స్పెషల్ ఇంటర్వ్యూ : ‘మ్యాస్ట్రో’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలిపిన దర్శకుడు మేర్లపాక గాంధీ

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో దర్శకుడిగా పరిచయమైన మేర్లపాక గాంధీ.. అటు తర్వాత ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ఓటిటి ల కోసం ‘ఏక్ మినీ కథ’ వంటి విభిన్న కథా చిత్రాలకు కూడా అతను రైటర్ గా పనిచేస్తున్నాడు.త్వరలో అతను నితిన్ తో తెరకెక్కించిన ‘మ్యాస్ట్రో’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ కు ఇది రీమేక్. ‘మ్యాస్ట్రో’ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుంది అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఫిల్మీ ఫోకస్ తో అతను పంచుకున్న ముచ్చట్లు మీ కోసం :

ప్ర. ముందుగా ‘మ్యాస్ట్రో’ ఓటిటిలో రాబోతోందా.. థియేటర్లలో రాబోతోందా?

జ. ఎక్కువ శాతం ఓటిటిలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. బయట పరిస్థితి బాలేదు. సో వేరే ఆప్షన్ లేదు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అనుకుంటున్నాం. దాని గురించి నిర్మాతలు ప్రకటిస్తే బాగుంటుంది. అన్నీ నేను రివీల్ చేయకూడదు(నవ్వుతూ)

ప్ర.ఓకే.. రిలీజ్ డేట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు?

జ.అది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళే ఫిక్స్ చేయాలి. ముందుగా ఆగష్ట్ లో రిలీజ్ అవుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళ షెడ్యూల్.. వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకి ఉంటుంది కదా.! మోస్ట్ ప్రాబబ్లి ఆగష్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్లో ఉండొచ్చు.

ప్ర. మీ దర్శకత్వంలో దాదాపు 3 ఏళ్ళ తర్వాత మూవీ వస్తుంది. అది కాస్త ఓటిటిలో రిలీజ్ కాబోతుంది? మీ ఫీలింగ్ ఏంటి?

జ. చెప్పాలంటే డిజప్పాయింట్మెంట్ గా ఉంది. ఇలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిగిన మూవీ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అది మంచి ఫీల్ ను కలిగిస్తుంది. మరి టీవీల్లో,స్మార్ట్ ఫోన్ లలో సౌండ్ ఎఫెక్ట్ లు అవి ఆ రేంజ్లో ఉంటాయన్న గ్యారెంటీ లేదు. కానీ తప్పదు. నేను కూడా ‘అంధాదున్’ ల్యాప్ టాప్లోనే చూసాను.

ప్ర. మీకు ఇది ఫస్ట్ రీమేక్. ‘అంధాదున్’ నే రీమేక్ చేయాలని ఎందుకు అనిపించింది? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?

జ. బేసిక్ గా నాకు రీమేక్లంటే ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటివరకు నేను సొంతంగా రాసుకున్న కథలనే తెరకెక్కించాను. అయితే టైడా అనే ఊరిలో స్క్రిప్ట్ రాద్దామని వెళ్తే అక్కడ అందరూ ‘అంధాదున్’ బాగుంది బాగుంది అన్నారు. తర్వాత ఓ సారి కూర్చొని మూవీ మొత్తం చూసాను. చేస్తే ఇలాంటి సినిమా రీమేక్ చేయాలి అని నేను మా అసిస్టెంట్స్ తో ఊరికే చెప్పాను. ఆ విషయం నితిన్ గారి ఫాథర్ సుధాకర్ రెడ్డి గారి వరకు వెళ్లడం జరిగింది. ఓరోజు ఆయన నాకు ఫోన్ చేసి పిలిపించి.. చేద్దామా అని అడిగారు. అలా ‘మ్యాస్ట్రో’ సెట్ అయ్యింది.

ప్ర.నితిన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

జ. ఆయన చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఇది రెగ్యులర్ మూవీ కాదు కదా. ఆర్టిస్టిక్ థింగ్స్ ఎక్కువగా ఉంటాయి. దానిని బాగా అర్ధం చేసుకుని ఆయన చేసారు. ఈ మూవీలో నితిన్ గారి యాక్టింగ్ కొత్తగా ఉంటుంది.

ప్ర. ఒరిజినల్ తో పోలిస్తే ఇక్కడ మార్పులు ఏమైనా చేసారా?

జ.చిన్న చిన్న మార్పులు చేసాం. మరీ ఎక్కువగా కాదు. సెకండ్ హాఫ్ లో ఆ మార్పులను మీరు గమనించవచ్చు.చిన్న ఎమోషనల్ కంటెంట్ ను జోడించాము.ఒరిజినల్ లో హీరోకి చివరికి చూపు వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ తెలుగులో క్లారిటీ ఇచ్చాము. మన ఆడియెన్స్ కు తగినట్టు ఆ క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ప్ర.టబు గారి పాత్రకి తమన్నా గారిని తీసుకోవాలని ఎలా అనిపించింది?

జ. అక్కడ మిడిల్ ఏజ్డ్ ఆర్టిస్ట్ అయిన టబు గారు ఆ రోల్ చేయడం జరిగింది. కానీ తెలుగులో కొంచెం యంగ్ ఆర్టిస్ట్ ఎవరైనా చేస్తే బాగుణ్ణు అనిపించింది. అందుకే తమన్నా గారిని తీసుకున్నాం. ఈ రోల్ కి ఆవిడ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు అనిపిస్తుంది.టబు గారికి తమన్నా ఏమాత్రం తీసిపోరు. తమన్నా గారిని ఈ పాత్రకి సంప్రదించిన వెంటనే ఆవిడకి నచ్చి ఓకే చెప్పేసారు.

