మహేష్ – అనిల్ రావిపూడి చిత్రానికి విజయశాంతి గ్రీన్ సిగ్నల్..?

సీనియర్ నటుల్ని, నటీమణులని మళ్ళీ సినిమాల్లో ఏదో ఒక ముఖ్య పాత్రలో తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్లో ఓ ట్రెండ్ అయ్యింది. తద్వారా ఆయా చిత్రాలకి అదనపు ఆకర్షణగా నిలవడం.. అలాగే ఆ పాత్రలకి మంచి పేరు వస్తే.. వారికి మరిన్ని అవకాశాలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. అలా వాళ్ళు మళ్ళీ సినిమాల్లో బిజీగా మారడం జరుగుతుంది. నదియా .. ఖుష్బూ .. టబు .. భూమిక .. ఇలా వచ్చిన వాళ్ళే. అలా అని అందరూ సక్సెస్ అవుతారనీ చెప్పలేం ‘ఎం.సి.ఏ’ చిత్రంలో ఆమని, ‘జయ జానకి నాయక’ చిత్రంలో వాణి విశ్వనాధ్ పాత్రలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక విషయమేంటంటే ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా వున్న సీనియర్ హీరోయిన్ విజయశాంతిని కూడా సినిమాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి.

రానా .. సాయిపల్లవి కాంబినేషన్లో దర్శకుడు వేణు ఊడుగుల ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించిందట. ఇక మహేష్ బాబుతో అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోయే సినిమాలో కూడా ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించారట. మొదట ఆవిడ ఒప్పుకోలేదట.. అయితే ఆ పాత్ర ప్రాధాన్యత .. కాంబినేషన్ సీన్స్ గురించి వివరించాక ఆమె పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిందని తెలుస్తుంది. 30 ఏళ్ళ క్రితం మహేష్ బాబు తల్లిగా ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రం నటించింది విజయ శాంతి. ఇపుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయితే బాగుణ్ణు.. అని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Share.