ఎవరు

“క్షణం, గూఢచారి” లాంటి సూపర్ హిట్స్ అనంతరం అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “ఎవరు”. స్పానిష్ చిత్రం “ది ఇన్విజబుల్ గెస్ట్”కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో రెజీనా కీలకపాత్ర పోషించింది. వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ విడుదల కాగా.. అడివి శేష్ ఎన్నడూ లేని విధంగా ఈ సినిమా మీద భీభత్సమైన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మరి ఆ కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న రీజన్ ఏమిటో తెలుసుకొందాం..!!

evaru-movie-review1

కథ: విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్) ఒక కరెప్ట్ పోలీస్ ఆఫీసర్. సామ్ (రెజీనా) ఒక పోలీస్ ఆఫీసర్ (నవీన్ చంద్ర)ను చంపిన కేస్ లో ఇరుక్కోవడంతో వేరే దారి లేక ఆ కేస్ నుంచి బయటపడడానికి విక్రమ్ వాసుదేవ్ సహాయం అడుగుతుంది. ఒక పర్సనల్ కేస్ ఇన్విస్టిగేషన్ కోసం కూనూరు నుంచి హైద్రాబాద్ వచ్చిన విక్రమ్.. సామ్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు. ఆ క్రమంలో తాను పర్సనల్ గా హ్యాండిల్ చేస్తున్న ఒక మిస్సింగ్ కేస్ కి, సామ్ రేప్ & మర్డర్ కేస్ కి ఒక లింక్ ఉందని తెలుసుకొంటాడు.

ఏమిటా లింక్? అసలు కూనూర్ కి సామ్ కి సంబంధం ఏమిటి? మర్డర్ కేస్ లో సామ్ ఇంవాల్వ్ మెంట్ ఎంతవరకూ ఉంది? ఇంతకీ విక్రమ్ వాసుదేవ్ తన తెలివితేటలతో సామ్ కు సహాయపడగలిగాడా? వంటి ప్రశ్నలకు అత్యంత ఆసక్తికరంగా చెప్పిన సమాధానాల సమాహారమే “ఎవరు” చిత్రం.

evaru-movie-review5

నటీనటుల పనితీరు: అడివి శేష్ ఈ చిత్రంలో చాలా కీలకపాత్ర పోషించాడు. అతడి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. అన్నీ వేరియేషన్స్ లో అలవోకగా ఒదిగిపోయాడు అడివి శేష్. చివరివరకూ కథనంలో అతడొక భాగం అనుకొంటామ్ కానీ.. చివరికి వచ్చేసరికి అతడే కథనం అని తెలిసేసరికి ఆడియన్స్ ఆశ్చర్యపోవడం ఖాయం. సినిమాకి అడివి శేష్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మాత్రమే కాదు.. కీ పాయింట్ కూడా.

చాలారోజుల తర్వాత రెజీనాకి తన గ్లామర్ మాత్రమే కాక పెర్ఫార్మెన్స్ కూడా చూపించే అవకాశం లభించిందనిపిస్తుంది. సినిమాకి కీలకాంశం రెజీనా కావడంతో.. ఆమె క్యారెక్టర్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అమాయకత్వంతోపాటు విలనిజాన్ని కూడా అద్భుతంగా ప్రదర్శించింది రెజీనా. ఆమె కెరీర్ లో మైలురాయి సినిమాగా “ఎవరు” నిలిచిపోతుంది.

నవీన్ చంద్ర పాత్ర చిన్నదే అయినా.. వేరియేషన్స్ బాగున్నాయి. కథలో అతడి ఇంపాక్ట్ కనిపిస్తుంది. మురళీశర్మ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది.

evaru-movie-review2

సాంకేతికవర్గం పనితీరు: అడివి శేష్ ఒక సందర్భంలో ఈ సినిమాకి హీరో శ్రీచరణ్ పాకాల అని పేర్కొన్నప్పుడు అతిశయోక్తిగా చెబుతున్నాడేమో అనుకున్నాను కానీ.. సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సన్నివేశాన్ని తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకురావడాన్ని గమనించాక అడివి శేష్ నిజమే చెప్పాడు అనిపిస్తుంది. ప్రతి సీన్ లోనూ తెలియని ఉత్కంఠ రేగించాడు శ్రీచరణ్.

వంశీ పచ్చి పులుసు ఒక సన్నివేశాన్ని, ఇద్దరు ఆర్టిస్టులతో మూడు విభిన్న కోణాల నుంచి ప్రెజంట్ చేసిన తీరులో రిపిటీషన్ లేకుండా జాగ్రత్తపడిన విధానం బాగుంది. లైటింగ్ & కలరింగ్ విషయంలో వంశీ తీసుకొన్న జాగ్రత్తలు ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ ఫీల్ ను ఇచ్చాయి.

పివిపి నిర్మాణ విలువలు కథ-కథనంకు తగ్గట్లుగా ఉన్నాయి. సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.

దర్శకుడు వెంకట్ రాంజీ.. “ది ఇన్విజిబుల్ గెస్ట్” అనే స్పానిష్ ఫిలిమ్ నుంచి స్క్రీన్ ప్లే ను మాత్రమే తీసుకొని.. కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మలిచిన విధానం బాగుంది. ఆల్రెడీ నేను “ది ఇన్విజబుల్ గెస్ట్” మరియు ఆ సినిమాకి హిందీ రీమేక్ గా రూపొందిన “బద్లా” సినిమాలు చూసినప్పటికీ.. తెలుగు వెర్షన్ అయిన “ఎవరు” చివరివరకూ ఆసక్తికరంగా అనిపించింది అంటే ఆలోచించుకోవచ్చు కథనాన్ని ఎంత కొత్తగా, పకడ్బంధీగా రాసుకొన్నారు అనేది. ఈ విషయంలో వెంకట్ రాంజీతోపాటు రైటర్ అబ్బూరి రవిని కూడా మెచ్చుకోవాలి. అబ్బూరి రవి మాటలు కూడా కథనం ఆసక్తికరంగా సాగడంలో కీలకపాత్ర పోషించాయి.

evaru-movie-review3

విశ్లేషణ: థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారిని విశేషంగా ఆకట్టుకొనే చిత్రం “ఎవరు”. అడివి శేష్-రెజీనాలు పోటీపడి మరి ప్రదర్శించిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ & శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం, వెంకట్ రాంజీ కథను ఆద్యంతం ఆసక్తికరంగా సాగించిన విధానం కోసం ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే.

evaru-movie-review4

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Share.