ఎఫ్.సి.యు.కె సినిమా రివ్యూ & రేటింగ్!

“లెజెండ్”తో విలన్ గా సరికొత్త కెరీర్ ను మొదలెట్టిన జగపతిబాబు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన ప్రతి స్టార్ హీరో సినిమాలో ఆయనే విలన్. అటువంటి జగపతిబాబు చాన్నాళ్ల తర్వాత ఒక పాజిటివ్ రోల్ ప్లే చేసిన చిత్రం “ఎఫ్.సి.యు.కె”. సినిమా టీజర్ కి ఒక డిఫరెంట్ రియాక్షన్ వచ్చింది. పెళ్లీడుకి వచ్చిన కొడుకు ఉన్న తండ్రి మళ్ళీ తండ్రి అవ్వడం అనేది మంచి గ్రిప్పింగ్ లైన్. మరి ఆ లైన్ ను దర్శకుడు ఎలా డీల్ చేశాడు? సినిమా ఎలా ఉంది? అనేది చూద్దాం..!!

కథ: కార్తీక్ (రామ్ కార్తీక్) ఓ సాధారణ యువకుడు, అతడి తండ్రి ఫణిభూపతి (జగపతిబాబు) మంచి ప్లే బోయ్. పబ్ లో పరిచయమైన ఉమ (అమ్ము అభిరామి)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు కార్తీక్. కార్తీక్-ఉమల ప్రేమ ప్రయాణం పెళ్లికి చేరుకొనేలోపు వాళ్ళ జీవితంలోకి ప్రవేశిస్తుంది చిట్టి. చిట్టి రాక ఉమ-కార్తీక్ ల ప్రేమకు ఎలా అడ్డంకిగా మారింది? అందుకు ఫణిభూపతి ఎలా కారకుడయ్యాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: బేసిగ్గా జగపతిబాబు సెటిల్డ్ రోల్స్ లో జీవించేస్తాడు. ఆయన మొట్టమొదటిసారి వీరలెవల్లో ఎమోషనల్ గా నటించిన సినిమా “లెజెండ్”. అంతకుముందు ఆ తరహా పాత్రలు చేసినప్పటికీ ఏ దర్శకుడు ఆయనలోని కోపాగ్నిని బోయపాటి రేంజ్ లో చూపించలేదు. ఎఫ్.సి.యు.కెలో కూడా అదే జరిగింది. జగపతిబాబు ముందు కెమెరా పెట్టేసి ఆయన్ను ఇష్టం వచ్చింది చేసుకోమని వదిలేసినట్లుగా ఉంటుంది ఆయన పెర్ఫార్మెన్స్.ఇక రామ్ కార్తీక్, అమ్ము అభిరామిల నటన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. “అసురన్” లాంటి సినిమాలో చాలా కీలకమైన పాత్రలో నటించిన అమ్ము అభిరామి ఈ సినిమాలో చేసిన ఓవర్ యాక్షన్ కి డబ్బింగ్ ఆజ్యం పోసినట్లైంది. ఇక ఆమె ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన నటి మరో రకంగా ఇరిటేషన్ తెప్పిస్తుంది. జూనియర్ ఆర్టిస్ట్ టర్నర్ యాక్టర్ భరత్ ఈ చిత్రంలో పాటలు పాడడానికి కూడా ప్రయత్నించాడు కానీ.. అతడి పై ఇంకా జనాల్లో పిల్లాడు అనే ఫీలింగ్ ఉండడంతో, అతడి నటన కూడా ఓవర్ యాక్షన్ లాగే కనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు విద్యాసాగర్ రాజు రాసుకున్న కథ-కథనం ఆయన ప్రీరిలీజ్ ఈవెంట్ అదే బారసాల వేడుకలో చెప్పినట్లుగా కొత్తగా కాక రోతగా ఉంది. ఒక డిఫరెంట్ పాయింట్ ను ప్రేక్షకులు ఫీల్ అయ్యేలా లేదా కనెక్ట్ అయ్యేలా చెప్పాలి అనుకున్నప్పుడు డీలింగ్ డిఫరెంట్ గా అయినా ఉండాలి లేదా రిలేటబుల్ గా అయినా ఉండాలి. అంతేకాని థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు ఇరిటేట్ అయ్యేలా కాదు. ఈ విషయాన్ని ఆయన గ్రహిస్తే తదుపరి చిత్రంతోనైనా ప్రేక్షకుల్ని భయపెట్టకుండా, కాస్త అలరించగలరు. ఇక డైలాగ్ రైటర్స్ ఆదిత్య, కరుణాకర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆడపిల్ల, కన్యత్వం, మనసు, ప్రేమ వంటి విషయాలకు వాళ్ళిచ్చిన సరికొత్త ఉదాహరణలు, ఉపోద్ఘాతాలు, వివరణలు విన్నాక మతి కనీసం పది సెకండ్లైనా చలించడం ఖాయం. భీమ్స్ సంగీతం, జీవన్ నేపధ్య సంగీతం అసలే నీరసించిపోయిన ప్రేక్షకుడ్ని ఇంకాస్త బలహీనపరిచాయి. మిగతా టెక్నికల్ అంశాల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

విశ్లేషణ: జగపతిబాబు లాంటి ఒక మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ & జీల్ ఉన్న నటుడు దొరికినప్పుడు ఆయనతో కొత్తగా సినిమా తీయడానికి ప్రయత్నించాలి కానీ.. ఆయన గెటప్ & స్టైల్ ను మాత్రమే బేస్ చేసుకొని ఏదో పస లేని పాత్రతో సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ “ఎఫ్.సి.యు.కె”.

రేటింగ్: 1.5/5

Share.