రాధ

సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా హీరోగా నటించిన సినిమా “రాధ”. శర్వా సరసన లావణ్యత్రిపాఠి కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా చంద్రమోహన్ దర్శకుడీగా పరిచయమయ్యాడు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయకుండానే పోలీస్ ఆఫీసర్ గా సెలక్ట్ అయ్యి డైరెక్ట్ గా ట్రైనింగ్ కి వెళ్ళిపోతాడు రాధ (శర్వానంద్). తాను ఉన్న ఏరియాలో క్రైమ్ రేట్ జీరో చేయడమే మనోడి పని. తాను పనిచేసే ఊర్లోనే ఉండే రాధ (లావణ్య త్రిపాఠి)ను ప్రేమలో పడేసి.. అక్కడ్నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హైద్రాబాద్ వస్తాడు. కట్ చేస్తే.. తెలంగాణ సి.యం వయోభారం కారణంగా రిటైర్ అవుతుండడంతో నెక్స్ట్ సి.యం ఎవరనే ఆసక్తి నెలకొంటుంది. సుజాత (రవికిషన్), ఆశిష్ విద్యార్ధి (సూర్రెడ్డి) మధ్య పోటీ నెలకొంటుంది. హైద్రాబాద్ కి ట్రాన్స్ ఫర్ అయిన రాధ కారణాంతరాల వలన సుజాత (రవికిషన్) సెక్యూరిటీ చీఫ్ గా జాయిన్ అవుతాడు. అప్పట్నుంచి సుజాత పతనం ప్రారంభమవుతుంది. ఆ పతనం వెనుక రాధ పాత్ర ఎంతవరకూ ఉంది? సుజాత సీయం అయ్యాడా లేదా అనేది “రాధ” కథాంశం.

నటీనటుల పనితీరు : కథ-కథనాల్లో విషయం లేకపోయినా శర్వానంద్ మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు. ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొన్నాడు. పస లేకుండా సాగుతున్న కథలో శర్వానే ప్రేక్షకులను అలరించిన ఏకైక వ్యక్తి. లావణ్య త్రిపాఠి ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి అందంగా కనిపించడానికి ప్రయత్నించింది కానీ.. మేకప్ సెట్ అవ్వక ఢీలాపడిపోయింది. నటన విషయంలోనూ ఈ అందాల రాక్షసి అలరించలేకపోవడం గమనార్హం. రవికిషన్ పాత్ర “రేసుగుర్రం” సినిమాలోని మద్దాలి శివారెడ్డి పాత్రను తలపించింది. అయితే.. పాత్ర స్వభావం స్ట్రాంగ్ గా లేకపోవడంతో క్యారెక్టర్ పండలేదు. క్యారెక్టరే పండకపోతే.. ఇక ఆ క్యారెక్టర్ ద్వారా పండాల్సిన విలనిజం ఎందుకు ఎలివేట్ అవుతుంది. షకలక శంకర్ పంచ్ లు పెద్దగా పేల్లేదు, సప్తగిరి “నాన్నకు ప్రేమతో” స్పూఫ్ తో బాగా నవ్వించాడు. అక్ష రెండు సన్నివేశాలు, ఒక పాటకు పరిమితమైపోయింది. ఉన్నంతలో అందాలతో కనువిందు చేసింది.

సాంకేతికవర్గం పనితీరు : రాధన్ పాటలన్నీ దాదాపుగా ఎక్కడో విన్నట్లుగానే ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సోసోగా ఉంది. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించాడంటే నమ్మబుద్ధి కాదు. ఔట్ పుట్ క్వాలిటీ బానే ఉన్నా.. కెమెరా ఫ్రేమ్స్ ఏవీ కూడా అతని స్థాయిలో లేవు. టింట్ కలరింగ్ కొత్తగా ట్రై చేయాలనుకొన్నా.. డి.ఐ సరిగా చేయని కారణంగా మిక్సింగ్ సీన్ కి సింక్ అవ్వలేదు. దర్శకుడు చంద్రమోహన్ రాసుకొన్న కథ-కథనాల్లో ఎక్కడా సింకింగ్ లేదు. అసలు హీరో-విలన్ ల మధ్య జరిగే అంతర్యుద్ధంలో ఎక్కడా ఆసక్తికరమైన పాయింట్ లేదు. అలాగే.. హీరో క్యారెక్టర్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. అసలు హీరో పోలీస్ కావాలని ఎందుకు తపించాడు, విలన్ ని ఎందుకు టార్గెట్ చేశాడు లాంటి లాజిక్ అవసరమున్న ఏ ఒక్క ప్రశ్నకీ సరైన లాజిక్ తో కూడిన సమాధానం చెప్పలేదు. ఆ కారణంగా హీరో క్యారెక్టరైజేషన్ మాత్రమే కాక అతని గోల్ కూడా జస్టీఫికేషన్ లేకుండా మిగిలిపోయింది.

విశ్లేషణ : వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ సక్సెస్ కెరీర్ కు దిష్టి చుక్కలా మిగిలిపోయే సినిమా “రాధ”. కమర్షియల్ అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. అయితే.. కథ-కథనాల్లో ఎక్కడా ఎనర్జీ లేకపోవడం, క్యారెక్టరైజేషన్స్ ను సరిగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం లాంటివి సినిమాకి మైనస్ గా మారాయి.

రేటింగ్ : 1.5/5

Share.