36 వయసులో సినిమా రివ్యూ & రేటింగ్!

జ్యోతిక ప్రధాన పాత్రలో సూర్య నిర్మించిన చిత్రం “36 వయసులో”. మలయాళ చిత్రం “హౌ ఓల్డ్ ఆర్ యు”కు రీమేక్ ఇది. 36 ఏళ్ల వయసు దాటిన ఓ మహిళ ఎదుర్కొన్న సమస్యల సమాహారమే ఈ చిత్రం. తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆహా యాప్ తెలుగులో విడుదల చేసింది. జ్యోతిక నటనకు, సినిమా కాన్సెప్ట్ కు విశేషమైన స్పందన రాబట్టుకున్న ఈ చిత్రం తెలుగువారిని ఏమేరకు ఆకట్టుకోగలుగుతుందో చూద్దాం..!!


కథ: వసంతి (జ్యోతిక) గవర్నమెంట్ ఆఫీస్ లో పద్నాలుగేళ్ళుగా వర్క్ చేస్తున్న సగటు మధ్యతరగతి గృహిణి. భర్త, పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాలనేదే వసంత కోరిక. అనుకోని విధంగా ఆమె కలలు ఒక్కసారిగా మటుమాయమవుతాయి. తన కల సాకారం చేసుకోవడానికి వసంత ఏం చేసింది? ఆమె జీవితాన్ని మార్చేసిన సంఘటన ఏమిటి? అనేది “36 వయసులో” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.


నటీనటుల పనితీరు: వసంతి పాత్రలో జ్యోతిక నటించింది, జీవించింది అనేకంటే బిహేవ్ చేసింది అనొచ్చు. ఒక సగటు ఇల్లాలిగా ఆమె నటన అభినందనీయం. సినిమా చూస్తున్నంతసేపు మన ఇంట్లో అమ్మను చూస్తున్నట్లే అనిపిస్తుంది. నిజమే కదా మన ఇంట్లో అమ్మ ఉద్యోగం చేస్తున్నా, చేయకపోయినా నిమిషం కూడా ఖాళీగా లేకుండా గిరగిర తిరిగేస్తుంటుంది. జ్యోతికలో అమ్మ కనిపిస్తుంది. అందుకే ఆ పాత్ర అంతగా పండింది. రెహమాన్, నాజర్, అభిరామిలు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.


సాంకేతికవర్గం పనితీరు: మలయాళ దర్శకుడైన రోషన్ ఆండ్రూస్ తమిళ వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించారు. అందువల్ల కథలోని ఆత్మ మిస్ అవ్వలేదు. ఒక సగటు గృహిణి తలచుకుంటే ఏమైనా చేయగలదు అని ప్రూవ్ చేయడంతోపాటు.. సోషల్ మీడియా ట్రోలింగ్ ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? మన ఆహార పద్ధతులు మన ఆరోగ్యాన్ని ఎలా భ్రష్టు పట్టిస్తున్నాయి? వంటి విషయాలను వివరించిన తీరు బాగుంది.

“హు డిసైడ్స్ ది ఎక్స్ పైరీ డేట్ ఆఫ్ ఎ ఉమెన్” అనే ప్రశ్న సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడి గుండెకు తగులుతుంది. ఆడతనాన్ని, అమ్మతనాన్ని వివరించిన విధానం అలరిస్తుంది. కథ కంటే కథనం భలే అలరిస్తుంది. ఒక చిన్నపాటి ఆసరా ఇస్తే మహిళ ఏదైనా సాధించగలదు అని మరోమారు ప్రూవ్ చేసిన సినిమా ఇది.

సినిమాటోగ్రఫీ, సంగీతం, ప్రొడక్షన్ డిజైన్ డీసెంట్ గా ఉన్నాయి. కాకపొతే అయిదేళ్ళ క్రితం సినిమా కావడంతో సినిమాలోని సందర్భాలకి కనెక్ట్ అవ్వడం కాస్త కష్టమవుతుంది. అయితే.. ఎమోషనల్ గా మాత్రం సినిమా భలే ఆకట్టుకుంటుంది.

విశ్లేషణ: ప్రతి మహిళ, ప్రతి కుటుంబం, ప్రతి భార్య, ప్రతి భర్త, తప్పకుండా చూడాల్సిన చిత్రం “36 వయసులో”. ఈ వీకెండ్ కి ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ, చూడాల్సిన సినిమా ఇది.


రేటింగ్: 2.5/5

Share.