బొంభాట్ సినిమా రివ్యూ & రేటింగ్!

“ఈ నగరానికి ఏమైంది?” ఫేమ్ సుశాంత్ రెడ్డి కథానాయకుడిగా నటించిన రెండో చిత్రం “బొంభాట్” . సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ప్రోమోలకు కనీస స్థాయి రెస్పాన్స్ లభించలేదు. మరి సినిమా ఏస్థాయిలో ఉందొ చూడండి.

కథ: పుట్టడంతోనే దురదృష్టాన్ని బొడ్డు పేగుకు తగిలించుకొని పుట్టిన కుర్రాడు విక్కి (సుశాంత్ రెడ్డి). విక్కీని ముట్టుకుంటే మసి అని అతడి తల్లిదండ్రులే కాక ఫ్రెండ్స్, చుట్టుపక్కన జనాలు దూరం పెడతారు. మాట్లాడడానికి కూడా ఎవరూ లేకపోవడంతో ఒక సైంటిస్ట్ (శిశిర్ శర్మ)తో స్నేహం చేస్తుంటాడు. సడన్ గా సైంటిస్ట్ చనిపోతాడు. అతని కూతురు మాయ (సిమ్రాన్ చౌదరి) ను చూసుకోవాల్సిన బాధ్యత విక్కీపై పడుతుంది. గర్ల్ ఫ్రెండ్ చైత్ర (చాందిని చౌదరి)తో విక్కీకి ఉన్న సమస్యలను తీర్చుతున్న తరుణంలో మరో మ్యాడ్ సైంటిస్ట్ (మకరంద్ దేశ్ పాండే) కథలోకి ఎంటర్ అవుతాడు. అప్పటివరకు సాఫీగా సాగుతున్న విక్కీ లైఫ్ కి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇంతకీ మాయ అసలు కథ ఏమిటి? ఆమె వెనుక ఈ మ్యాడ్ సైంటిస్ట్ ఎందుకు పడుతున్నాడు అనేది “బొంభాట్” కథాంశం.

నటీనటుల పనితీరు: సుశాంత్ రెడ్డి నటుడిగా వైవిధ్యం చూపించాల్సిన అవసరం ఉంది. డైలాగ్ మోడ్యులేషన్ వరకు బాగానే ఉంది కానీ.. హావభావాల పరంగాను విభిన్నత్వం ప్రదర్శించాలి. లేదంటే మూస నటుడిగా మిగిలిపోతాడు. చాందిని చౌదరి క్యూట్ గా కనిపించాలి అనే తాపత్రయం ఎక్కువగా కనిపించింది. సిమ్రాన్ చౌదరి రోబోట్ గా నటించడానికి చాలా ఇబ్బందిపడింది. ప్రియదర్శిని సరిగా వినియోగించుకోలేకపోయారు. శిశిర్ శర్మ, మకరంద్ దేశ్ పాండేలు తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ.. వాళ్ళకంటే.. వాళ్ళిద్దరికీ డబ్బింగ్ చెప్పిన శుభలేఖ సుధాకర్ కే ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి. రెండు పాత్రలకు భలే వైవిధ్యంగా వాయిస్ అందించారు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు రాసుకున్న కథ బాగానే ఉంది కానీ.. ఆ కథను ప్రెజంట్ చేసిన తీరు మాత్రం హాస్యాస్పదంగా ఉంది. మరీ ముఖ్యంగా పొంతన లేని స్క్రీన్ ప్లే టీవీలో చూస్తున్న సినిమాని కూడా బోర్ కొట్టించింది. ఇక ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సైంటిఫిక్ థ్రిల్లర్ అనే జోనర్ లో సినిమా తీస్తున్నప్పుడు బేసిక్ సెన్స్ తోపాటు, కాస్త హోంవర్క్ కూడా ఉండాలి.

కానీ.. అవేమీ చేయకుండా చుట్టేసిన సినిమా ఇది. దాంతో చూడ్డానికి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది. కనీసం కామెడీ కూడా సరిగా వర్కవుట్ చేయలేదు. లాజిక్స్ ఉండవు అని ముందే చెప్పేసినప్పటికీ.. హీరో-హీరోయిన్ నడుమ గొడవ జరగడానికి చూపించే రీజన్స్ చాలా సిల్లీగా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పొతే మైనస్ లు కోకొల్లలు.

ఇంత సిల్లీగా ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ ను తీస్తారా అనిపిస్తుంటుంది సినిమా చూస్తున్నంతసేపు. సరే కామెడీ అనుకుందాం కనీసం సెన్సిబిలిటీస్ ఉన్నా సరిపోయేది. అది కూడా లేకుండాపోవడంతో ఈ “బొంభాట్” పరమ బోర్ కొట్టింది.

విశ్లేషణ: కథ కంటే కథనం ముఖ్యం, కథనం కంటే మేకింగ్ వేల్యూస్, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ అనేది సినిమాకి ఎంత ముఖ్యం అనేది తెలియజేసే సినిమా “బొంభాట్”. సుశాంత్ కథానాయకుడిగా ఎదగాలంటే కథా బలం మాత్రమే కాదు నిర్మాణ పరంగాను కాస్త బలగం ఉన్న చిత్రాలు చేయాలి.

రేటింగ్: 1.5/5

Share.