అదుగో

వైవిధ్యమైన చిత్రాల దర్శకుడిగా పేరొందిన రవిబాబు దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం “అదుగో”. పంది పిల్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ ఎక్స్ పెరిమెంటల్ కాన్సెప్ట్ ఫిలిమ్ చాన్నాళ్లపాటు ల్యాబ్ లో మగ్గి ఎట్టకేలకు దీపావళి పండుగ సందర్భంగా నేడు (నవంబర్ 7) విడుదలైంది. మరి రవిబాబు కొత్త ప్రయత్నం ఫలించ్చిందో లేదో చూద్దాం..!! adhugo-movie-telugu-review1

కథ : హైద్రాబాద్ లో జరిగే ఓ పందుల రన్నింగ్ రేస్ లో గెలవడం కోసం ఒంటి మీద మూడు మచ్చలున్న పంది కోసం వెతుకుతుంటాయి రెండు గ్యాంగ్ లు. అదే మచ్చల పంది లోపల ఉన్న మెమరీ కార్డ్ కోసం వెతికే సిక్స్ ప్యాక్ సత్తి (రవిబాబు) అండ్ గ్యాంగ్. ఆ మెమరీ కార్డ్ లో ఉన్న ఆస్తుల వివరాల ఒరిజినల్ ఓనర్ అయిన బెజవాడ దుర్గా కూడా ఆ పంది కోసం వెతుకుతుంటాడు. ఈ నలుగురికీ తోడు.. కుక్కపిల్ల అనుకోని పొరపాటున అదే పంది పిల్లను తన గర్ల్ ఫ్రెండ్ రాజీ (నభ నటేష్)కు గిఫ్ట్ గా ఇచ్చిన బోయ్ ఫ్రెండ్ అభిషేక్ (అభిషేక్ వర్మ). ఇలా అందరూ కట్టగట్టుకొని బంటి అనే పంది పిల్ల చుట్టూ “అదుగో పంది” అంటూ అరుచుకుంటూ.. గెంతుకుంటూ పరిగెట్టడమే “అదుగో” కథాంశం. adhugo-movie-telugu-review2

నటీనటుల పనితీరు : సాధారణంగా ఎంత బ్యాడ్ ఫిలిమ్ అయినా ఒకడు కాకపోయినా ఒకడైనా మంచి నటుడు ఉంటాడు. కానీ.. రవిబాబు సెలక్షన్ అలా ఉందో లేక కావాలనే చెత్తగా నటింపజేశాడో తెలియదు కానీ.. రవిబాబు మునుపటి సినిమాల్లో వారి పాత్రలకు న్యాయం చేసిన నటీనటులు కూడా ఈ చిత్రంలో “నేను అంటే నేను” అంటూ వరెస్ట్ పెర్ఫార్మెన్స్ తో పంది పిల్ల కంటే ఎక్కువగా విసిగించారు.

పంది పిల్లను పెంచుకొనే కుర్రాడిగా సాత్విక్ వర్మ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించుకొన్నాడు. కథ రాసుకొన్నప్పుడు కానీ.. సదరు నటీనటుల చేత నటింపజేసేప్పుడు రవిబాబు ఒక్కసారైనా నవ్వుకున్నాడో తెలియదు కానీ.. విలన్ల క్యారెక్టరైజేషన్లు చూస్తున్నంతసేపు వాళ్ళు చేసే చెత్త కామెడీకి నవ్వాలో ఏడవాలో అర్ధం కాని కన్ఫ్యూజన్ లో ఆడియన్స్ మాత్రం కుదిరితే ఇంటర్వెల్ లో వెళ్లిపోవడం లేదా చివరివరకూ కూర్చుని ఆ గోలని భరించడం తప్ప చేసేదేమీ లేక మిన్నకుండిపోతారు. adhugo-movie-telugu-review3

సాంకేతికవర్గం పనితీరు : ఆ పంది పిల్లను తెరపై చూపించడం కోసం వాడిన లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ టెక్నాలజీని తప్ప మెచ్చుకోదగ్గ సాంకేతికత సినిమాలో ఎక్కడా కనిపించలేదు. ప్రశాంత్ ఆర్.విహారీ సంగీతం కానీ.. ఎన్.సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ కానీ రవిబాబు దర్శకత్వ ప్రతిభ ముందు కనిపించలేదు.

అసలు రవిబాబు ఏం తీద్దామనుకున్నాడు, ఏం తీశాడు అనే విషయం కాసేపు పక్కన పెడితే. పంది పిల్లతో సినిమా అని చెప్పి పబ్లిసిటీ కోసం ఒక పంది పిల్లను పట్టుకొని ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఏ.టి.ఎం దగ్గర లైన్ లో నిలబడడం వరకూ బాగానే ఉంది. కానీ.. సినిమాలో ఒక్కటంటే ఒక్క సన్నివేశంలోనూ ఆయన చంకనెక్కించుకొన్న పంది పిల్ల మాత్రం కనిపించలేదు. పోనీ.. పంది పిల్లతో నటింపజేయడం కష్టం కాబట్టి కుదరలేదు అని సరిపెట్టుకొన్నా.. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు అంటే సినిమాలో కాస్తో కూస్తో కంటెంట్ ఉంటుంది కదా అని ఎండ్ టైటిల్ అయిపోయేవరకూ థియేటర్లో కూర్చున్నా కూడా సురేష్ బాబుని ఎగ్జైట్ చేసిన కంటెంట్ ఏమిటో కనిపించలేదు.

పైగా.. ఎమోషన్ పండించడం కోసం రెండు సీన్స్ లో పంది పిల్లతో కార్పించిన నాలుగైదు గ్రాఫిక్స్ కన్నీళ్ళు చూసి ఎమోషన్ ఫీల్ అవ్వాలో లేక ఇంకేమైనా చేయాలో అర్ధం కాదు. ఎహే ఇదంతా కాదు కనీసం తెల్ల పంది పిల్ల చేసే అల్లరిని ఎంజాయ్ చేద్దాం అంటే ఆ పంది కాస్త బాగుంది అనుకొనేలోపు.. ఆ వెనుక ఉన్న రౌడీ గ్యాంగ్ ను చూసేసరికి.. అప్పుడే బురదలో దొర్లి వచ్చిన మాంచి సీమ పందులను చూసిన అనుభూతి కలిగి లేని చిరాకు పుట్టుకొస్తుందాయే.

సొ, ఫర్ ది ఫస్ట్ టైమ్ రవిబాబు కేవలం దర్శకుడిగానే కాక రైటర్ గా, యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గానూ ఫెయిల్ అయిన సినిమా “అదుగో”.adhugo-movie-telugu-review4

విశ్లేషణ : ఇప్పటికే చాలా చెప్పేయడంతో ఈ కాలమ్ దగ్గర ఏం రాయాలో తోచకుంది. అయినా.. సినిమాలో లేని కంటెంట్ రివ్యూలో మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. సొ, చిన్నప్పుడు డి.డి చానల్ లో వచ్చిన “పందుల పెంపకం” కార్యక్రమాన్ని ఆసక్తిగా చూసినవాళ్లెవరైనా ఉంటే “అదుగో” సినిమా చూడడానికి సాహసించండి. లేదంటే హ్యాపీగా సుప్రీం కోర్ట్ రూల్ ప్రకారం దీపావళి సెలబ్రేట్ చేసుకొని కుటుంబంతో సంతోషంగా ఉండండి. adhugo-movie-telugu-review5

రేటింగ్ : 1/5

(నోట్: ఆ “1” కూడా పంది పిల్లను లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్ కోసం మాత్రమే ఆ రేటింగ్).

Share.