ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ

బాలీవుడ్ లో స్థిరపడిన మన హైదరాబాదీ కుర్రాడు నవీన్ పోలిశెట్టి. తమిళ కుటుంబానికి చెందిన ఈ తెలుగు కుర్రాడు ఇంగ్లాంగ్ లో చేసే ఉద్యోగాన్ని వదులుకొని మరీ సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. తొలుత “ఒన్ నేనొక్కడినే, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” లాంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ అనంతరం బాలీవుడ్ డిజిటల్ మీడియాలో స్టార్ గా ఎదిగి అక్కడే సెటిల్ అయ్యాడు. ఇప్పుడు “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని కథానాయకుడిగా పలకరించడానికి వచ్చాడు. ఈ చిత్రానికి నవీన్ స్క్రీన్ ప్లే కూడా అందించడం విశేషం. మరి నవీన్ పోలిశెట్టి నటుడిగా ప్రూవ్ చేసుకొన్నాడా లేక రైటర్ గా సక్సెస్ అయ్యాడా అనేది చూద్దాం..!!

agent-sai-srinivas-athreya-movie-review1

కథ: నెల్లూరు మార్కెట్ రోడ్ లో “ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్” (ఎఫ్.బి.ఐ) అనే డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకొని, డిటెక్టివ్ కావాలనుకొనే స్నేహ (శ్రుతి శర్మ)ను అసిస్టెంట్ లా పెట్టుకొని ఆ ఊర్లో జరిగిన చిన్న చిన్న దొంగతనాలు సాల్వ్ చేస్తూ.. ఎప్పటికైనా ఒక మంచి కేస్ దొరక్కపోదా అని ఎదురుచూస్తుంటాడు. ఆ క్రమంలో దివ్య అనే అమ్మాయి రేప్ & మర్డర్ కేస్ ను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ.. దివ్య మర్డర్ కేస్ లో అనుమానితులుగా భావిస్తున్న హర్ష & అజయ్ లను ఫాలో అవ్వడం మొదలెడతాడు. కట్ చేస్తే.. హర్ష & అజయ్ హత్య కేసులో ఆత్రేయను నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేస్తారు.

తాను ఒక హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుండగా.. తనను మరో హత్య కేసులో ఇరికించడం వెనుక ఏదో పెద్ద స్కామ్ ఉందని గ్రహించిన ఆత్రేయ.. తన స్టైల్లో ఈ మూడు హత్య కేసులను ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు.

అసలు దివ్య ఎవరు? హర్ష & అజయ్ హత్య కేసుల్లో ఆత్రేయను ఇరికించడం కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఆత్రేయ ఈ చిక్కుముడుల నుండి ఎలా బయటపడ్డాడు? అనేది “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” కథాంశం.

agent-sai-srinivas-athreya-movie-review2

నటీనటుల పనితీరు: నటుడిగా నవీన్ స్టామినా గురించి ప్రత్యేకంగా ప్రశంసించాల్సిన అవసరం లేదు. కానీ.. ఈ చిత్రంలో నవీన్ కామెడీ యాంగిల్ చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాగే.. నెల్లూరు యాసలో సునాయాసంగా మాట్లాడే నవీన్ ను చూసి నోరెళ్ళబెడతారు అతడి డిజిటల్ ఫాలోవర్స్. నవీన్ తెలుగులో హీరోగా సెటిల్ అవుతాడో లేదో అనేది చెప్పలేం కానీ.. ఒక రచయితగా (ఈ సినిమాకి మనోడు స్క్రీన్ ప్లే కూడా అందించాడు) లేదా నటుడిగా మాత్రం ఆల్రెడీ సెటిల్ అయిపోయినట్లే.

శ్రుతి శర్మ ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం కాదు, సినిమాలోని పాత్రల్లో ఆమె కూడా ఒకటి. కొన్ని సన్నివేశాల్లో మిస్ అయిన లిప్ సింక్ తప్పితే అమ్మడి గురించి పెద్దగా నెగిటివ్ గా చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏమీ లేదు.