ప్ర. ముందుగా తమన్నా గారి ప్లేస్ లో నయన తార గారిని ఇంకా చాలా మందిని సంప్రదించారట నిజమేనా?

జ. నయనతార గారిని సంప్రదించిన మాట నిజమే. కానీ ఆవిడ డేట్స్ అడ్జస్ట్ చేయలేక తప్పుకున్నారు. తర్వాత అనసూయ,రమ్యకృష్ణ గారు అంటూ చాలా గాసిప్స్ వచ్చాయి. అవన్నీ పుకార్లే..!

ప్ర.హీరోయిన్ నభా నటేష్ గారి గురించి చెప్పండి..!

జ.నితిన్ గారు నభా నటేష్ గారి పెయిర్ ఫ్రెష్ గా ఉంటుంది. చిన్న రోల్ అయినప్పటికీ ఆవిడ బాగా చేశారు.సాంగ్స్ లో ఆమె లుక్స్ కూడా ఆకట్టుకుంటాయి.

ప్ర.మ్యూజిక్ డైరెక్టర్ మహాతీ గురించి చెప్పండి?

జ.’భీష్మ’ కి అతను అందించిన మ్యూజిక్ నాకు బాగా నచ్చింది.అందుకే ‘మ్యాస్ట్రో’ కి అతన్నే తీసుకోవాలనిపించింది. మా మూవీకి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘ఓ బేబీ’ సాంగ్ విన్నారు కదా..!

ప్ర.ఈ మూవీ క్యాస్టింగ్ కు సంబంధించి నితిన్, నభా, తమన్నా ల పేర్లు తప్ప మిగిలిన నటీనటుల పేర్లు బయటకి రాలేదు?

జ.అవును నిజమే..! ఇప్పటివరకు వేరే ఆర్టిస్ట్ ల పేర్లు బయటకి రాలేదు. కానీ ఈ మూవీలో సింగర్ మంగ్లీ గారు కూడా నటించారు. ఆవిడ రోల్ బాగుంటుంది. అలాగే శ్రీముఖి, హర్షవర్ధన్, రచ్చ రవి, జిష్షు సేన్ గుప్తా,శ్రీనివాస రెడ్డి..వంటి వారు ఈ మూవీలో నటించారు.

ప్ర. సింగర్ మంగ్లీ గారు కూడా నటించారా?

జ. అవును ఆవిడ ఫస్ట్ టైం.. యాక్ట్ చేయడం. ఆవిడ రోల్ బాగుంటుంది. చాలా బాగా చేసిందామె..!

ప్ర. 2013 వ సంవత్సరంలో మీ కెరీర్ ను ప్రారంభించారు. కానీ ఈ 8 ఏళ్ళలో 4 సినిమాలు మాత్రమే తీశారు?ఎందుకు సినిమా సినిమాకి ఇంతింత గ్యాప్ తీసుకుంటున్నారు?

జ.’ఏక్ మినీ కథ’ తో కలిపి 5 అండీ(నవ్వుతూ)..!బేసిక్ గా నాకు స్క్రిప్ట్ చెక్కడం బాగా అలవాటు. రాసే కొద్దీ రాస్తూనే ఉంటాను.. దానికి మెరుపులు దిద్దుతూ ఉంటాను. అందుకే సినిమా సినిమాకి ఎక్కువ టైం పట్టేసింది. కానీ ఇక నుండీ ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేయడానికి ట్రై చేస్తాను.

ప్ర. ‘మ్యాస్ట్రో’..ని అనుకున్న బడ్జెట్ లో, అనుకున్న టైంకి తీసారా?

జ.ఎస్.. ఈ మూవీని ముందుగా అనుకున్న బడ్జెట్ లోనే తీయగలిగాము.బడ్జెట్ మించనివ్వలేదు. 42 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాను. మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ..లేదంటే ఇంకా ముందే షూటింగ్ కంప్లీట్ అయ్యేది. నా గత సినిమాలు కూడా తక్కువ టైంలోనే తెరకెక్కించాను. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ 27 రోజుల్లో తీసాను, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ 45 రోజుల్లో తీసాను, ‘కృష్ణార్జున యుద్ధం’ 72 రోజుల్లో తీసాను. సో నేను స్క్రిప్ట్ కి ఎక్కువ టైం తీసుకునేది తక్కువ వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేయడానికే.! అలా అని ఇప్పుడు కూడా ఎక్కువ టైం తీసుకోను. నా దగ్గర స్క్రిప్ట్ లు రెడీగా ఉన్నాయి.(నవ్వుతూ)

ప్ర.’కృష్ణార్జున యుద్ధం’ మూవీ రాంచరణ్ గారితో చేయాలనుకున్నారట? నిజమేనా?

జ. లేదు. చరణ్ గారితో నేను వేరే స్క్రిప్ట్ చేయాలనుకున్నాను.’కృష్ణార్జున యుద్ధం’ కాదు. చరణ్ గారిని కలిసి ఓ స్క్రిప్ట్ వివరించాను. ఆయన నుండీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆయన చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.కాబట్టి నేను కూడా వేరే ప్రాజెక్టులు చూసుకోవాల్సి వచ్చింది.

ప్ర. సో స్టార్ హీరోల కోసం కూడా వర్క్ చేయడానికి రెడీ అవుతున్నారు.?

జ.రెడీగా ఉన్నానండీ.. కానీ మనం అనుకుంటే అది అవ్వదు… స్క్రిప్ట్ డిసైడ్ చెయ్యాలి.

ప్ర. ‘మ్యాస్ట్రో’ గురించి ఫైనల్ గా ఒక్క మాటలో ఆడియెన్స్ కు ఏం చెబుతారు.?

జ.’మ్యాస్ట్రో’ మూవీ చాలా బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది అని నమ్ముతున్నాను.

Share.