అదరగొట్టిన ప్రభాస్ సాహో టీజర్

ప్రభాస్ అభిమానులకు పండుగ మొదలైపోయింది. ప్రభాస్ నటించిన బాహుబలి కంక్లూజన్ మూవీ రేపు విడుదలవుతుండగా, అంతకంటే ముందుగానే నెక్స్ట్ సినిమా సాహో.. ఈ రోజు రిలీజ్ అయి అదరగొట్టింది. గత ఐదేళ్లుగా బాహుబలిగా కనిపించిన ప్రభాస్ ఈ టీజర్ లో సరికొత్తగా కనిపించారు. అతి తక్కువకాలంలోనే ప్రభాస్ తన లుక్ ని మార్చుకోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 30 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో ప్రభాస్ ఒకే ఒక్క డైలాగ్ చెప్పారు. అయినా రోమాలు నిక్క బొడుచుకుంటున్నాయి. అందుకు కారణం యువ దర్శకుడు సుజీత్ రాసుకున్న సీన్ అని స్పష్టంగా తెలుస్తోంది.

రక్తపు మడుగులో ఉన్న ప్రభాస్ ని చూసి.. “తన రక్తం చూస్తేనే అర్ధమవుతుందిరా.. వాడిని చచ్చేంతలా కొట్టారని” అని విలన్ ఆనందపడుతుండగా.. అతని అనుచరుడు భయపడుతూ “సార్. అది అతని రక్తం కాదు.. మనవాళ్లది” అని చెప్పగానే ప్రభాస్ ముఖంపై పడిన రక్తాన్ని తుడుచుకుంటూ “ఇట్స్ షో టైమ్” అంటూ డైలాగ్ పేలుస్తాడు. టీజర్ లో హీరోయిజాన్ని అద్భుతంగా చూపించి డైరక్టర్ శెభాష్ అనిపించుకున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు. ఆకాశం లో ఫైట్స్ వంటి అద్భుత యాక్షన్ సీన్స్ ఉండే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.