సుహాస్ ఒక్కడు తప్పితే.. ప్రధానమైన మరియు కీలకమైన పాత్రల్లో ఎక్స్ పీరియన్స్డ్ లేదా ప్రేక్షకులకు పరిచయమున్న నటులు లేకపోవడం సినిమాకి మెయిన్ మైనస్. కథ మొత్తానికి టర్నింగ్ పాయింట్స్ లాంటి క్యారెక్టర్స్ ప్లే చేసిన ఆర్టిస్ట్స్ ఆ ట్విస్ట్ లో ఉన్న దమ్మును ఎలివేట్ చేయలేకపోయారు. అందువల్ల కథలో ఉన్న ఇంపాక్ట్ కథనంలో కనిపించలేదు.

agent-sai-srinivas-athreya-movie-review3

సాంకేతికవర్గం పనితీరు: సౌండ్ డిజైనింగ్ (అజిత్ అబ్రహాం జార్జ్) ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అలాగే ఎడిటింగ్ కూడా. కానీ.. సినిమాకి చాలా కీలకమైన స్క్రీన్ ప్లేను డైరెక్టర్ స్వరూప్ & యాక్టర్ నవీన్ పోలిశెట్టి కలిసి మరీ రాసుకొన్న స్క్రీన్ ప్లే మీద ప్రేమ ఎక్కువై.. కథ కంటే కథనానికి ఎక్కువ స్కోప్ క్రియేట్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే.. సినిమాలో ట్విస్ట్ అనేది ఒక బ్యాంగ్ లా ఉండాలి. ఉదాహరణకి “అవే కళ్ళు” లాంటి క్లాసిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో విలన్ ఎవరు అనేది రివీల్ అవ్వడానికి ముందే ఆ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసి.. అనంతరం అతడే మెయిన్ విలన్ అనే ట్విస్ట్ ను రివీల్ చేసేసరికి ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ కు గురవుతారు, ఆ తర్వాత సదరు విలన్ ఆ హత్యలను ఎందుకు చేశాడు అనేది చెప్పే విధానం కూడా చాలా కన్విన్సింగ్ గా ఉంటుంది. “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”లో మిస్ అయిన విషయం అదే.

ప్రతినాయకులకు క్లైమాక్స్ వరకూ కథతో కానీ సినిమాతో కానీ సంబంధం లేదన్నట్లు చివరివరకూ చూపించలేదు, వారి క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయలేదు. దాంతో వాళ్ళే విలన్స్ అని తెలిసే టైమ్ కి పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. అలాగే.. మెయిన్ ట్విస్ట్ ను రివీల్ చేసిన విధానం కాస్త పేలవంగా ఉంటుంది. “ఇంత పెద్ద నేరమా అని ఆడియన్స్ ఎగ్జైట్ అవ్వాల్సిన సమయంలో.. వార్నీ ఇదేనా” అనుకొంటారు. నిజానికి సినిమాలో చూపించిన పాయింట్ చాలా సీరియస్ కానీ.. ఆ సీరియస్ నెస్ ను దర్శకుడు క్యారీ చేయలేకపోయాడు. ముఖ్యంగా.. సెకండాఫ్ లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ మెంట్స్ కోసం మరీ ఎక్కువగా సాగదీశాడు. అలాగే అసలు ఆత్రేయ డిటెక్టివ్ ఎందుకు అవ్వాలనుకొన్నాడు? అనే విషయానికి సమాధానం లేకపోగా.. క్లైమాక్స్ లో విలన్స్ ఎక్కడికి వెళ్లారు అనేది అంత ఈజీగా ఎలా ఛేదించగలిగాడు? వంటి విషయాలకు లాజిక్స్ సరిగా లేవు. దాంతో సినిమాలో ఏదో లోపించింది అనే భావన కలుగుతుంది.

agent-sai-srinivas-athreya-movie-review4

విశ్లేషణ: “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” అనే చిత్రాన్ని క్యారెక్టర్ బేస్డ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కించాలా లేక సస్పెన్స్ బేస్డ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించాలా అనే విషయంలో దర్శక బృందం పడిన కన్ఫ్యూజన్ ప్రేక్షకుడికీ కలుగుతుంది. ఆకట్టుకొనే స్క్రీన్ ప్లే, మంచి పెర్ఫార్మెన్స్ లు ఉన్నప్పటికీ.. కాస్త ఎక్కువగా సాగదీసిన ట్విస్టులు అప్పటివరకూ క్రియేట్ అయిన ఇంట్రెస్ట్ ను ఇంపాక్ట్ ను కాస్త తగ్గిస్తాయి. ఆ విషయాల్లోనూ దర్శక బృందం కాస్త జాగ్రత్తపడి ఉంటే “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” తెలుగు ఇండస్ట్రీలో మరో మైలురాయి చిత్రంగా నిలిచిపోయేది. పైన పేర్కొన్న విషయాలు లోపించడంతో ఒక ఎబౌ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. నవీన్ పోలిశెట్టి కోసం మాత్రం ఈ చిత్రాన్ని కచ్చితంగా ఒకసారి చూడొచ్చు.

agent-sai-srinivas-athreya-movie-review5

రేటింగ్: 2.5/5

Share.