‘దొంగ’ సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ ఏడాది ‘దేవ్’ చిత్రంతో నిరాశ పరిచిన కార్తీ వెంటనే ‘ఖైదీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాడు. ‘ఖైదీ’ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో కార్తీ ‘దొంగ’ చిత్రం పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ కార్తీ నిజజీవితంలో వదిన అయిన జ్యోతిక ఈ చిత్రంలో అక్కగా నటిస్తుండడంతో ఈ చిత్రానికి మరింత క్రేజ్ ఏర్పడింది. మరి ఆ అంచనాల్ని ‘దొంగ’ ఎంత వరకూ అందుకున్నాడో చూద్దాం.

Donga Movie Review1

కథ : చిన్నప్పుడే ఇంటి నుండీ పారిపోయిన కొడుకు శర్వా కోసం.. 15 ఏళ్ళు పూర్తయినా వెతుకుతూనే ఉంటాడు తండ్రి జ్ఞానమూర్తి (సత్య రాజ్). ఇక తన తమ్ముడి కోసం కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అక్క పార్వతి (జ్యోతిక) అనుక్షణం అతన్ని తలుచుకుని బాధపడుతూనే ఉంటుంది. ఇలాంటి తరుణంలో తన కొడుకు.. గోవాలో ఉన్నాడని ఓ పోలీస్ ఆఫీసర్ ద్వారా తెలుసుకుంటాడు జ్ఞానమూర్తి. ఈ క్రమంలో శర్వా(కార్తీ) ఓ దొంగ అని.. చీటింగ్ లు చేస్తుంటాడు అని తెలుసుకుంటాడు. అందుకు షాకయ్యి.. తన కొడుకుని వెంటనే ఇంటికి తీసుకువెళ్లాలని భావిస్తాడు. మరి కార్తీ ఇంటికి వెళ్ళిన తరువాత అక్కడ చోటుచేసుకున్న పరిస్థితులు ఏంటి.. అసలు హీరో .. నిజంగానే జ్ఞాన మూర్తి కొడుకా.. లేక నాటకం ఆడటానికి వచ్చాడా అనేది మిగిలిన కథ.

Donga Movie Review2

నటీనటుల పనితీరు : హీరో కార్తీ ఎప్పటిలాగే తన సహజమైన నటనతో.. కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. కథలో ఉన్న చిన్న చిన్న లోపాల్ని కూడా తన నటనతో కవర్ చేసే స్టామినా కార్తీకి ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇక కార్తీ తర్వాత చెప్పుకోవాల్సింది సత్యరాజ్ పాత్రే..! జ్ఞానమూర్తి గా.. రకరకాల వేరియేషన్స్ కలిగిన పాత్రకి వందకు వంద శాతం న్యాయం చేసాడు. ‘దొంగ’ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు.. అక్క పాత్ర చేసిన జ్యోతిక కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుందని భావిస్తారు. కానీ సినిమాలో అలా ఉండదు.. ఫస్ట్ హాఫ్ లో ఆమె అక్కడక్కడా మాత్రమే మెరుస్తుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎమోషనల్ సీన్స్ లో జీవించేసింది. ఇక సంజన పాత్ర చేసిన హీరోయిన్ నిఖిల విమల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా మెరిసిన ఈమె సెకండ్ హాఫ్ లో ఒకటి రెండు సీన్లలో తప్ప ఎక్కువగా కనిపించదు. నటన పరంగా కూడా ఈమెకు పెద్ద స్కోప్ ఉన్న పాత్ర కాదనే చెప్పాలి. ఈమె కంటే కూడా హీరో నాయనమ్మ పాత్ర చేసిన షావుకారు జానకి పాత్ర బాగా పండింది. ఏమాత్రం డైలాగులు లేకుండానే ఆ పాత్రకి ఆమె పూర్తి న్యాయం చేసింది.

Donga Movie Review3

సాంకేతికవర్గం పనితీరు : మలయాళం ‘దృశ్యం’ తెరకెక్కించిన జీతూ జోసెఫ్.. ‘దొంగ’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ ను చాలా జాగ్రత్తగా డీల్ చేసాడు. తప్పిపోయిన శర్వా పాత్రని చివరి వరకూ నడిపించడం.. మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్ లతో కూడా ప్రేక్షకుల్ని సినిమాకి మరింత కనెక్ట్ అయ్యేలా చేసాడు. ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. పచ్చని పొలాల్ని, కొండల ప్రదేశాలని చాలా చక్కగా చూపించాడు. గోవింద వసంత సంగీతంలో వచ్చే పాటలకంటే.. నేపధ్య సంగీతం ఎక్కువ గుర్తుంటుంది.

ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ .. సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో అక్కా తమ్ముళ్ళ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా పర్వాలేదు అనిపిస్తాయి. కానీ హీరోయిన్ ఉన్న సన్నివేశాలు.. అలాగే సడెన్ గా వచ్చే పాటలు కాస్త విసిగిస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. అయితే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లతో మళ్ళీ అందరిని అలెర్ట్ అయ్యేలా చేస్తాడు ఈ దొంగ.

Donga Movie Review4

విశ్లేషణ : మరీ ‘ఖైదీ’ సినిమా అంత ఎంగేజింగ్ గా ‘దొంగ’ అనిపించినప్పటికీ.. ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చూశామనే ఫీలింగ్ మాత్రం కలిగిస్తుంది. నిస్సందేహంగా ఈ ‘దొంగ’ ని ఓసారి చూసేయ్యొచ్చు.

Donga Movie Review5

రేటింగ్: 2/5

Click Here to Read Donga Movie English Review

Share.