దిల్ రాజుపై సంచలన ఆరోపణలు!

టాలీవుడ్ అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి ఈరోజు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తున్నారు. అలానే థియేటర్ల వ్యవహారం కూడా చూసుకుంటాడు. ఈ విషయంలో శిరీష్ అతడికి సహాయం చేస్తుంటాడు. కానీ దిల్ పేరు మాత్రమే బయటకి వినిపిస్తుంటుంది. ఈ పండగకు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో విజయ్ నటించిన ‘మాస్టర్’, ‘అల్లుడు అదుర్స్’, ‘రెడ్’ సినిమాలను నైజాంలో దిల్ రాజే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ ‘మాస్టర్’ సినిమా కోసం దిల్ రాజు మిగిలిన వారికి థియేటర్లు అందకుండా చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సంక్రాంతికి తన సినిమాల విడుదల ఉన్నప్పుడు దిల్ రాజు డబ్బింగ్ సినిమాల మీద ధ్వజమెత్తారు.

అప్పటి వీడియోలను షేర్ చేస్తూ ఇప్పుడు ఆ కబుర్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ‘క్రాక్’ సినిమాను నైజాంలో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను.. దిల్ రాజుపై విమర్శలు చేశారు. ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంటే.. ఇప్పుడు థియేటర్లలో నుండి ఆ సినిమా తీసేసి ఒక డబ్బింగ్ సినిమా ‘మాస్టర్’కి దిల్ రాజు, శిరీష్ ఎక్కవ థియేటర్లు ఇచ్చారని వరంగల్ శ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. బ్లాక్ బస్టర్ హిట్ అయి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోన్న ‘క్రాక్’ సినిమాను తీసేసి ‘మాస్టర్’ సినిమాకి థియేటర్లు ఇస్తున్నారని.. ఒకప్పుడు తమిళ సినిమాలకు థియేటర్లు ఇవ్వొద్దు.. తెలుగు సినిమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని స్టేజ్ ల మీద స్పీచ్ లు ఇచ్చిన దిల్ రాజు మాట తప్పారని అన్నారు.

నైజాంలో ధియేటర్స్ విషయంలో దిల్ రాజు, శిరీష్ రెడ్డి పెత్తనాన్ని కొనసాగిస్తున్నారని.. వారి నిరంకుశపాలనకి అడ్డుకట్ట వేసే దిశగా పోరాటం చేస్తానని అన్నారు. ఎగ్జిబిటర్లను బెదిరించి థియేటర్లు అన్నీ ఆక్యుపై చేసి డిస్ట్రిబ్యూటర్లను ఇబ్బంది పెడుతున్నారని.. తన సినిమాకి ఒకలా, బయట వాళ్ల సినిమాలకు మరోలా చేస్తుంటాడని దిల్ రాజుపై ఆరోపణలు చేశారు. ఎంతోకాలంగా ఓపికతో వారి అరాచకాలను భరిస్తూ వచ్చానని.. ఇక ఓపిక నశించిందని.. తెలంగాణ దిల్ రాజు జాగీర్ కాదంటూ మండిపడ్డారు. నిర్మాతలకు తప్పుడు లెక్కలు చూపించి కోట్ల రూపాయలు దోచుకుంటూ వారిని చంపేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఈ విషయంపై ఎవరూ నోరు విప్పడం లేదని.. అందుకే ఈరోజు తను ఈ విషయంపై ప్రశ్నించాలనుకున్నట్లు వరంగల్ శ్రీను చెప్పుకొచ్చారు. దిల్ రాజుని కిల్ రాజు అంటూ నిప్పులు చెరిగారు.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Share.