రోగ్

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నిర్మాత సి.ఆర్.మనోహర్ కుమారుడు ఇషాన్ హీరోగా పరిచయమైన చిత్రం “రోగ్”. మన్నారా చోప్రా, అంజేలా కథానాయికలుగా నటించిన ఈ చిత్రం నేడు (మార్చి 31) విడుదలైంది. అసలే హిట్లు లేక హీటెక్కిపోయి ఉన్న పూరీకి “రోగ్” ఎలాంటి రిజల్ట్ కట్టబెట్టిందో చూద్దాం..!!

కథ : అంజలి (అంజేలా)ను గాఢంగా ప్రేమించి ఆమెకు ఇష్టం లేకుండా ఆమె అన్నయ్య (పోలీస్ కమీషనర్) చేస్తున్న పెళ్లిని అడ్డుకొనే ప్రయత్నంలో పోలీసుల చేత కాల్చబడి రెండేళ్లు జైలు శిక్ష కూడా అనుభవిస్తాడు. కట్ చేస్తే.. అంజలి కావాలనే తనను మోసం చేసిందని, పెళ్లికొడుకు తనకంటే బెటర్ పొజీషన్ లో ఉన్నాడు కాబట్టి అతడే బెటర్ అనుకోని తనకు హ్యాండ్ ఇచ్చిందని తెలుసుకొని అప్పట్నుంచి అమ్మాయిలపై అసహ్యం పెంచుకొని బ్రతుకుతుంటాడు. అయితే.. పోలీసులతో గొడవపడేప్పుడు తన కారణంగా కాళ్ళు చచ్చుబడిపోయిన పోలీస్ కానిస్టేబుల్ ఫ్యామిలీకి తోడుగా ఉండాలని నిశ్చయించుకొంటాడు. అప్పట్నుంచి వాళ్ళ అప్పులు, అవసరాలు తీర్చడం కోసం ఒక సేట్ (పోసాని) దగ్గర రికవరీ ఏజెంట్ గా పనిచేస్తూ.. మధ్యలో ఆటో నడుపుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఇలా సాగుతున్న రోగ్ బాబు కథలోకి ఎంటరవుతాడు సైకో (ఠాకూర్ అనూప్ సింగ్). తాను ప్రేమించిన అంజలి ఇప్పుడు రోగ్ ను ప్రేమిస్తుందని తెలుసుకొని .. వాడ్ని చంపి అంజలిని సొంతం చేసుకోవాలనుకొంటాడు. రోగ్-సైకోల మధ్య పోరాటం ఎలా సాగింది.. చివరికి ఎవరు గెలిచారు? అనేది “రోగ్” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు : ఇషాన్ కు ఒక కమర్షియల్ హీరోకు కావాల్సిన అన్నీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నటన పరంగానూ పర్వాలేదనిపించుకొన్నాడు. కానీ.. సినిమాలో అతడి క్యారెక్టర్ ను ఏ ఒక్క సన్నివేశంలోనూ సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల ఇషాన్ ప్రతిభ ప్రేక్షకులకు అగుపించే అవకాశాలు లేవు. మెయిన్ హీరోయిన్ మన్నార మందంగా, రెండో హీరోయిన్ అంజేలా రెచ్చగొట్టేలా ఉన్నారు. ఇద్దరూ అందాల ప్రదర్శనతో మినహా ఏ ఒక్క సన్నివేశంలో కనీస స్థాయి హావభావాలు కూడా ప్రదర్శించలేకపోవడం గమనార్హం. విలన్ పాత్రధారి ఠాకూర్ అనూప్ సింగ్ ను “సైకో”గా బాగానే ఎస్టాబ్లిష్ చేయగా.. అతడి పాత్ర చేత కామెడీ చేయించాలని ప్రయత్నించి ప్రేక్షకుడి సహనాన్ని వీరలెవల్లో పరీక్షించారు. ఇక మిగతా పాత్రధారులంతా తమ నటనతో పాత్రలను పండించాలని ప్రయత్నించినా.. కథ-కథనాల్లో పస లేక మిన్నకుండిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు : సునీల్ కశ్యప్ హిందీ-తెలుగు ట్యూన్స్ కలిపి కొత్తగా ఏదో ట్రై చేద్దాం అనుకొన్నాడు కానీ.. అది పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కానీ.. విలన్ క్యారెక్టర్ కు “సైకో సకస్య..” అంటూ మాటిమాటికీ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్కడలేని చిరాకు తెప్పిస్తుంది. ముఖేష్.జి సినిమాటోగ్రఫీ ఒక్కటే ఈ సినిమాలో ప్లస్ అని చెప్పుకోదగ్గది. అయితే.. సినిమా చిరాకు తెప్పిస్తుండడంతో ఆయన కెమెరాలో అందంగా బంధించిన ఫ్రేమ్స్ ను కూడా ఎంజాయ్ చేయలేం. ఎడిటింగ్ ఈ సినిమాకి మైనస్. ఉన్నట్లుండి వచ్చే సీన్లు, కంటిన్యూటీ లేకపోవడం ఉన్నట్లుండి వచ్చే స్లైడింగ్ ఎఫెక్ట్స్ అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడికి ఇంకాస్త చిరాకును యాడ్ చేసి.. దాన్ని విరక్తిగా మారుస్తాయి. నిర్మాణ విలువలు, యాక్షన్ సీక్వెన్స్ లు మాత్రం టాప్ లెవల్ లో ఉన్నాయి. మామూలుగా బ్యాంకాక్ వెళ్ళి తన సినిమా కథలను రాసుకొనే పూరీ జగన్నాధ్.. “రోగ్” కథను మాత్రం తన కేవ్ (ఆయన ఇంటికి పెట్టుకొన్న పేరు) ప్రశాంతంగా కూర్చొని తనకిష్టమైన బ్రాండ్ వోడ్కా తాగుతూ రాశాడేమో అనిపిస్తుంది. ఇప్పటివరకూ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఓ లిస్ట్ రాసి.. “అత్యంత చెత్త సినిమా ఏది?” అని అడిగితే.. “రోగ్” ముందు వరుసలో చిన్నసైజు దుప్పటి వేసుకొని మరీ కూర్చుంటుంది. నీచమైన కథ-కథనాలు, పూరీ పైత్యానికి నిదర్శనం లాంటి రోమాంటిక్ (అని మనం అనుకోవాలి) సన్నివేశాలు చూసి.. “నెక్స్ట్ బాలయ్యతో ఎలా తీస్తాడో” అని నందమూరి అభిమానులు భయపడే స్థాయిలో ఉంది “రోగ్”.

విశ్లేషణ : ఈ మాయ “రోగ్”కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!

రేటింగ్ : 1.5/5

Share.