా తన గ్యాంగ్ తో వస్తున్నాడట. అదేంటి ఇంతకీ ఆ దాస్ ఎవరనేగా మీడౌట్..! అదేనండీ తాజాగా ‘జెర్సీ’ చిత్రంతో హిట్టు కొట్టిన నాని.

గతేడాది ‘దేవదాస్’ చిత్రంతో నాగ్, నాని కలిసి సందడి చేసిన సంగతి తెలిసిందే కదా..! ఇప్పుడు నాని హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం కూడా ఆగస్టు 30నే విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆ తేదీకి కాస్త అటు ఇటుగా వద్దామనుకున్న నాగార్జున ఆలోచనలో పడ్డాడు. ఈ మధ్య కాలంలో నాగార్జునకి సరైన సక్సెస్ లేదు. కాబట్టి సోలో రిలీజ్ నాగ్ కు చాలా అవసరం. అందులోనూ ‘మన్మధుడు’ సూపర్ హిట్ సీక్వెల్ ను కరెక్ట్ గా హ్యాండిల్ చెయ్యాలి. ఈ విషయాన్ని గ్రహించే, నాని సినిమాకి .. తన సినిమాకి వారం రోజుల గ్యాప్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు నాగ్.

Share.